Great India Place | ఒకప్పుడు ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) వాసులకు షాపింగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది.. ది గ్రేట్ ఇండియా ప్లేసే (Great India Place). ఇది ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా (Noida)లో ఉంది. వీకెండ్ వచ్చిందంటే చాలు.. చుట్టుపక్కల ప్రజలు ఈ మాల్‌కే వెళ్లేవాళ్లు. ఇక పండగలు, ఇతర శుభకార్యాలు ఉన్నాయంటే అంతే సంగతులు.. మాల్ మొత్తం జనంతో కిక్కిరిపోయేది. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ మాల్ సందర్శకులు లేక వెలవెలబోతోంది.
2007లో ప్రారంభం..
గ్రేట్ ఇండియా ప్లేస్‌ను అప్పుఘర్ గ్రూప్, యూనిటెక్ గ్రూప్ అభివృద్ధి చేసింది. ఈ మాల్ 2007లో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రారంభమైనప్పుడు దేశంలోనే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద మాల్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది. మొత్తం నాలుగు అంతస్తుల్లో ఈ మాల్‌ను అభివృద్ధి చేశారు. ఈ మాల్ పార్కింగ్ ప్లేస్‌లో ఏకంగా 10వేలకుపైనే వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. దీనిని ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఇది నోయిడాలోని సెక్టార్ 38-Aలో, నోయిడా సెక్టార్ 18 మెట్రో స్టేషన్‌కు ఆనుకునే ఉంటుంది.
రూ.2,000 కోట్ల విలువైన ఈ భారీ షాపింగ్ మాల్..
మొత్తం 150,000,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మాల్ దేశంలోనే అతిపెద్ద మాల్స్‌లో ఒకటి. దీన్ని జీఐపీ (GIP) మాల్ అని కూడా అంటారు. ఇందులో పాంటలూన్స్, వుడ్‌ల్యాండ్, లైఫ్‌స్టైల్, షాపర్స్ స్టాప్, బిగ్ బజార్, నైక్, గెస్, అదిదాస్ వంటి జాతీయ, అంతర్జాతీయ రిటైల్ అవుట్‌లెట్‌కు ఉన్నాయి. స్పాలు, సెలూన్‌లు, గేమింగ్ జోన్స్, థియేటర్‌తో పాటూ పెద్ద ఫుడ్‌కోర్ట్ కూడా ఉంది. ఉత్తర, దక్షిణ భారత రుచులు, చైనీస్ వంటకాలను అందించే లెక్కలేనన్ని కౌంటర్లు ఉన్నాయి. మొత్తం ఈ మాల్ విలువ సుమారు రూ. 2,000 కోట్లుగా అంచనా.
ఘోస్ట్ టౌన్..
ఒకప్పుడు యువతకు హాట్ ఫేవరెట్ స్పాట్‌గా ఉన్న ఈ మాల్ ఇప్పుడు వెలవెలబోతోంది. షాపింగ్ మాల్స్ అన్నీ షెట్టర్లతో క్లోజ్ చేసి దర్శనమిస్తున్నాయి. ఫుడ్ కోర్టులు సైతం సందర్శకులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గతంలో పిల్లలు, పెద్దలతో సందడిగా ఉండే కారిడార్లు ఇప్పుడు చీకటిగా, నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ మాల్‌ను “ఘోస్ట్ టౌన్” (ghost town)తో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.
అనేక కారణాలు..
షాపింగ్ డెస్టినేషన్‌గా ఉన్న ఈ మాల్ ఈ స్థితికి రావడానికి అనేక కారణాలే ఉన్నాయి. ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఇదొక్కటే పెద్ద మాల్. ఆ తర్వాత అనేక మాల్స్ పుట్టుకొచ్చాయి. మరిన్ని ఆకర్షణీయమైన బ్రాండ్లు, ఆకట్టుకునే ఇంటీరియర్ ఇలా అత్యాధునిక హంగులతో జీఐపీకి అతి సమీపంలో ‘DLF మాల్ ఆఫ్ ఇండియా’ మాల్ ఓపెన్ అయ్యింది. ఇంకేముందు.. జనానికి కొత్తగా ఏది కనిపిస్తే దానివైపే మళ్లుతారు కద. ఇక్కడా అదే జరిగింది. నెమ్మదిగా జనం డీఎల్ ఎఫ్ మాల్‌కు వెళ్లేందుకు మొగ్గుచూపారు. కాలక్రమేణా GIP మాల్ నిర్వహణలో నాణ్యత లోపించింది. చివరికి ఇలా ఘోస్ట్ టౌన్‌గా మారింది.
ఇవి కూడా చదవండి :
Actress Poorna | రెండోసారి తల్లికానున్న టాలీవుడ్ హీరోయిన్.. నటి పూర్ణ బేబీ బంప్ (ఫొటోలు)
జీతాలు, రైతు భరోసాకూ అప్పులే దిక్కా! రెండేళ్లలోనే రూ.1.27 లక్షల కోట్ల రుణాలు తీసుకున్న రేవంత్ సర్కార్
