TELANGANA | మధ్యతరగతి నెత్తిపై అప్పుల కుప్ప.. వ్యక్తిగత రుణాల్లో తెలంగాణ స్థానం తెలుసా?

మధ్యతరగతి ఆర్థికంగా తీవ్ర ఒత్తిడులకు లోనవుతున్నదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత పదిహేనేళ్ల కాలంలో గృహస్థుల రుణభారం 40.9 శాతానికి పెరగడం, అదే సమయంలో పొదుపు 18.9 శాతానికి పడిపోవడం ప్రమాదకరమైన పరిణామంగా గోన్యూస్‌ వ్యవస్థాపకుడు పంకజ్‌ పచౌరి తన ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు.

TELANGANA | మధ్యతరగతి నెత్తిపై అప్పుల కుప్ప.. వ్యక్తిగత రుణాల్లో తెలంగాణ స్థానం తెలుసా?

న్యూఢిల్లీ: మధ్యతరగతి ఆర్థికంగా తీవ్ర ఒత్తిడులకు లోనవుతున్నదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత పదిహేనేళ్ల కాలంలో గృహస్థుల రుణభారం 40.9 శాతానికి పెరగడం, అదే సమయంలో పొదుపు 18.9 శాతానికి పడిపోవడం ప్రమాదకరమైన పరిణామంగా గోన్యూస్‌ వ్యవస్థాపకుడు పంకజ్‌ పచౌరి తన ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు. 2014 ఆర్థిక సంవత్సరంలో 27 శాతంగా ఉన్న గృహస్థ రుణాలు అసాధారణ రీతిలో పెరిగాయి. పనిచేసే వయస్సు కలిగిన వారి జనాభా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందని, అయినా పొదుపు శాతం తగ్గిపోవడం గమనించవలసిన అంశమని ఆయన అన్నారు. ఉపాధిలేకుండా ఉండి ఖర్చులు పెరగడం వల్లే పొదుపు తగ్గిపోయినట్టుగా పరిగణించాల్సి ఉంఉందని ఆయన అంచనా వేస్తున్నారు. హామీలేని రుణాలు విపరీతంగా పెరగడం కూడా ఆందోళనకరమైన అంశమని మరొక ఆర్థిక నిపుణుడు పేర్కొన్నారు.

గృహరుణాలు కాకుండా ఇతర రుణాలను హామీ లేని రుణాలుగా పరిగణిస్తారు. 2024 మొదటి త్రైమాసికం నాటికి గృహరుణాలు 12.2 శాతం కాగా గృహేతర రుణాలు 18.3 శాతానికి పెరిగాయని ఆర్బీఐ నివేదికను ఉల్లేఖిస్తూ ఒక నిపుణుడు తన ఎక్స్‌ ఖాతాలో వివరించారు. అయితే అప్పులు లభించడం అన్నది ప్రగతికి చిహ్నంగానే భావించాలని మరొక ఆర్థిక నిపుణుడు వ్యాఖ్యానించారు. ఇందులో ఆందోళన చెందవలసింది ఏమీ లేదని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల వద్ద డబ్బంతా మార్కెట్‌లో ఉండాలని కోరుకుంటున్నదని, ప్రజల వద్ద పొదుపు గురించి వారికి చింతలేదని యోగేశ్‌ గోయెల్‌ అనే ఎక్స్‌ ఖాతాదారు అభిప్రాయపడ్డారు. కొత్త పన్ను వ్యవస్థ వల్ల ప్రజల వద్ద డబ్బు ఆదా అయ్యే అవకాశాలే లేవని, 80సీ కింద పొదుపు పరిమితిని ఏళ్ల తరబడి పెంచకపోవడమే అందుకు తార్కాణమని మరొక ఎక్స్‌ ఖాతాదారు పేర్కొన్నారు.

గ్రామీణ రుణభారం విపరీతంగా పెరుగుతున్నదని, ఇది టైంబాంబు వంటిదని శశిదాస్‌ అనే ఎక్స్‌ ఖాతాదారు హెచ్చరించారు. గ్రామీణ ప్రజలు ఎక్కువ వడ్డీ రేట్లకు అప్పులు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మధ్యతరగతిలో కూడా సీనియర్‌ సిటిజన్స్‌ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ధరల పెరుగుదల, డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపు, పెరుగుతున్న వైద్య ఖర్చులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సామాజిక భద్రతా చర్యలు లేకపోవడం వల్ల మెట్రో నగరాల్లో పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది’ అని దీపేంద్ర మోహన్‌ సిన్హా అనే ఒక ఢిల్లీ సామాజిక కార్యకర్త అభిప్రాయపడ్డారు.

రుణగ్రహీతల్లో తెలంగాణకు 5వస్థానం
తెలంగాణ నుంచి ఆటో రుణాలు రూ.4,900 కోట్లు కాగా మోటర్‌ సైకిళ్ల రుణాలు రూ.1,164 కోట్లు. వ్యక్తిగత రుణాల కేటగిరీలో తెలంగాణ ఐదవ స్థానంలో ఉంది. తెలంగాణలో ఇచ్చిన వ్యక్తిగత రుణాలు రూ. 16,274 కోట్లు. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు తెలంగాణ కంటే ముందున్నాయి. తెలంగాణలో వినియోగ సరుకులపై తీసుకున్న రుణాలు రూ. 2,407 కోట్లు కాగా ఇంటి రుణాలు రూ. 20,127 కోట్లు.