జీతాలు, రైతు భరోసాకూ అప్పులే దిక్కా! రెండేళ్లలోనే రూ.1.27 లక్షల కోట్ల రుణాలు తీసుకున్న రేవంత్ సర్కార్‌

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఖర్చులు నానాటికీ పెరుగుతుంటే.. ఆదాయం మాత్రం తగ్గిపోతున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై మరింతగా ఆధారపడుతున్నది. కాగ్‌ లెక్కల ప్రకారం.. గడిచిన రెండేళ్లలోనే 1.27 లక్షల కోట్లకు పైగా రుణాలు తీసుకున్నట్టు వెల్లడైంది. రైతు భరోసా మొదలుకుని.. వేతనాల వరకూ అనేక చెల్లింపులు కూడా అప్పుల ద్వారానే జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది.

జీతాలు, రైతు భరోసాకూ అప్పులే దిక్కా! రెండేళ్లలోనే రూ.1.27 లక్షల కోట్ల రుణాలు తీసుకున్న రేవంత్ సర్కార్‌
  • పడిపోతున్న తెలంగాణ రాష్ట్ర ఆదాయం… పెరిగిపోతున్న అప్పులు
  • ఒక్క ఫిబ్రవరి నెలలో ఇప్పటికే రూ.9 వేల కోట్లు

హైదరాబాద్, విధాత:

రైతు భరోసాకూ, ఉద్యోగుల బకాయిలు, వేతనాలకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు .. ఇలా ఏ పని చేయాలన్నా నిధుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి రేవంత్ రెడ్డి సర్కారుకు ఏర్పడింది. గత బీఆరెస్‌ ప్రభుత్వం చేసిన అడ్డగోలు అప్పులకు తోడు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వేసుకున్న అంచనాలకు, వాస్తవంగా వస్తున్న ఆదాయానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తున్నది. దీంతో అప్పులు అనివార్యమవుతున్నాయి. ఒక్కోసారి ఖజానా మైనస్‌లోకి వెళ్లిపోతుండటంతో చిల్లర ఖర్చులకు సైతం అప్పులు చేయాల్సిన దుస్థితిని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంటున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులకు ఏళ్లు గడిచినా వారి బకాయిలు ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నది. నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కాదు.. ఎవరు అధికారంలోకి వచ్చినా ఆదాయం పెంచుకునే మార్గాలు చూసుకోవడం మానేసి.. అప్పులు తెచ్చుకోవడం అనే సులభ విధానాన్ని అనుసరిస్తున్నారని ఆర్థిక విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

బీఆరెస్‌ అప్పులపై విమర్శలు

బీఆరెస్‌ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో రూ.6.71 లక్షల కోట్ల అప్పు చేసి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరచూ విమర్శిస్తుంటుంది. ఈ మేరకు అసెంబ్లీలో వైట్ పేపర్ కూడా విడుదల చేసింది. వాస్తవానికి 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్ ఉండేది. సంప్రదాయంగా వస్తున్న రుణం తెలంగాణ రాష్ట్ర వాటాగా రూ.75 వేల కోట్లు మాత్రమే వచ్చింది. జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్ర పరిపాలన జరిగి ఉంటే కేసీఆర్ చెప్పిన విధంగా ఈ పదేళ్లలో అప్పులు తీరిపోవడమే కాకుండా.. ఖజానా నిండుగా ఉన్న ధనిక రాష్ట్రమయ్యేది. కానీ దీనికి భిన్నంగా తెలంగాణ రూ.75 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.6.71 లక్షల కోట్ల రుణ ఊబిలోకి వెళ్లిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని అసెంబ్లీ ఎన్నిలకు ముందు నాటి పీసీసీ చీఫ్‌ హోదాలో రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు దుమ్మెత్తేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకువస్తుందని నమ్మిన ప్రజలకు నిరాశే ఎదురైంది. అప్పుల ఊబి నుంచి బయటపడేయటానికి సంపద సృష్టించి, తద్వారా ఆదాయాన్ని పెంచుతారని అంతా భావించారు. కానీ.. కేసీఆర్‌ కంటే తానేమీ తక్కువ తినలేదన్నట్టు.. అప్పులు చేయడంలో కేసీఆర్‌తో రేవంత్‌ రెడ్డి పోటీపడుతున్నారన్న విషయం.. బ్యాలెన్స్‌ షీట్‌ను చూస్తే అర్థమవుతున్నది.

