Telangana | తెలంగాణ అప్పులపై ఏది నిజం?

Telangana | గత పదేళ్ల బీఆరెస్‌ పాలనలో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేశారన్నది వాస్తవం. అయితే.. ఈ అప్పులు ఎంత? అన్న విషయంలో తలో లెక్క చెబుతుండటంతో అయోమయంగా మారింది. ఎవరు చెప్పేది నిజమో? ఎవరు చెప్పేది అబద్ధమో ప్రజలు ఆలోచించడానికి ప్రజలు బుర్రలు బద్దలు కొట్టుకునే స్థితికి అన్ని పక్షాలూ కలిసి తెచ్చాయి.

Telangana | తెలంగాణ అప్పులపై ఏది నిజం?

Telangana | హైదరాబాద్ ఆగస్ట్‌ 16 (విధాత) : గత పదేళ్ల బీఆరెస్‌ పాలనలో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేశారన్నది వాస్తవం. అయితే.. ఈ అప్పులు ఎంత? అన్న విషయంలో తలో లెక్క చెబుతుండటంతో అయోమయంగా మారింది. ఎవరు చెప్పేది నిజమో? ఎవరు చెప్పేది అబద్ధమో ప్రజలు ఆలోచించడానికి ప్రజలు బుర్రలు బద్దలు కొట్టుకునే స్థితికి అన్ని పక్షాలూ కలిసి తెచ్చాయి. తాము అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు ఇవి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. లేదు లేదు లోక్‌సభలో బీజేపీ ఎంపీ రఘునందన్ వేసిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి చెప్పిన అప్పుల వివరాలే కరెక్టు అని సర్టిఫికెట్‌ ఇచ్చుకుంటున్నారు. రేవంత్ రెడ్డి చెప్పేది కరెక్టు కాదని బీఆర్ఎస్ తాజాగా ప్రచారం చేసుకుంటూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తుండటం విశేషం.

రఘునందన్ రావు ప్రశ్నకు కేంద్రం ఏం చెప్పింది?

ఈ నెల 11వ తేదీన లోక్‌సభలో మెదక్ బీజేపీ ఎంపీ ఎం రఘునందన్ రావు తెలంగాణ అప్పులపై ఒక ప్రశ్న వేశారు. దీనికి సమాధానమిచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులు రూ.3,14,545 కోట్లు అని తెలిపారు. మొత్తంగా 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ.3,51,520.01 కోట్లుగా తేల్చింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా రూ.3,14,545.68 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాల ద్వారా రూ.18,057.16 కోట్లు, స్వయం ప్రతిపత్తి సంస్థల నుంచి రూ.13,194.39 కోట్ల రుణాలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఓవర్ డ్రాఫ్ట్ సహా వేస్ అండ్ మీన్స్ కింద ఉన్న అప్పులు 999.62 కోట్లు, ప్రత్యేక సెక్యూరిటీల ద్వారా తీసుకున్న అప్పు 4723.16 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ అప్పులు రూ.3,50,520.39 కోట్లు కాగా ప్రభుత్వ ఆస్తులు రూ.4,15,099.69 కోట్లుగా ఉన్నాయని లోక్‌సభకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

స్వాతంత్ర్య వేడుకల్లో అప్పులు వివరించిన రేవంత్ రెడ్డి

తాము అధికారం చేపట్టే నాటికే గత బీఆర్ఎస్ పాలకులు తమకు వారసత్వంగా రూ.8 లక్షల 21 వేల 651 కోట్ల అప్పులు బకాయిలుగా మిగిల్చి వెళ్లారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. శుక్రవారం గోల్కొండ కోటపై స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దీనిలో రూ.6 లక్షల 71 వేల 757 కోట్లు అప్పులు ఉండగా, ఉద్యోగులు, ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు రూ.40 వేల 154 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సింగరేణి కాలరీస్, విద్యుత్ సంస్థలు, ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు మరో రూ.1 లక్షా 9 వేల 740 కోట్లు అని వివరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అప్పులను సర్వీస్ చేయడానికి ఇప్పటి దాకా అసలు రూపేణా రూ.1 లక్షా 32 వేల 498 కోట్లు తమ హయాంలో చెల్లించామన్నారు. వడ్డీలకే రూ.88 వేల 178 కోట్లను.. మొత్తం కలిపి రూ.2 లక్షల 20 వేల 676 కోట్లను డెట్ సర్వీసింగ్ చేశామన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఈ వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ శూన్యం నుంచి ఉన్నత శిఖ‌రాలవైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు తాము కృషి చేస్తున్నామని రేవంత్ ధీమా వ్యక్తం చేసుకున్నారు.

