ఆ విష‌యంలో అమ్మాయిల‌తో పొలిస్తే అబ్బాయిల్లో ఆసక్తి త‌క్కువ‌..

  • Publish Date - November 5, 2023 / 09:32 AM IST

అబ్బాయిలు ఎక్కువ‌గా పాజిటివ్ మాట‌లు.. అమ్మాయిలు అయితే నెగ‌టివ్ మాట‌లు (Men Less Likely Share Negative Experiences) ఎక్కువ‌గా మాట్లాడ‌తార‌ని మీకెప్పుడైనా అనిపించిందా? ఒక‌వేళ అలా అనిపిస్తే అది త‌ప్పు కాద‌ని.. అది నిజమేన‌ని ఒక అధ్య‌య‌నం (Study) లో వెల్ల‌డైంది. అబ్బాయి త‌న జీవితంలో జ‌రిగిన ప్ర‌తికూల ఘ‌ట‌న‌ల‌ను ఎక్కువ‌గా చెప్పాల‌నుకోడ‌ని.. ఒక వేళ చెప్పాల‌నుకున్నా ఆ క్ర‌మంలో ఎంతో ఇబ్బంది ప‌డ‌తాడ‌ని ఇందులో పేర్కొన్నారు.


కార్నేజీ మెలాన్ యూనివ‌ర్సిటీ, బేయ‌స్ బిజినెస్ స్కూల్‌, బ‌కోనీ యూనివ‌ర్సిటీలు సంయుక్తంగా నిర్వ‌హించిన ఈ అధ్య‌య‌నంలో ప్ర‌తికూల ఘ‌ట‌న‌ల‌ను, సంభాష‌ణ‌ల‌ను పంచుకోవ‌డంలో మ‌గ‌వారు, ఆడ‌వారి మ‌ధ్య ఉండే తేడాల‌ను నిశితంగా ప‌రిశీలించి విశ్లేషించారు. ఈ వివ‌రాలు ఎక్స్‌పెరిమెంట‌ల్ సోష‌ల్ సైకాల‌జీ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి. దీని ప్ర‌కారం.. త‌మ జీవితంలోని ప్ర‌తికూల భావ‌న‌ల‌ను ఇత‌రుల‌తో పంచుకోవ‌డంలో మ‌గ‌వారు అంత‌గా ఇష్ట‌ప‌డ‌ర‌ని తేలింది. వీరితో పోలిస్తే ఆడ‌వారు ఆ విష‌యంలో ఎక్కువ ఆస‌క్తి చూపిస్తార‌ని వెల్ల‌డైంది.


ఈ అధ్య‌య‌నం కోసం నిర్వాహ‌కులు 1000 మందిని యువతీ యువ‌కుల‌ను తీసుకుని వారిపై మూడు ప్ర‌యోగాలు నిర్వ‌హించారు. ఆ క్ర‌మంలో సంభాష‌ణ‌ల‌ను, వారి మాన‌సిక స్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించారు. ‘ఈ త‌ర‌హా ప‌రిశోధ‌న గ‌తంలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. ఏదైనా విష‌యాన్ని ఆడ‌వారు ఎక్కువ రోజులు దాచుకోలేర‌నే వాద‌న అన్ని సంస్కృతుల్లోనూ ఉంది. ఈ వాద‌న‌ను బ‌ల‌ప‌ర‌చ‌డానికి లేదా తుడిచిపెట్ట‌డానికి కొన్ని ప‌రిశోధ‌న‌లు అవ‌స‌రం. అదే మేము చేశాం’ అని కార్నిగే మెలాన్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ డా.ఎరిన్ కార్‌బోనే వెల్ల‌డించారు.


ఈ ప‌రిశోధ‌న‌ల్లో అబ్బాయిలు త‌మ జీవితంలో జ‌రిగిన బాధాక‌ర‌మైన ఘ‌ట‌న‌ల‌ను చెప్పుకోవ‌డానికి అంత‌గా ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని గుర్తించామ‌ని ఆయ‌న అన్నారు. దీనికి కార‌ణం త‌మ‌ను అవ‌త‌లి వారు చుల‌క‌న‌గా చూస్తార‌న్న ఆత్మ‌న్యూన‌తా భావ‌మేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అదే ఆడ‌వారి (Women) ని ప‌రిశీలిస్తే వారు త‌మ బాధ‌ను దించుకోవ‌డానికి ఇత‌రుల‌తో పంచుకోవ‌డాన్నే ఒక సాధ‌నంగా చూస్తార‌ని పేర్కొన్నారు. ‘ఈ డిజిటల్ యుగంలో సామాజిక మాధ్య‌మాల్లో అంద‌రూ స‌మాచారాన్ని పంచుకోవ‌డం ఎక్క‌వైంది. ఇందులో త‌మ బాధ‌ల‌ను అంద‌రితో పంచుకోవ‌డ‌మూ ఒక‌టి.


ఈ కోణంలో చూస్తే జెండ‌ర్ (Gender Difference) ఒక ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. యువ‌తులు ఎక్కువ‌గా త‌మ బాధ‌ల‌ను పంచుకోవ‌డం.. ఆక‌తాయి అబ్బాయిల‌కు ఒక అవ‌కాశంగా మారొచ్చు. దానిని వారు మోసం చేయ‌డానికి ఒక మెట్టుగా ఉప‌యోగించుకోవ‌చ్చు’ అని అధ్య‌య‌నంలో పాలుపంచుకున్న ప్రొఫెస‌ర్ ఐరెనీ స్కాపెల్లిటీ అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే సానుకూల అంశాల‌ను ఇత‌రుల‌తో చెప్పుకొని ఆనందించ‌డంలో పురుషులు, స్త్రీలు ఒకే ర‌క‌మైన ఆస‌క్తిని క‌లిగి ఉన్నార‌ని ఈ అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

Latest News