ఆవిర్భావం నాటికి మిగులు రాష్ట్రం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే వరకు 65 ఏళ్లకుపైగా పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఉమ్మడిగా తెలంగాణకు చేసిన అప్పు రూ.75,577 కోట్లు మాత్రమే. పైగా రెవెన్యూ మిగులు.. రూ.1,764.33 కోట్లు ఉండగా, ఫిస్కల్ సర్‌ప్లస్‌ రూ. 851.15 కోట్లు ఉండేది. దీంతో ఆనాడు కేసీఆర్ తెలంగాణను ధనిక రాష్ట్రంగా ప్రకటించారు. ఆవిర్భావ సమయంలో మిగులు ఆదాయం ఉన్న రాష్ట్రం.. నేడు రూ.65,931 కోట్ల విత్తలోటును ఎదుర్కొంటున్నది. బీఆరెస్ చేతి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టే నాటికి రాష్ట్ర ఖజానా రూ.36,536.02 కోట్ల ఫిస్కల్ డెఫిసిటీలోకి వెళ్లింది. ఇది తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన బీఆరెస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన ఘనత అని ఆర్థిక పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కాంగ్రెస్‌ సర్కార్‌ అప్పులు 1.27 లక్షల కోట్లు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత డిసెంబర్ 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు బడ్జెట్ అప్పులే రూ.1,27,305.8 కోట్లు ఉన్నాయి. వీటికి 2026 జనవరి, ఫిబ్రవరి నెలలో తీసుకున్న రుణాలు మరో రూ.14 వేల కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్ (కాగ్) నివేదికలో పొందుపర్చిన లెక్కలే. వీటికి బడ్జెటేతర అప్పులు అదనం. బడ్జెటేతర అప్పులను ప్రభుత్వం కాగ్‌కు సమర్పించదు. ప్రభుత్వం బడ్జెట్‌లో పొందుపరిచిన విధంగా ఆదాయం, లెక్కల వివరాలను ప్రతి నెల కాగ్‌కు సమర్పిస్తుంది. అందులో ఆదాయం, ఖర్చు, తెచ్చిన బడ్జెట్ రుణాల లెక్కలు, చెల్లించిన మిత్తి వివరాలుంటాయి. దాని ప్రకారంగా రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత, 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి వరకు రూ.13,053.29 కోట్లు, 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.48,322.20 కోట్లు, 2025–26లో ఇప్పటి వరకు 65,930.31 కోట్ల రుణం తీసుకున్నారు. వీటికి అదనంగా 2026 జనవరిలో రూ.5,000 కోట్లు తీసుకున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో ఉన్నది. అలాగే ఫిబ్రవరి నెలకు ఇప్పటికే రూ.9000 వేల కోట్ల రుణం తీసుకున్నది. దీంతో ఈ ఒక్క ఏడాదికే ఇప్పటి వరకు చేసిన అప్పు రూ. 80 వేల కోట్లకు చేరింది. వాస్తవంగా బడ్జెట్ ఆమోదం తీసుకున్నది రూ.54,009.74 కోట్లకు మాత్రమే. కాగా అదనంగా రూ.35 వేల కోట్లకు పైగా రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా తీసుకోవడం గమనార్హం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రభుత్వం తీసుకున్న బడ్జెట్ అప్పులు డిసెంబర్ వరకే రూ.1. 27 లక్షల కోట్లు కాగా… తీర్చిన రుణం… వడ్డీ అసలు కలిపి రూ.56,792.62 కోట్లు మాత్రమే. దీంతో ప్రతి ఏటా అప్పుల భారం తెలంగాణ ప్రజలపై అదనంగా పడుతున్నది.

