Kaleshwaram | కాళేశ్వరం కల నిజమవుతుందా?.. మేడిగడ్డ పునరుద్ధరణకు ప్రభుత్వం కసరత్తు
Kaleshwaram | కూలేశ్వరంగా తీవ్ర అపవాదును మూటగట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు తిరిగి పూర్వవైభవం సంతరించుకునేందుకు నీటిపారుదల శాఖ ఒక ముందడుగు వేసింది. మేడిగడ్డ బరాజ్‌లో నష్టాన్ని సరిదిద్దేందుకు నీటిపారుదలశాఖ నుంచి వచ్చిన పునరుద్ధరణ ప్రతిపాదనకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Kaleshwaram | విధాత ప్రత్యేక ప్రతినిధి : కూలేశ్వరంగా తీవ్ర అపవాదును మూటగట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు తిరిగి పూర్వవైభవం సంతరించుకునేందుకు నీటిపారుదల శాఖ ఒక ముందడుగు వేసింది. మేడిగడ్డ బరాజ్‌లో నష్టాన్ని సరిదిద్దేందుకు నీటిపారుదలశాఖ నుంచి వచ్చిన పునరుద్ధరణ ప్రతిపాదనకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అతి స్వల్పకాలంలో పతాకస్థాయి ప్రచారం అందుకుని, వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఈ ప్రాజెక్టు కుంగిపోయిన సమయంలో తిరిగి ప్రజోపయోగంగా మారుతుందా? అనే అనుమానాలు నెలకొన్న సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ బరాజ్ ఏడోబ్లాకు పియర్లు కుంగడంతోపాటు సుందిళ్ళ, అన్నారం బరాజ్‌లలో లోపాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. వీటి పునరుద్ధరణకు రామగుండం ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) అంజద్ హుస్సేన్ అవసరమైన అనుమతి కోరుతూ రాసిన లేఖకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు డిజైనర్ ఎంపికకు జాతీయ స్థాయిలో టెండర్లు ఆహ్వానించి ఎంపిక పర్యవేక్షణ బాధ్యత సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ (సీడీవో) సంస్థకు అప్పగించారు.
పునరుద్ధరణకు డిజైన్ ముఖ్యం
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు డిజైన్ అత్యంత ప్రధానమైన అంశంగా మారింది. ఈ డిజైన్ రూపకల్పన బాధ్యతలను సీడీవో కు గతంలోనే అప్పగించింది. దీనిపై సీడీవో కుంగుబాటుకు సంబంధించిన కీలక సమాచారం, వివిధ సంస్థల అధ్యయనం నివేదికలను పరిశీలించి అందించిన ప్రతిపాదన మేరకు నీటిపారుదల శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వానికి ఈఎన్సీ రాసిన లేఖలో మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకు ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయాన్ని ప్రస్తావించినట్లు చెబుతున్నారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాక్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 2023 అక్టోబరు 21న కుంగింది. వెంటనే ఎన్డీఎస్ఏ జోక్యాన్ని కోరుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడంతో ఆ సంస్థ మేడిగడ్డను పరిశీలించింది. ఈ సందర్భంగా అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలోనూ సీపేజీ లోపాలు బయటపడ్డాయి. ఎన్డీఎస్ఎ తర్వాత తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా దానిపై బీఆర్ఎస్ పలు విమర్శలు గుప్పించింది. ఇదిలాఉండగా మేడిగడ్డ లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)ను ఆశ్రయించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బరాజ్‌ల పరిస్థితులను ఎన్డీఎస్ఎ, సీడీవో, పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ సంస్థలు కూడా అధ్యయనం చేశాయి. ఈ కారణంగా ప్రభుత్వం ఆ సంస్థల సూచనలను కోరడంతో బరాజ్‌ల పునరుద్ధరణకు అనుభం ఉన్న డిజైనర్ అవసరమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో డిజైన్ల రూపకల్పన వరకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకోవాలనే సూచనలకు సర్కారు ఆమోదం లభించింది. ఈ డిజైన్ల ఎంపికకు టెండర్లు పిలువాలని, దీన్ని సీడీవో పర్యవేక్షించాలని ప్రభుత్వం కోరినట్లు చెబుతున్నారు. డిజైనర్ ఎంపికయ్యాక నివేదిక అందించేందుకు మూడు నెలల గడువు విధించినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఆ తర్వాత పునరుద్ధరణ పనులను ప్రస్తుత నిర్మాణ సంస్థల ద్వారా చేపట్టాలని, ఆ సంస్ధలు ముందుకు రాకుంటే ఇతర సంస్థలను ఆశ్రయించాలని భావిస్తున్నారు. ఈ ఖర్చును మాత్రం నిర్మాణ సంస్థలదే బాధ్యతగా చెబుతున్నారు. దీంతోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తిన లోపాలపై ఆ రాష్ట్ర జలవనరుల శాఖ చేసిన అధ్యయన నివేదిక, పునరుద్ధర చర్యలు, డిజైన్లకు సంబంధించిన అంశాలను పరిశీలించినట్లు తెలుస్తోంది.