లోక్‌సభలో అస్పష్ట సమాధానం?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాక ముందు బీఆర్ఎస్ ఏలుబడిలో ప్రభుత్వంతో పాటు కార్పొరేషన్లు చేసిన అప్పులు వెల్లడించాల్సిన కేంద్ర ఆర్థిక మంత్రి కేవలం ప్రభుత్వం చేసిన అప్పులు మాత్రమే తెలిపారన్న అభిప్రాయాలను ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణం కోసం పలు బ్యాంకుల నుంచి అప్పులు కుప్పలు తెప్పలుగా తీసుకున్నారు. ఆ విషయాన్ని లోక్‌సభలో వివరించలేదని చెబుతున్నారు. బీజేపీ ఎంపీ ఎం రఘునందన్ రావు తెలంగాణ అప్పులపై వేసిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం తమకు వర్తిస్తుందనే విధంగా, తామేమీ ఎక్కువ అప్పులు చేయలేదని బీఆర్ఎస్ నేతలు సమర్థించుకోవడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎఫ్ఆర్బీఎం పరిధిలో రూ.5 లక్షల కోట్లు, కార్పొరేషన్లు రూ.3 లక్షల కోట్లు అప్పులు

ఈ ఏడాది నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వెల్లడించిన అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తీసుకునే అప్పులతో పాటు గతంలో ఎఫ్ఆర్బీఎం పరిధిలోని అప్పులు రూ.5,04,814 కోట్లు అని తెలిపారు. ఇవి కాకుండా ఎఫ్ఆర్బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ యాక్టు)కు ఆవల కూడా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న (బడ్జెట్ వెలుపల) అప్పులు మొత్తం రూ.3,01,484 కోట్లు. అంటే ఎఫ్ఆర్బీఎం పరిధిలో అనగా తెలంగాణ ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు రూ.5,04,814 కోట్లు కాగా కార్పొరేషన్ల అప్పులు మొత్తం రూ.3,01,484 కోట్లు అన్నమాట. బడ్జెట్ వెలుపల అనగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, మిషన్ భగీరథతో పాటు ఇన్‌స్టిట్యూషన్లు (స్పెషల్ పర్పస్ వెహికిల్స్) వంటి ప్రాజెక్టుల పేరుతో ఇష్టానుసారంగా రుణాలు తీసుకున్నారని ఆర్థిక నిపుణులు గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి 2014/15 లో రుణభారం రూ.72వేల 658 కోట్లు మాత్రమే. జీఎస్డీపీలో రుణ నిష్పత్తి 2015/16లో 15.70 శాతం కాగా కేసీఆర్ దిగిపోయే నాటికి 27.8 శాతానికి చేరుకుంది. రుణ భారం, వాయిదాల ప్రకారం డబ్బులు చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు ఇలా చాలా బకాయిలు తమ నెత్తిన వదిలి గత ప్రభుత్వం వెళ్లిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో వివరించిన విషయం విదితమే.

పదేళ్లలో ప్రభుత్వం చేసిన అప్పులు : రూ.3,14,545 కోట్లు
కేంద్ర ప్రభుత్వం నుంచి : రూ.18,057.16 కోట్లు
స్వయం ప్రతిపత్తి సంస్థల నుంచి : రూ.13,194.39 కోట్లు
ఓవర్ డ్రాఫ్ట్ సహా వేస్ అండ్ మీన్స్ కింద : 999.62 కోట్లు
ప్రత్యేక సెక్యూరిటీల ద్వారా : 4723.16 కోట్లు
మొత్తం : 3,51,520.01 కోట్లు

రేవంత్‌ లెక్క ఇదీ

వారసత్వంగా వచ్చిన అప్పు : రూ.8,21,651 కోట్లు
దీనిలో అప్పులు : రూ.6,71,757 కోట్లు
ఉద్యోగులు, ఇతర పథకాలకు బకాయిలు : రూ.40,154 కోట్లు
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సింగరేణి కాలరీస్, విద్యుత్ సంస్థలు, ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు : రూ.1,09,740 కోట్లు

బడ్జెట్‌ లెక్కలు

2025-26 ఆర్థిక సంవత్సరంలో తీసుకునే అప్పులతో పాటు గతంలో ఎఫ్ఆర్బీఎం పరిధిలోని అప్పులు : రూ.5,04,814 కోట్లు
ఎఫ్ఆర్బీఎం ఆవల కార్పొరేషన్ల ద్వారా : రూ.3,01,484 కోట్లు