Half Day Schools : తెలంగాణలో ఈ నెల 15నుంచి ఒంటి పూట బడులు

తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరగనుండగా, ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించారు.

Half Day Schools

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో వేసవి ఎండల ధాటికి అల్లాడిపోతున్న విద్యార్ధులకు ప్రభుత్వం చల్లని కబురు అందించింది. ఈనెల 15నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట తరగతులు నిర్వహిస్తారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23 ఈ విద్యా సంవత్సరానికి చివరి పని దినంగా నిర్ణయించగా, ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమవుతాయి.

తెలంగాణ విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒంటిపూట బడుల నిర్వహణలో భాగంగా.. పాఠశాలలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే కొనసాగుతాయి. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తారు. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ (ఎయిడెడ్), ప్రైవేట్ యాజమాన్యంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్గదర్శకాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ విద్యాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులు కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించే పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

పది పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలకు ప్రత్యేక మార్గదర్శకాలు

10వ తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలను నిర్వహిస్తారు. అయితే పరీక్షలు లేని రోజుల్లో ఆ పాఠశాలలు కూడా మిగతా విద్యాసంస్థల మాదిరిగానే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే పనిచేస్తాయి. పదో తరగతి విద్యార్థులకు పరీక్షల కోసం నిర్వహించే ప్రత్యేక కోచింగ్ తరగతులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. పరీక్షలకు సన్నద్ధం కావడానికి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన వేసవి సెలవుల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి :

GHMC Property Tax : ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ఆఫర్ !
Fake Doctor At Yashoda Hospital : యశోదా హాస్పిటల్ లో ఫేక్ డాక్టర్ కలకలం!

Latest News