T20 World Cup 2026: జింబాబ్వేపై టీమిండియా భారీ గెలుపు – సెమీస్ రేసులో ముందంజ
టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8లో భారత్ 256 పరుగుల రికార్డు స్కోరు చేసి జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్ ప్రవేశానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. తాజా పాయింట్ల పట్టిక, నెట్ రన్‌రేట్ పరిస్థితి, సెమీస్ సమీకరణాలు ఇలా...
72 పరుగుల భారీ విజయానంతరం జింబాబ్వే బ్యాటర్ బెన్నెట్(97*)ను అభినందిస్తున్న సూర్యకుమార్ యాదవ్.
సారాంశం
టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8లో భారత్ అద్భుత ప్రదర్శనతో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 256/4 రికార్డు స్కోరు నమోదు చేయగా, జింబాబ్వే 184/6కే పరిమితమైంది. ఈ గెలుపుతో భారత్ 2 పాయింట్లు సాధించి, నెట్‌రన్‌రేట్‌ను -0.100కు మెరుగుపరుచుకుని సెమీఫైనల్ రేసులో ముందడుగు వేసింది.
విధాత క్రీడా విభాగం | 26 ఫిబ్రవరి 2026 | హైదరాబాద్:
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన టి20 ప్రపంచకప్ సూపర్-8 గ్రూప్-1 కీలక మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 256 పరుగులు చేసింది. ప్రతిగా ఛేదనలో జింబాబ్వే 184కే పరిమితమై టోర్నీ నుండి నిష్క్రమించింది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు సమిష్టిగా రాణించడంతో విజయం సాధించి, సెమీస్ వైపు అడుగేసింది.

జింబాబ్వేపై సూపర్-8 మ్యాచ్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సంజు శాంసన్. భారీ స్కోరుకు బాటలు వేసాడు. ఫోటో: espncricinfo
బెన్నెట్ పోరాటం వృథా.. దెబ్బతీసిన అర్షదీప్
257 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన జింబాబ్వే ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. బ్రియాన్ బెన్నెట్ 57 బంతుల్లో 97* చేసి ఒంటరి పోరాటం చేశాడు. సికందర్ రజా 31 పరుగులు జోడించినా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 24 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. బౌలర్లు, ఫీల్డర్లు సమిష్టి ప్రదర్శనతో చివరికి జింబాబ్వేను 6 వికెట్ల నష్టానికి 184 పరుగులకే పరిమితం చేశారు.
భళిరా.. భారత బ్యాటింగ్.. రికార్డుల మోత

అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా అర్ధశతకాలతో చెలరేగి భారత్‌కు భారీ స్కోరు సాధించిపెట్టారు. ఫోటో: espncricinfo
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే దూకుడుగా సాగింది. పవర్‌ప్లేలోనే 80/1 నమోదు చేసి టోర్నమెంట్‌లో రెండో అత్యధిక పవర్‌ప్లే స్కోరు సాధించింది. అభిషేక్ శర్మ 30 బంతుల్లో 55 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేయగా, ఇషాన్ కిషన్ 38 (24 బంతులు), సంజు శాంసన్ 24 (15 బంతులు) వేగంగా పరుగులు
సాధించారు. సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 33 పరుగులు చేసి రన్‌రేట్‌ను పెంచాడు. ముఖ్యంగా పరుగులు తక్కువే అయినా, సంజూ రిస్క్ చేసి షాట్లు ఆడటం వల్ల అభిషేక్ ఒత్తిడి లేకుండా ఆడగలిగాడు. ఒకరకంగా ఇంతటి భారీ స్కోరుకు సంజూ అందించిన స్పూర్తే కారణం.
చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా చెలరేగి 23 బంతుల్లో అజేయంగా 50, తిలక్ వర్మ 16 బంతుల్లో అజేయంగా 44 పరుగులు చేసి ఐదో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మొత్తం ఇన్నింగ్స్‌లో భారత్ 17 సిక్సర్లు బాదడం విశేషం. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు చేసి ప్రత్యర్థిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. టి20 ప్రపంచకప్ పోటీల్లో ఇదే భారత్‌కు అత్యధిక స్కోరు. జింబాబ్వే బౌలర్లలో నలుగురు తలా ఒక వికెట్ తీసుకున్నారు.
తప్పనిసరి పోటీలో ఒత్తిడిని జయించిన భారత్

జింబాబ్వేపై వేగంగా పరుగులు సాధించి భారీ స్కోరుకు బాటలు వేసిన ఇషాన్ కిషన్, తిలక్ వర్మ. ఫోటో: espncricinfo
ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్‌లో దూకుడు, బౌలింగ్‌లో క్రమశిక్షణ ప్రదర్శించి సెమీస్ రేసులో నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో ఎలా ఆడాలో అలా ఆడి ఘన విజయం సాధించింది. ఇక మార్చి 1న విండీస్‌తో జరగబోయే ఆఖరి సూపర్–8 మ్యాచ్లో గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారవుతుంది.
కాగా, నేడు జరిగిన రెండు పోటీల ఫలితాలు భారత్‌కే అనుకూలంగా వచ్చాయి. ముందు జరిగిన సౌతాఫ్రికా – వెస్టిండీస్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలవడం, సొంత మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడం భారత అభిమానుల్లో ఆనందోత్సాహాలను నింపింది.
భారత్‌కు అనుకూలంగా మారిన పాయింట్ల పట్టిక:
| స్థానం | జట్టు | మ్యాచ్‌లు | గెలుపులు | ఓటములు | పాయింట్లు | NRR |
|---|---|---|---|---|---|---|
| 1 | దక్షిణాఫ్రికా | 2 | 2 | 0 | 4 | +2.890 |
| 2 | వెస్టిండీస్ | 2 | 1 | 1 | 2 | +1.791 |
| 3 | భారత్ | 2 | 1 | 1 | 2 | -0.100 |
| 4 | జింబాబ్వే | 2 | 0 | 2 | 0 | -4.475 |
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram