విధాత, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య సరికొత్త వివాదం రగులుకుంది. ఆ వివాదమే.. తెలంగాణలో మళ్లీ సారా విక్రయాలు ప్రారంభించడం. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) ఈ వివాదాన్ని రాజేయ్యగా..దీనికి బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్( Srinivas Goud) మరింత పెట్రోల్ పోసి భగ్గుమనిపించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేలుస్తానని చెప్పిన అనిరుధ్ రెడ్డి…తెలంగాణ రాష్టంలో సారా దుకాణాలు( sara shops) తిరిగి ప్రారంభించాలని అసెంబ్లీ సమావేశాల్లో కోరుతానని తెలిపారు. అయితే నాటు సారా కాకుండా…విప్ప (ఇప్ప) పువ్వుతో తయారు చేసిన ఆర్గానిక్ విప్పసారా (Vippa Flower Liquor) అమ్మకాలు ప్రారంభించాలంటూ ప్రతిపాదన తెచ్చారు.
విప్ప సారా తాగి 115 సంవత్సరాల పాటు బ్రతికిన జనం, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారని పేర్కొన్నారు. సైన్టిఫిక్ గా సారా ఆరోగ్యానికి హానికరం కాదని, ఇటీవల కొన్ని రాష్టాలు సారా దుకాణాలు తిరిగి ప్రారంభించాయని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలలో ప్రభుత్వాలు అధికారికంగా విప్ప సారా దుకాణాలను నడుపుతున్నారని తెలిపారు. వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్లో సారా దుకాణాల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తాననని స్పష్టం చేశారు. ఇందుకు విదేశీ శాస్త్రవేత్తలతో చర్చించి ఔషధ గుణాలు ఉన్నాయని నిర్ధారించుకున్నాకే ఈ డిమాండ్ తెరపైకి తెచ్చానని, ఎగుమతులతో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని, దీనిపై తాను 200పేజీల రిపోర్టు కూడా సిద్దం చేశానని తెలిపారు. నా ప్రతిపాదనలను ప్రతిపక్షాలు కూడా స్వాగతిస్తాయని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విప్ప (ఇప్ప) పువ్వు సారా సరే..నీరా కేఫ్ ల సంగతేంటీ ? : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందునా విప్పపువ్వు సారాను అధికారిక పాలసీగా తీసుకోవాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.పేదలు, గిరిజనుల సంక్షేమం కోసం ఆనాడు కేసీఆర్ నాటుసారాను నిషేధించారని స్పష్టం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో విప్ప చెట్లు భద్రాచలం, నల్లమల ప్రాంతానికే పరిమితమయ్యాయని, సారా తయారీకి అవసరమైన స్థాయిలో చెట్లు లేవన్నారు. ప్రభుత్వమే విప్ప చెట్లు పెంచి, లాబోరేటరీలు ఏర్పాటు చేసి విప్ప సారా తయారీ, ఇతర ఉత్పత్తుల తయారీకి ప్రయత్నించవచ్చన్నారు. అయితే అందుకు ముందుగా .. నీరా సంగతేంటీ అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో కల్లుపై కుట్ర చేశారు…ఇప్పుడు నీరాపై కుట్ర చేస్తున్నారు అని మండిపడ్డారు. నీరా ఆరోగ్యానికి మంచిదని, క్యాన్సర్ రాదు..నరాల బలహీనతను దూరం చేస్తుందని, 18 రకాల జబ్బులు రావని నిర్ధారించబడిందని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.
