చలితో వణుకుతున్న ఉత్తర భారతం.. భారీగా కమ్మేసిన పొగమంచు..

దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరభారతాన్ని చలి వణికిస్తున్నది. దట్టమైన పొగమంచు కురుస్తుండగా.. చలిగాలులు వీస్తుండగా జనం ఇబ్బందులకు గురవుతున్నారు.

చలితో వణుకుతున్న ఉత్తర భారతం.. భారీగా కమ్మేసిన పొగమంచు..

Delhi Weather | దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరభారతాన్ని చలి వణికిస్తున్నది. దట్టమైన పొగమంచు కురుస్తుండగా.. చలిగాలులు వీస్తుండగా జనం ఇబ్బందులకు గురవుతున్నారు. దృశ్యమానత తక్కువగా ఉండడంతో రైళ్లు, విమాన సర్వీసులు ప్రభావితమవుతున్నాయి. రాబోయే 2-3 రోజుల పాటు చలి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాలయాల నుంచి గాలులు వీస్తుండడంతో పగటిపూట సైతం చల్లటి గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ గురువారం ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.


ఆకాశం నిర్మలంగా ఉంటుందని, ఉదయం నుంచి తేలికపాటి పొగమంచు కురిసే అవకాశం వాతావరణశాఖ తెలిపింది. గురువారం ఉదయం వేకువ జామున ఉత్తరప్రదేశ్, చండీగఢ్, రాజస్థాన్, బీహార్‌లో దట్టమైన భారీగా పొగమంచు, మధ్యప్రదేశ్, త్రిపురలో దట్టంగా పొగమంచు పేరుకుపోయింది. దీంతో దృశ్యమానత తగ్గింది. జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా హిమపాతం కురుస్తుండడంతో శీతలగాలులు వీస్తున్నాయని.. దాంతో ఉత్తరభారతం మొత్తం ప్రభావం కనిపిస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు, మూడురోజులు పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేసింది. దట్టమైన పొగమంచుతో రైళ్లకు అంతరాయం కలిగింది. రైళ్లు ఆరు నుంచి ఎనిమిది గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బుధవారం 75 రైళ్లు ఆలస్యంగా నడిచాయి.