దోమలు, ఈగలు, బొద్దింకలు పరోక్షంగా మనుషుల ఆరోగ్యాలకు హాని చేస్తున్నాయి. దోమలతో వచ్చే మలేరియా, డెంగ్యూ వంటివి కొన్ని సమయాల్లో మనుషుల ప్రాణాలకే ముప్పు సంభవించే అవకాశాలున్నాయి. అయితే ఐస్ లాండ్ దేశంలో దోమలు లేనేలేవు. దోమలే కాదు పాములు కూడా ఆ దేశంలో లేవు. ఆ దేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణంగా చెబుతారు. ఈ ఏడాది అక్టోబర్ చివరల్లో ఓ ఆడ, మగ దోమను స్థానికులు గుర్తించారు. ఈ రెండు దోమలు దేశంలోకి ఎలా వచ్చాయనే విషయమై అధికారులు కారణాలు తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఐస్‌లాండ్‌లో దోమలు ఎందుకు లేవు?
ఐస్ లాండ్ లో ఇప్పటివరకు దోమలు లేకపోవడానికి అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులే కారణంగా చెబుతున్నారు. ఈ ద్వీప దేశంలో విపరీతమైన చలి ఉంటుంది. చలికాలం ముగిసిన తర్వాత కూడా 40 రోజుల్లోనే మళ్లీ చలి ప్రారంభం అవుతుంది. ఇక్కడి భూమిలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది దోమలు పెరుగుదలను నిరోధిస్తుంది. ఐస్ ల్యాండ్ లో దోమలు గుడ్లు పెట్టి పొదగడానికి స్థిరమైన ఉష్ణోగ్రతలు ఉండవు. ఇది ప్రధానంగా దోమలు వృద్ది చెందకుండా అడ్డుకుంటున్నాయి. ఇక్కడ మంచుకొండలు, అగ్ని పర్వతాలతో నిండిఉంటుంది. ఇలాంటి వాతావరణంలో దోమలు బతకలేవు. నిల్వ ఉండే నీటిలో దోమల లార్వా వేగంగా పెరుగుతుంది. కానీ, ఇక్కడ నీరు నిల్వ ఉండే ప్రదేశాలు చాలా తక్కువ. నీటి వనరులన్నీ మంచుతో కప్పబడి ఉంటాయి. దీంతో దోమల సంతానోత్పత్తి జరగదు.
పక్కనే ఉన్న గ్రీస్ లాండ్ లో
అగ్నిపర్వత క్షేత్రాలు, ఎత్తైన హిమానీనదాలు, వేడినీటిబుగ్గలతో కూడిన అద్బుత ప్రకృతి దృశ్యాలున్న ఐస్ లాండ్ లో దోమలు లేవు. కానీ, ఇతర కీటకాలు ఎక్కువే. మనిషి శరీరంలోని రక్తాన్ని పీల్చే కీటకాలు ఇక్కడ ఉన్నాయి. కానీ, దోమలు లేవు. గ్రీస్ లాండ్, నార్వే వంటి పక్క దేశాల్లో దోమలున్నాయి. కానీ, ఐస్ లాండ్ లో మాత్రం లేవు. మీకు వాతావరణం నచ్చకపోతే ఐదు నిమిషాలు వెయిట్ చేయండి… అని ఐస్ లాండ్ లో సామెత. అంటే ఒక రోజుల్లో భిన్న వాతావరణ పరిస్థితులు అక్కడ ఉంటాయి. ఐస్ లాండ్ పక్కనే ఉన్న గ్రీస్ లాండ్ లో శీతాకాలం చివరలో మంచు కరగడం ప్రారంభమైన సమయంలో దోమలు గుడ్లు పెడతాయి.
దోమలు లేకున్నా…..
ఐస్ లాండ్ లో దోమలు లేకున్నా వాటిని పోలిన కీటకాలున్నాయి. కందిరీగలు, దోమలను పోలిన తరహాలో ఉండే ఇతర కీటకాలు ఎక్కువ. దోమల రూపంలో ఉండే కీటకం కాటు వేయదు. కానీ దోమ తరహాలోనే ఉంటుంది. చిన్న ఈగల మాదిరిగా ఉంటుంది. ఇది కరిస్తే దురద వస్తుంది. వేసవిలో ఇక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్లిన సమయంలో ఇలాంటి కీటకాలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ 1000 కంటే ఎక్కువ కీటకాల జాతులున్నాయి. ఈగలు, ఎగిరే దోమలు, సీతాకోకచిలుకలు, సాలెపురుగులు సహా ఇలా చాలా రకాలున్నాయి. ఐస్ లాండ్ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇవి మనుగడ సాగిస్తున్నాయి. పరాగ సంపర్కాలు, కుళ్లిపోయేవి, ఇతర జంతువులకు ఆహారంగా పనికొస్తాయి.
పాములు కూడా లేవు
దోమలే కాదు… పాములు కూడా ఇక్కడ లేవు. ఇక్కడ ఉన్న అతి శీతల వాతావరణం పాములకు అనుకూలంగా ఉండదు. అందుకే పాములు ఇక్కడ కనిపించవని చెబుతారు. అతి శీతల వాతావరణం సరీసృపాల జీవనానికి అనుకూలంగా ఉండదు. పాములు, బల్లులు, తాబేళ్లు ఇక్కడ పెంచుకోవడం చట్టవిరుద్దం. స్థానిక పర్యావరణ, వన్యప్రాణుల రక్షణ కోసం ఈ చట్టం చేశారు.
దోమలు వచ్చేశాయి…..
ఇప్పటివరకు దోమలు లేని ఐస్ లాండ్ కు దోమలు ప్రవేశించాయి. ఆడ, మగ దోమలను గుర్తించారు. ఐస్ లాండ్ లోని కిడాఫెల్ లో ద్రాక్షతోట పండించే రైతు బిజోర్న్ హజాల్ట్ సన్ తన తోటలో ఈ దోమలను గుర్తించారు. కొత్త తరహా కీటకాలను గుర్తించడం ఆయనకు ఇష్టం. తన ద్రాక్షతోటలో ఓ వస్త్రంపై రెడ్ వైన్, తీపి పదార్ధం కలిపి ఉంచారు. ఇలా దీనిపై వచ్చిన రకరకాల కీటకాలను గుర్తించారు. ఈ ఏడాది (2025 ) అక్టోబర్ 16న కొత్త రకం కీటకాలను ఆయన గుర్తించారు. ఇవి దోమలను పోలి ఉన్నాయి. వెంటనే ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. వీటిని దోమలుగా అధికారులు గుర్తించారు.ఇందులో ఒకటి ఆడ దోమ, రెండోది మగ దోమ. అయితే ఇవి ఎలా వచ్చాయని అధికారులు కారణాలు అన్వేషిస్తున్నారు. సరుకు రవాణా వాహనాల ద్వారా దోమలు ఇక్కడికి వచ్చి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు.
