Tiger Stays Near Villages in Siddipet for 3 Days, Kills 7 Cattle, Sparks Panic
కోహెడలో పులి భయం
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో మూడు రోజులుగా పులి సంచారం ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతోంది. ఏడు పశువుల మృతితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డ్రోన్లు, కెమెరా ట్రాప్స్‌తో అటవీ శాఖ నిఘా పెంచి ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
విధాత తెలంగాణ డెస్క్ | హైదరాబాద్:
Tiger in Siddipet | సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో మూడు రోజులుగా అడవి పులి గ్రామాల చుట్టూ తిరుగుతుండటంతో రైతులు, గ్రామస్థులు వణికిపోతున్నారు. గణపూర్, ఆరెపల్లి గ్రామాల్లో ఏడు పశువుల మృతితో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. డ్రోన్లు, కెమెరా ట్రాప్స్‌తో అటవీ శాఖ నిఘా పెంచినా, పులి జాడ తెలియకపోవడంతో గ్రామస్థులు బయటకి రావడానికి జంకుతున్నారు.
కొండలు, నీటి వనరులే కారణమా? కోహెడనే ఎంచుకున్న పులి
శనిగరం రిజర్వాయర్ పరిసరాల్లో జింకలు, అడవి పందులు ఉన్నప్పటికీ, ఆ ప్రాంతమంతా రాళ్లురప్పలతో కష్టతరంగా ఉండటంతో దానికి వేట కష్టంగా మారింది. అందుకే గ్రామాల శివార్లలో ఉన్న పశువులే పులికి సులభమైన ఆహారంగా మారుతున్నాయి. ఆరెపల్లిలో చంపిన పశువుల మృతదేహం వద్దకు పులి మళ్లీ వచ్చి ఆహారం తీసుకున్న దృశ్యాలు కెమెరా ట్రాప్స్‌లో నమోదయ్యాయి. ఇది ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని వేట కేంద్రంగా భావిస్తున్నట్లు సూచిస్తోంది.
కానీ ఇక్కడ అసలు ఆందోళన కలిగిస్తున్న విషయం ఇదే…సాధారణంగా ఒక్కచోటే ఎక్కువసేపు ఉండని పులి మూడు రోజులుగా ఒకే ప్రాంతంలో ఉండటం.
డ్రోన్లు, ప్రత్యేక బృందాలు… అయినా ఎందుకు కనిపించడంలేదు?
కాగా, పులి కదలికలపై నిఘా కోసం అటవీ శాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. డ్రోన్లు, కెమెరా ట్రాప్స్ సహాయంతో కొండ ప్రాంతాలను గాలిస్తున్నారు. అటవీ శాఖ అంచనా ప్రకారం, ఈ పులి మహారాష్ట్ర నుంచి వచ్చి యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట జిల్లాలలోనే సంచరిస్తోంది. గత వారం వరకు రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర ప్రయాణించిన పులి, ఇప్పుడు కోహెడ పరిసరాల్లోనే ఆగిపోవడం అధికారులకు కూడా అంతుపట్టకుండా ఉంది.
“ఒకవేళ మనుషులకు ఎదురుపడితే వెంటనే స్పందించేందుకు మత్తు మందులతో కూడిన బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం పులి మనుషులకు దూరంగా మసలుకుంటోంది” అని అటవీ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, రైతులను రాత్రిపూట పొలాలకు వెళ్లవద్దని సూచించారు. పులి ప్రమాదం నివారించేందుకు రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. కోహెడ పరిసర గ్రామాల్లో చాటింపు వేస్తూ ప్రజలను హెచ్చరిస్తున్నారు.
గ్రామాల్లో భయం భయం… జన జీవితం అస్తవ్యస్తం
పులి కదలికలతో గ్రామాల్లో సాధారణ జీవితం అస్తవ్యస్తమైంది. పొలాలకు వెళ్లేందుకు, పశువులను మేపేందుకు ప్రజలు భయపడుతున్నారు. సరైన షెడ్లు లేకపోవడంతో పశువులను గ్రామాల్లోకి తరలించడం కూడా సమస్యగా మారింది.
“మూడు రోజులుగా భయంతోనే జీవిస్తున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు,” అని కూరెల్ల గ్రామానికి చెందిన ఓ రైతు వాపోయాడు.
గత 20 రోజుల్లో మూడు జిల్లాలు, 12 ప్రాంతాల్లో పశువులను చంపిన ఈ పులి ఇప్పుడు కోహెడ మండలంలోనే తిష్ట వేయడం అధికారులను అప్రమత్తం చేసింది. రాబోయే 48 గంటలు కీలకంగా మారాయి. పులి కదలికలపై ఆధారపడి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అటవీ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో మూడు రోజులుగా పులి గ్రామాల చుట్టూ తిరుగుతూ ఏడు పశువులను చంపింది. డ్రోన్లు, కెమెరా ట్రాప్స్‌తో అటవీ శాఖ నిఘా పెంచినా, గ్రామాల్లో భయం కొనసాగుతోంది.