ఆదాయం ఏది?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిసెంబర్ 2025 వరకు రాష్ట్ర ఖజానాకు వివిధ మార్గాలలో వచ్చిన ఆదాయం.. జీఎస్టీ, ఇతర టాక్స్‌లు, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, పన్నుల్లో వాటా అంతా కలిపి రూ. 3,50,663.72 కోట్లు మాత్రమే. ఇందులో 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి వరకు రూ.57,948.21 కోట్లు, 2024–25 ఆర్థిక సవంత్సరంలో రూ.1,67,804.32 కోట్లు, 2025 మార్చి నుంచి డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం రూ.1,24,911.19 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న అంచనాలకు, వాస్తవంగా వస్తున్న ఆదాయానికి మధ్య దాదాపు 40 శాతం వరకు తేడా కనిపిస్తున్నది. ఈ లోటు పూడ్చడానికి అప్పులు తీసుకునేందుకు చూపిస్తున్న ఉత్సాహం… ఆదాయం పెంచడంపై కేంద్రీకరించడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేకంగా ఆదాయ మార్గాలపై అన్వేషణ లేదన్న విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

రూ.9 వేల కోట్ల రుణం రైతు భరోసా కోసమేనా?

సంక్షేమ పథకాలతో పాటు రైతు భరోసా లాంటి స్కీమ్‌లు అమలు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నదన్న విమర్శలు బలంగా వెలువడుతున్నాయి. వాస్తవంగా మాత్రం ఫిబ్రవరి రెండవ వారంలోనే రూ. 9 వేల కోట్ల సెక్యూరిటీ బాండ్ల రుణం ఒకే సారి తీసుకోవడం రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రూ.9 వేల కోట్ల రుణం కూడా రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడానికే అనే వాదన వినిపిస్తున్నది. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ సోషల్ మీడియానే పని కట్టుకొని ఈ ప్రచారం చేస్తుందన్న విమర్శలు కూడా ఉన్నాయి.

అప్పుల్లో కేసీఆర్‌ను మించిన రేవంత్‌

9 ఏళ్ల‌లో బీఆరెస్ చేసిన బ‌డ్జెట్ రుణాలు రూ.3. 90 కోట్లు, బడ్జెటేతర రుణాలు రూ.2.82 కోట్లు ఉన్నాయి. బీఆరెస్ చేసిన అప్పులు, చెల్లించిన మిత్తీ, అసలు వివరాలు వెల్లడించిన కాంగ్రెస్ తమ ప్రభుత్వం చేసిన అప్పులు, చెల్లించిన కిస్తీల వివరాలు మాత్రం దాచిపెడుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2025 మార్చి నాటికి రూ.1.66 లక్షల కోట్ల అప్పు చేసినట్లు తెలుస్తున్నది. ఇందులో బడ్జెట్, బడ్జెటేతర అప్పులను కలిపి చూపిస్తున్నారని అంటున్నారు. కాగ్‌కు సమర్పించిన బడ్జెట్ పత్రాలను పరిశీలిస్తే… డిసెంబర్ 2023 నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు రూ.61,375 కోట్ల బడ్జెట్ రుణాలు, మిగిలిన లక్ష కోట్లు బడ్జెటేతర రుణం తీసుకున్నట్లు స్పష్టమవుతున్నది. 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిస్తే కానీ ఎంత మేరకు ఈ రుణం తీసుకున్నారనేది స్పష్టం అయ్యే అవకాశం లేదు. అయితే అప్పులు తీసుకోవడంలో చూపించినంత ఉత్సాహం తీర్చడంలో లేదన్నది స్పష్టం అవుతున్నది. రేవంత్ సర్కారు డిసెంబర్ 2025 నాటికి తీర్చిన అప్పు అసలు,వడ్డీ కలిపి కేవలం రూ.56,792.62 కోట్లు మాత్రమే. దీంతో తెచ్చిన అప్పులు మిత్తీలు కట్టడానికి కూడా సరిపోయేలా లేదని స్పష్టం అవుతున్నది.

బీఆరెస్ 10 ఏళ్లలో బడ్జెట్, బడ్జేతరం కలిపి రూ. 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేస్తే .. రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం రెండేళ్లలో రూ.1,27,305 కోట్ల అప్పు తీసుకున్నది. అంటే సగటున ఏడాదికి రూ. 50 వేల కోట్లకు పైగా రుణం తీసుకున్నట్లు స్పష్టం అవుతున్నది. ఇవి కాకుండా బడ్జెటేతర రుణ వివరాలు బయటకు వస్తే కానీ రేవంత్ సర్కారు అప్పుల బాగోతం బయటకు రాదని విశ్లేషకులు చెపుతున్నారు. రేవంత్ సర్కారు లెక్కల వివరాలు పరిశీలిస్తే మరో మూడేళ్లలో బీఆరెస్ చేసిన అప్పులను బీట్ చేసేటట్లుగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.