నీరా కేఫ్ లపై కాంగ్రెస్ హామీలు విస్మరించింది
ఎన్నికల్లో నీరా కేఫ్ ల (Neera Cafes) ను ఆధునీకరిస్తామని, నీరా కేంద్రాలను జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తామని, నీరా ఉత్పత్తులను ఎగుమతులు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్లుగా హైదరాబాద్ నీరా కేఫ్ లను బంద్ చేసిందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. తాము ఆందోళనలు చేస్తే ఇప్పుడు నీరా కేఫ్ ల నిర్వహణపై నోటిఫికేషన్ ఇచ్చిందని, అది కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే కల్లుగీత వృత్తిదారుల ఉపాధిని దృష్టిలు పెట్టుకుని లాభ, నష్టాలతో నిమిత్తం లేకుండా నీరా కేఫ్ లు నిర్వహించాలన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నీరా కేఫ్‌లను కాపాడుకొనే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్‌కు కట్టపెడితే మాత్రం ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఈ కేఫ్‌ల వల్ల 10 కులాల వారికి పనులు దొరుకుతాయని గుర్తుచేశారు. నీరాకేఫ్‌ల ఏర్పాటుకోసం నందనంలో వందశాతం పూర్తయినా నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని ఈ ప్రభుత్వం ప్రారంభించడం లేదని ఆవేదన వెళ్లగక్కారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కుల వృత్తిదారులకు ఎన్నో హామీలిచ్చినా, వాటిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. 1.50 కోట్ల తాటి చెట్లను బీఆర్‌ఎస్ హయాంలో నాటినవేనని గుర్తు చేశారు. ఎన్నికల ముందు గౌడన్నలకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలిచ్చి.. నేడు మరిచిందని దుయ్యబట్టారు. రూ.20 కోట్ల మేర గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా పెండింగ్‌లో ఉన్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ ను ముంచేసిన సారాను మళ్లీ తెస్తారా..?
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వారుణి వాహిని పేరుతో సారా డిపోల ద్వారా ప్రభుత్వం సారా విక్రయాలు జరిపింది. సారాతో పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రగిలిపోయిన జనం సారా అమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1991 నెల్లూరు దూబగుంట రోశమ్మతో మొదలైన తిరుగుబాటుతో ఎగిసిన సారా వ్యతిరేక ఉద్యమం ఉమ్మడి రాష్ట్రమంతటా విస్తరించి చివరకు కాంగ్రెస్ పీఠాలను కదిలించేసింది. ప్రజాతిరుగుబాటుకు తలొగ్గి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు సారా విక్రయాలను నిషేధించాయి. ఉమ్మడి రాష్ట్రంలో సారా వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో 1993 అక్టోబర్ 1 నుండి అప్పటి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సారా అమ్మకాలపై నిషేధాన్ని ప్రకటించింది. అయినా ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. 1994 సంవత్సరంలో ఎన్.టి.రామారావు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యపాన నిషేధం విధిస్తూ సీఎంగా దీనిపై తొలి సంతకం చేశారు. 1995 జూన్ 1 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. పక్కరాష్ట్రాల నుంచి మద్యం అనధికార దిగుమతి, నాటుసారా తయారీతో సంపూర్ణ మద్యపానం నిషేధ పాలసీ విఫలమైంది. తర్వాత కాలంలో 1997లో చంద్రబాబు ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎత్తివేస్తూ చట్టం తెచ్చింది.
పల్లెల్లో గుప్పుమన్న గుడుంబా(నాటుసారా)
ప్రభుత్వం పరంగా అధికారిక సారా విక్రయాలు బంద్ అయినప్పటికి..అనధికారికంగా నాటుసారా, కల్తీసారా రాష్ట్రమంతటా జడలు విప్పింది. నాటు సారా అమ్మినోళ్లకు భవంతులు..తాగినోళ్లకు సమాధులు అన్నట్లుగా తెలంగాణలో వాతావరణ నెలకొంది. పల్లెల్లో నాటు సారా తయారీ కుటీర పరిశ్రమ స్థాయికి విస్తరించింది. ఈ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ సారా రహిత తెలంగాణ నినాదం అందుకున్నారు. రాష్ట్రంలో గిరిజనులు, దళితులు, కూలీలు, కార్మికులు, పేద వర్గాల వారే నాటు సారా తయారీ, అమ్మకాలు సాగిస్తుండటం..ఆ వర్గాల వారే ఆ నాటుసారా(గుడుంబా) తాగి ఆర్థికంగా, శారీరకంగా చితికిపోతూ చనిపోవడాన్ని గమనించారు. సారా రహిత తెలంగాణ సాధనకు నాటు సారా తయారీ, అమ్మకాలు సాగించే వారిపై పీడీ యాక్ట్ లు సైతం పెట్టడంతో పాటు సమాంతరంగా ఆ కుటుంబాలకు పునరావాస పథకాలు అమలు చేసి..నాటు సారా తయారీ, అమ్మకాలపై నిషేధం కొనసాగించారు. దీంతో తెలంగాణ దాదాపుగా నాటుసారా తయారీ అమ్మకాలు తగ్గిపోగా..దాని స్థానాన్ని చీఫ్ లిక్కర్ ఆక్రమించేసింది.
