విధాత: ఇవాళ రేపు మహిళలు పాతికేళ్ల వయస్సులో వివాహం చేసుకుంటున్నారని, అయితే అంతకు ముందే సహజీవనం లేదా పురుషులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వివాదాస్పద ప్రవచనకర్త అనిరుద్ధాచార్య మహారాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతున్నాయో తెలిసిన విషయమే. ఈ వ్యాఖ్యలు మహిళా లోకాన్ని నివ్వెరపర్చడమే కాకుండా గుండెలను పిండేశాయి. అనిరుద్ధాచార్య చేసిన అమానవీయ వ్యాఖ్యలపై ఆల్ ఇండియా హిందూ మహాసభ ఆగ్రా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మీరా రాథోర్ మథుర చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో కేసు వేశారు. కోర్టు పిటీషన్ స్వీకరించిందని, ఆయన మగ దురహాంకార వ్యాఖ్యలపై విచారణ కొనసాగుతుందని పిటీషనర్ మీరా వెల్లడించారు. వచ్చే జనవరి 1వ తేదీన విచారిస్తామని కోర్టు తెలిపిందని, ఆ రోజు తన స్టేట్ మెంట్ కూడా రికార్డు చేస్తారని పేర్కొంది.
అయితే అనిరుద్ధాచార్య చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై హీరోయిన్ దిశా పఠాని సోదరి కుష్భూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 25 ఏళ్ల లోపే ఎంజాయ్ చేస్తున్నారని, నాలుగురితో కలిసి తిరిగి అనుభవిస్తున్నారని అని తన ముందు వ్యాఖ్యానిస్తే, ఏ విధమైన అర్థం వస్తుందనేది తాను తెలియచేసేదాన్ని అంటూ ఆమె స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్ మెంట్ పై గ్యాంగ్ స్టర్, గుండాలు, హిందూ సంస్థల నుంచి ఆమెకు వేధింపు కాల్స్, మెస్సేజ్ లు వచ్చాయి. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భద్రత పెంచారు.
