Site icon vidhaatha

USA | వీసా రద్ధు.. భారత విద్యార్ధికి అమెరికా కోర్టు ఊరట

విధాత: వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనుసరిస్తోన్న కఠిన విధానాలు ఆ దేశంలో నివసిస్తున్న విదేశీయులను కలవరపెడుతున్నాయి. ఎప్పుడు ఎవరి వీసాలు ఏ కారణంతో రద్ధవుతాయోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. తమ వీసాలు రద్దయిన సంగతి కూడా విద్యార్థులకు తెలియని పరిస్థితి నెలకొంది. విద్యా సంవత్సరం మధ్యలో తమను దేశం నుంచి వెళ్లగొడుతూ ట్రంప్‌ ప్రభుత్వం జారీ చేసిన ఆకస్మిక ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అమెరికా వ్యాప్తంగా పలు ఫెడరల్‌ కోర్టులలో పలువురు విదేశీ విద్యార్థులు కేసులు దాఖలు కూడా దాఖల చేస్తున్నారు. ఈ క్రమంలో ఆకస్మికంగా వీసా రద్దయిన ఓ భారతీయ విద్యార్థికి అమెరికా ఫెడరల్ కోర్టు నుంచి ఊరట లభించింది.

21 ఏళ్ల భారతీయ విద్యార్థి క్రిష్‌లాల్‌ ఐసర్‌దాసానీ.. విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. వచ్చే నెలలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి కానుంది. అయితే ఏప్రిల్ 4న అతడి ఎఫ్‌-1 విద్యార్థి వీసా రద్దయింది. స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్‌ విజిటర్స్ ప్రోగ్రామ్(SEVIS) డేటాబేస్‌లో వివరాలు తొలగించారు. దాంతో క్రిష్‌లాల్ స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ‘‘ఈ తొలగింపునకు ముందు అతడికి ఎలాంటి హెచ్చరిక చేయలేదు. వివరణ ఇవ్వడానికి కానీ, ఒకవేళ తప్పు చేసి ఉంటే దానిని సరిదిద్దుకోవడానికి కానీ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు’’ అని విచారణ సందర్భంగా బాధితుడి న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆ భారతీయ విద్యార్థిని బహిష్కరించకుండా ఉత్తర్వులు వెలువరించారు. వీసా రద్దు చేయకుండా, అతడిని నిర్బంధించకుండా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

గతేడాది నవంబరులో క్రిష్‌లాల్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఓ బార్‌ బయట రెండు వర్గాల మధ్య గొడవలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అనంతరం అతడిపై అభియోగాలు మోపేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు. ఈ క్రమంలోనే అతడి వీసా రద్దవ్వడం గమనార్హం. ఎఫ్‌-1 వీసా అనేది నాన్‌-ఇమిగ్రెంట్‌ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో ఫుల్‌ టైమ్‌ విద్యను అభ్యసించేందుకు ఈ వీసా అనుమతినిస్తుంది. అగ్రరాజ్యంలోని విద్యా సంస్థలు ఏటా రెండుసార్లు ప్రవేశాలను అనుమతిస్తాయి. ఆగస్టు- డిసెంబర్‌ సెమిస్టర్‌ సమయంలోనే భారత్ నుంచి అధికంగా విద్యార్థులు అమెరికా వెలుతున్నారు.

Exit mobile version