విప్ప పువ్వు సారా సాధ్యమేనా..?
విప్ప పువ్వు సారా ఆదివాసీ గిరిజన సంస్కృతిలో భాగమైన సాంప్రదాయ పానీయం. విప్ప పూలను ఎండబెట్టి, నీటిలో నానబెట్టి, ఊటబెల్లంతో కలిపి పులియబెట్టి సారాను తయారు చేస్తారు. అడవి ప్రాంతాల్లోని ఆదివాసీలు, గిరిజనులు దీనిని పండుగలు, సంబరాలలో సాంప్రదాయ పానీయంగా ఉపయోగిస్తారు. విప్ప పూలలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఇదివరకే నిర్థారించారు. వీటితో లడ్డూలు వంటి ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తున్నారు. ఆరోగ్యపరంగా విప్ప పువ్వులో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్-సి, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని, అనేక ఔషధ గుణాలు ఆర్గానిక్ పానీయంగా ఇది వరకే నిర్ధారించారు. ఇది అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి వ్యాధులను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుందని నమ్ముతారు. విప్పసారాలో మెథనాల్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది తాగితే హ్యాంగోవర్ సమస్య కూడా ఉండదు. గిరిజనులు విప్ప పువ్వులు, పండ్లు, కొమ్మలు, ఆకులు అన్నిటినీ ఆహారంగా, పశుగ్రాసంగా, ఇంధనంగా, మందులుగా ఉపయోగించేవారు.
బ్రిటీష్ కాలంలోనే విప్ప పువ్వు సారాపై నిషేధం
లాటిన్ పరిభాషలో సపోటేసీ జాతికి చెందిన అడవి చెట్టు విప్ప. భారత్ లో విప్ప చెట్టుగా పిలిచే మధుక లాంగిఫోలియా దేశంలోని తూర్పు, పశ్చిమ, మధ్య ప్రాంత అడవుల్లో విస్తారంగా కనిపిస్తుంది.తెలుగు రాష్ట్రాలలో ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విరగపూస్తుంది. గిరిజనులు పూలు రాలడానికి ముందే వాటి చుట్టూ నేలను శుభ్రం చేస్తారు. తెల్లవారుతున్న వేళ విప్పపూలు రాలుతున్న సమయంలో సువాసన వెదజల్లుతాయి. ఇంటిల్లిపాదీ కలసి చెట్టు వద్దకు చేరుకుని బుట్టలు, చేటలతో పూలను సేకరిస్తారు. వీటిని నాలుగైదు రోజులు బాగా ఎండబెడతారు. ఎండిన పూలను సంతలకు తీసుకువెళ్లి విక్రయిస్తారు. ఒక చెట్టుకు సుమారు 150 కిలోల విప్ప పువ్వు లభ్యమవుతుంది. పూలను ఎండబెట్టిన తరువాత వచ్చే పువ్వు కిలో రూ.60నుంచి 100 ధరకు విక్రయిస్తున్నారు. విప్పకాయలు కిలో రూ.50 వరకు అమ్ముతున్నారు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి బతికే గిరిజనులకు విప్ప పువ్వు ఆదాయ వనరుగా మారింది. గిరిజనులు మాత్రం విప్ప పువ్వు సారాను సొంతంగా తయారు చేసుకునే సాంప్రదాయం కొనసాగుతుండగా…అధికారికంగా మాత్రం తయారీ, అమ్మకాలపై నిషేధం కొనసాగుతుంది.
