Rajya Sabha | రేవంత్ మార్క్.. రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి, సింఘ్వీ..!
Rajya Sabha | ఎట్టకేలకు రాజ్యసభ అభ్యర్థులు ఎవరనే విషయానికి తెరపడింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎంతో మంది రాజ్యసభ రేసులో ఉన్నప్పటికీ.. రేవంత్ రెడ్డి మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించేలా మంత్రాంగం నడిపారు.
Rajya Sabha | ఎట్టకేలకు రాజ్యసభ అభ్యర్థులు ఎవరనే విషయానికి తెరపడింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎంతో మంది రాజ్యసభ రేసులో ఉన్నప్పటికీ.. రేవంత్ రెడ్డి మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించేలా మంత్రాంగం నడిపారు. చివరకు అధిష్టానాన్ని ఒప్పించి మెప్పించి.. వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించే ప్రయత్నంలో రేవంత్ సఫలీకృతుడయ్యారు. ఇక మరో స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పేరును ఖరారు చేశారు. వీరిద్దరి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం బుధవారం రాత్రి 11 గంటల తర్వాత అధికారికంగా ప్రకటించింది. వీరిద్దరూ ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
రాజ్యసభకు పోటీ పడింది వీరే..
మరోవైపు ఏఐసీసీ కార్యదర్శిగా ఉంటూ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కార్యాలయంలో బాధ్యతలు చూస్తున్న మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పేరును, ఎస్సీల నుంచి సాంబయ్య, ఎస్టీల నుంచి బెల్లయ్యనాయక్, బీసీల నుంచి వి.హనుమంతరావు, వినయ్‌కుమార్, మధుయాస్కీ గౌడ్‌లతోపాటు హర్కర వేణుగోపాల్, చిన్నారెడ్డి సహా మొత్తం 16 మంది పేర్లను ఏఐసీసీకి పంపారు. చివరకు వేం నరేందర్‌రెడ్డి, సాంబయ్యల పేర్లను పరిశీలించినా… అధిష్ఠానం వేం నరేందర్‌రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి వేం నరేందర్‌రెడ్డి పేరు వెళ్లగా, అదే పేరును ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
రేవంత్ రెడ్డిని వెన్నంటే వేం నరేందర్ రెడ్డి
మొదటి నుంచీ తెలుగుదేశంలో ఉన్న నరేందర్‌రెడ్డికి.. రేవంత్‌రెడ్డి కూడా ఆ పార్టీలో చేరాక ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే ప్రక్రియలో నరేందర్‌రెడ్డి.. నాటి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి వెన్నంటే ఉన్నారు. రేవంత్ రెడ్డితో కలిసి 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన వేం నరేందర్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించుకున్నారు. పార్లమెంటు ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో తెర వెనుక వ్యూహరచనలో ఆయన పాత్ర వెలకట్టలేనిదని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అంతేకాదు ప్రభుత్వం, పార్టీ మధ్య అనుసంధాన కర్తగా కూడా కీలకంగా వ్యవహరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివాదాస్పద అంశాల్లో సైతం జోక్యం చేసుకుని సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లగల నాయకుడిగా ఆయనకు ఉన్న ఇమేజ్ కూడా అధిష్ఠానం దృష్టిలో ఉన్నట్లు సమాచారం. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని జాతీయ స్థాయిలో సింఘ్వీ, రాష్ట్ర స్థాయిలో వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram