విమాన ప్రమాదంలో … మలావీ ఉపాధ్యక్షుడి మృతి

మలావీ ఉపాధ్యక్షుడు సావులోస్‌ క్లావ్స్‌ చీలిమా, ఆయన భార్య సహా మరో 9 మంది విమాన ప్రమాదంలో చనిపోయారు. వారు ప్రయాణిస్తున్న విమానం చికాంగావా పర్వత సానువుల్లో కూలిపోయిందని దేశాధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా మంగళవారం వెల్లడించారు

  • Publish Date - June 11, 2024 / 06:01 PM IST

చీలిమా భార్య, మరో 9 మంది కూడా..
మలావీ ఉపాధ్యక్షుడు సావులోస్‌ క్లావ్స్‌ చీలిమా, ఆయన భార్య సహా మరో 9 మంది విమాన ప్రమాదంలో చనిపోయారు. వారు ప్రయాణిస్తున్న విమానం చికాంగావా పర్వత సానువుల్లో కూలిపోయిందని దేశాధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా మంగళవారం వెల్లడించారు. వారు ప్రయాణిస్తున్న సైనిక విమానం గల్లంతైందని తొలుత వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గల్లంతైన విమానం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టగా.. చికాంగావా పర్వత సానువుల్లో శిథిలాలను గుర్తించారు. విమానం పూర్తిగా దగ్ధమైపోయిందని, అందులో ఎవరూ బతికిలేరని లాజరస్‌ చక్వేరా తెలిపారు. సావులోస్‌ క్లావ్స్‌ చీలిమా (Saulos Klaus Chilima), ఆయన భార్య సహా మరో తొమ్మిది మంది ఒక సైనిక విమానంలో సోమవారం దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయల్దేరారు. తొమ్మిది మందితో కూడిన ఈ సైనిక విమానం జూజూ నగరంలో ఓ కేబినెట్‌ మాజీ మినిస్టర్‌ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్లింది. షెడ్యూల్‌ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో విమానం దిగాల్సి ఉన్నది. కానీ.. ఆ సమయానికి అది అక్కడికి చేరుకోలేదు. దీంతో వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మలావీ అధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా తన బహమాస్ పర్యటనను రద్దు చేసుకుని గల్లంతైన సావులోస్‌ విమానం సెర్చ్‌ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. సెర్చ్‌ ఆపరేషన్‌ కోసం ఆయన ఇతర దేశాల సహాయాన్ని కూడా అర్థించారు. ‘నేను తీవ్రంగా బాధపడుతున్నాను. భయంకరమైన విషాదం మిగిలింది. సెర్చ్‌ అండ్‌ రెస్క్యూటీమ్‌ ఒక పర్వతం వద్ద కూలిపోయిన విమాన శకలాలను గుర్తించారు. ఎవరూ బతకలేదు’ అని లాజరస్‌ తెలిపారు. విమానం, దాని సిబ్బంది ట్రాక్‌ రికార్డు బాగున్నా.. ఏదో ఘోరమైన తప్పిదం జరిగిందని చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చీలిమా అధ్యక్ష అభ్యర్థిగా పోటీచేయాల్సి ఉన్నది.

 

మలావీ ఉపాధ్యక్షుడు,సావులోస్‌ క్లావ్స్‌ చీలిమా,చికాంగావా,లాజరస్‌ చక్వేరా,బహమాస్

Latest News