వలస పాలన నుంచి నిషేధంలోనే విప్ప పువ్వు సారా
వాస్తవానికి విప్పపువ్వు సారాను బ్రిటీష్ వలస పాలకుల హయాంలనే భారత్ లో నిషేధించారు. బ్రిటిషర్ల పాలనలో విప్ప సారా మద్యాన్ని నాటుసారాగా పరిగణిస్తూ ప్రజారోగ్యానికి, నైతికతకు ముప్పు కలిగించే ప్రమాదకర మత్తుపదార్థంగా పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకులు 1878లో బొంబాయి అబ్కారీ చట్టం, 1892లో మౌరా చట్టం తీసుకొచ్చి విప్పసారా తయారీతో పాటు విప్ప పూల సేకరణ, నిల్వపైనా నిషేధం విధించారు. అప్పటి నుంచి రహస్యంగా విప్పసారా తయారుచేయడం మొదలైంది. దీంతో నాణ్యత లోపించడంతో నిషేధానికి బలం చేకూరింది. తరువాత స్వాతంత్ర భారత దేశంలో కూడా బ్రిటిష్ వలస పాలనలో మాదిరిగానే విప్ప సారాపై ప్రభుత్వాల పరంగా కఠిన ఆంక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి.
గోవాతో అధికారికంగా మొదలైన విప్ప పువ్వు సారా తయారీ
తొలుత గోవా విప్ప సారాకు పరిమితులతో అనుమతించింది. 2018లో ‘డెస్మండ్‌జీ బ్రాండ్ పేరుతో డెస్మండ్ నజారెత్ విప్పసారాను అధికారికంగా ఇండియన్ మేడ్ లిక్కర్(ఐఎంఎల్) కేటగిరీలో మార్కెట్లోకి తెచ్చారు. గోవాకు చెందిన క్రాఫ్ట్ డిస్టిలర్ ఈ విప్పసారాను కర్ణాటకలో విక్రయిస్తుంది. విప్పసారా నాటుసారా కాదు ఇండియన్ మేడ్ లిక్కర్(ఐఎంఎల్) అని గుర్తించిన రెండో రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. డెస్మండ్ నజారెత్ తన సంస్థ తయారుచేసే విప్పసారా కోసం పూలను ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోని గిరిజన సంఘాలు, సహకార సంఘాల సాయంతో సంపాదిస్తున్నారు. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ ‘నేటివ్ బ్రూస్’ డైరెక్టర్ సుసాన్ డయాస్ 2018లోనే వసంత్‌దాదా షుగర్ ఇనిస్టిట్యూట్‌లో విప్పపూలతో మద్యం తయారీ యూనిట్ ప్రారంభించడం విశేషం. 2021లో మధ్యప్రదేశ్ రాష్ట్రం విప్పసారాను వారసత్వ మద్యంగా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం స్థానిక గిరిజన తెగలు విప్ప పూలు సేకరించొచ్చు, నిల్వ చేసుకోవచ్చంటూ పాత చట్టాలలో మార్పులు తెచ్చింది. అదే ఏడాదిలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ సంస్థ ‘అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ’ గిరిజనులు సేకరించి ఎండబెట్టిన విప్ప పూలను ఫ్రాన్స్‌కు ఎగుమతి చేయడం ప్రారంభించింది.
తరిగిపోయిన విప్పపూల వృక్ష సంపద
ఉమ్మడి రాష్ట్రంలోని అడవులు తరిగిపోయినట్లుగానే అందులోని విప్ప పూల వృక్ష సంపద సైతం గణనీయంగా తగ్గిపోయింది. ఏపీలో మన్యం అడవుల్లో.. తెలంగాణలో నల్లమల, భద్రాచలం అడవుల్లో ఎక్కువగా విప్పపూల చెట్లు ఉన్నాయి. అయితే గతంలో పోల్చితే చాలవరకు విప్ప పూల చెట్ల సంపద తరిగిపోయింది. ప్రభుత్వాలు గిరిజన మహిళల ఆదాయ వనరులను పెంచేందుకు విప్ప పూల ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గోవా, ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. విప్పపువ్వు చెట్లు తరిగిపోయిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిజంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డిమాండ్ మేరకు విప్ప పువ్వు సారా ప్రతిపాదనను ఆమోదిస్తే..అందుకు కావాల్సిన విప్ప చెట్లు, పూలు ఎక్కడి నుంచి సమీకరించనుందన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది.
