భారత్‌లో తీవ్ర ఆర్థిక అసమానతలు.. ప్రపంచంలోనే అత్యధికం
భారతదేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను పరిష్కరించేందుకు అతిసంపన్నులపై 2 శాతం వార్షిక సంపద పన్ను విధించాలని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది
2000 నుంచి పెరుగుతూ వస్తున్నాయి
1% వ్యక్తుల ఆదాయంలో 22.6 శాతం,
సంపదలో 40.1 శాతం పెరుగుదల
2014-15, 2022-23 మధ్య మరింత అధికంగా సంపద కేంద్రీకరణ
అసమానతల పరిష్కారానికి శతకోటీశ్వరులపై పన్ను వేయాలి
వాటిని సామాజిక రంగాలకు తరలించాలి
తాజా పరిశోధన పత్రంలో ఆసక్తికర అంశాలు
న్యూఢిల్లీ: భారతదేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను పరిష్కరించేందుకు అతిసంపన్నులపై 2 శాతం వార్షిక సంపద పన్ను విధించాలని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. పదికోట్లపైబడిన ఆస్తులు ఉన్నవారిపై 3శాతం పన్ను, 33శాతం వారసత్వ ఆస్తి పన్ను విధించాలని తెలిపింది. ఈ పరిశోధనాపత్రానికి ప్రముఖ ఆర్థిక వేత్త థామస్ పికెట్టీ సహ రచయితగా ఉన్నారు. ‘భారత్‌లో తీవ్రస్థాయిలో ఉన్న అసమానతల పరిష్కారానికి ఆస్తిపన్ను ప్రతిపాదనలు’ పేరిట ఈ పరిశోధనా పత్రాన్ని విడుదల చేశారు. సంపద పంపిణీకి, సామాజిక రంగ పెట్టుబడులకు వీలు కల్పించేందుకు అతి సంపన్నులపై సమగ్ర పన్ను ప్యాకేజీని ఈ పత్రం ప్రతిపాదించింది. పన్నుతో ప్రభావితమవుతున్న 99.96 శాతం మందిని వదిలి మిగిలినవారిపై భారీ స్థాయిలో పన్ను విధించాలని పేర్కొన్నది.
పదికోట్లకు మించిన సంపద ఉన్నవారిపై 2శాతం వార్షిక పన్ను, పది కోట్లకు మించిన ఆస్తులపై 33శాతం వారసత్వ పన్ను విధిస్తే స్థూల జాతీయోత్పత్తికి 2.73శాతం ఆదాయం సమకూరుతుందని తెలిపింది. అలా వచ్చిన సంపదను సమగ్ర విధానాల ద్వారా పేదలు, అణగారిన కులాలు, మధ్యతరగతి వర్గాలకు తగిన పద్ధతిలో పునఃపంపిణీ చేయాలని పేర్కొన్నది. తద్వారా సామాజిక రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతాయని తెలిపింది. పన్ను వ్యవస్థపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలని పరిశోధన పత్రం సూచించింది. ఈ పత్రాన్ని థామస్ పికెట్టీ (పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్), లూకస్ చాన్సెల్ (హార్వర్డ్ కెన్నెడీ స్కూల్, వరల్ ఇనీక్వాలిటీ ల్యాబ్), నితిన్ కుమార్ భారతి (న్యూయార్క్ యూనివర్సిటీ, వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్) రూపొందించారు.
భారతదేశంలో ఆదాయాలు, సంపదల అసమానతలు, 1922-2023 : పెరుగుతున్న శతకోటీశ్వరులు’ పేరిట తమ పత్రం విడులైన తర్వాత ఆదాయం, ఆస్తిపన్నుపై భారతదేశంలో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశాన్ని పరిశోధన ప్రత్రం ప్రస్తావించింది. దేశంలో ఆర్థిక అసమానతలు చారిత్ర స్థాయికి చేరుకున్నాయని ఆ పత్రం పేర్కొన్నది. తీవ్రస్థాయిలో ఉన్న అసమానతలు, సామాజిక అన్యాయంతో వాటికి ఉన్న లింకును ఇంక ఎంతోకాలం విస్మరించజాలమని తెలిపింది.
దేశంలో అసమానతలు 2000 సంవత్సరం నుంచి తీవ్రస్థాయిలో పెరుగుతూ వచ్చాయని మార్చి 20న విడుదల చేసిన పత్రంలో రచయితలు తెలిపారు. 2022-23 నాటికి జనాభాలోని ఒక శాతం వ్యక్తుల ఆదాయం 22.6 శాతం, సంపద 40.1 శాతం పెరిగాయని పేర్కొన్నారు. ప్రత్యేకించి 2014-15, 2022-23 మధ్యలో సంపద కేంద్రీకరణ మరింత అధికంగా ఉన్నదని పేర్కొన్నారు. 2022-23 నాటికి ఒకశాతం వ్యక్తుల ఆదాయం సంపద వాటా (22.6%, 40.1%) చారిత్రక గరిష్ఠస్థాయిలో ఉన్నాయని తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యధికమని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికా కంటే కూడా ఇది ఎక్కువని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram