ములుగు అడవుల్లో విద్యావెలుగులు.. 20 ఏళ్లకు నెరవేరిన సీతక్క కల…

గుర్రాలబావిలో పాఠశాల ఇరవైయేండ్లుగా కంటున్న కలని, ఎట్టకేలకు అది తీరినందుకు ధనసరి అనసూయ ఎంతో సంతోషంగా ఉందని మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేసి ఇక్కడి గిరిజన, గిరిజనేతర పిల్లలకు విద్యనందించేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నం సాగుతోంది.

mulugu-container-school

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
గుర్రాలబావిలో పాఠశాల కోసం నూతన భవన నిర్మాణం చేపట్టాలంటే అటవీ చట్ట నిబంధనలు అడ్డింకిగా మారాయి. ఈ సమస్యకు పరిష్కారంగా పాఠశాల నిర్వహణ, తరగతి గదులకు తగిన విధంగా ఇనుప కంటైనర్ ఇంటి నిర్మాణం చేపట్టి ఇక్కడ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ దాతగా ముందుకు రావడంతో వారి సహకారంతో ఈ కంటైనర్ మండల పరిషత్ పాఠశాలను నిర్మించారు. ఈ పాఠశాలను గురువారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి హోదాలో తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అనేక విషయాలు మాట్లాడారు. ఇదిలా ఉండగా ఇంతకు ముందు కూడా స్కూల్, హాస్పిటల్ నిర్మాణం చేపట్టారు.

అవకాశాలు లేని చోట వనరుల సృష్టి: మంత్రి సీతక్క

అవకాశాలు లేని చోట నూతన వనరులను కల్పించడమే తన అంతిమ లక్ష్యమని, తిండిలేని వారికి భోజనం పెట్టడం, నీడ లేని చోట చెట్టు పెట్టడం, ఇల్లు లేనివారికి ఇల్లు సౌకర్యం కల్పించడంలో వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిదని చెప్పారు. గుర్రాల బావి గ్రామంలో 20 సంవత్సరాలుగా తాను కంటున్న కల ఈ రోజు నెరవేరిందని మంత్రి సీతక్క అన్నారు. ఎవరూ లేని వారికి ప్రజా ప్రభుత్వం పెద్దదిక్కుగా అండగా ఉంటుందని, జిల్లా అభివృద్ధికి ముందుకు వచ్చే స్వచ్ఛంద సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

అటవీ ప్రాంతాల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి అనుమతులు లేని చోట, ప్రత్యామ్నాయంగా కంటైనర్ స్కూళ్లు, హాస్పిటళ్లు మరియు అంగన్‌వాడీలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక్కడ నివసించే వారంతా 25 సంవత్సరాల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని సల్వాజుడుం ఘర్షణల వల్ల వలస వచ్చిన వారని, వారికి కనీస విద్య, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ ప్రాజెక్టుకు సహకరించిన ఈసీఐఎల్, సంతోష్ రామస్వామి వారి బృందాన్ని. దీనికి కృషి చేసిన కలెక్టర్, ఎస్పీ, విద్యాశాఖ అధికారును, స్థానిక యువతను మంత్రి సీతక్క అభినందించారు. చెట్ల కింద చదువుకునే పిల్లలకు, ఇప్పుడు సురక్షితమైన వాతావరణం కల్పించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్, ఏటూరు నాగారం ఏ ఎస్ పి, గ్రంథాలయ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, డీఈవో సిద్ధార్థ రెడ్డి,ఈసీఐఎల్ సంస్థ బృందం, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Latest News