నీట్ పేపర్ లీకేజీతో రేగిన విద్యార్ధి, నిరుద్యోగ యువత నిరసనలు..రాష్ట్రాలలోని పేపర్ల లీకేజీలు, పోటీ పరీక్షల నిర్వాహణలో వైఫల్యాలపై కూడా విస్తరిస్తున్నాయి. ఝార్ఖండ్ లో 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని, పేపర్ లీక్‌లపై విచారణ జరపాలని అభ్యర్ధులు నిరసలు కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉండగానే కర్ణాటక పోలీస్ నియామక పరీక్షలో సైతం అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్ష సందర్భంగా విజయపురలోని ఓ పరీక్షా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశ్నాపత్రాలపై ఉన్న సీరియల్ నంబర్లతో OMR షీట్లపై ఉన్న సీరియల్ నంబర్లతో సరిపోలడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆందోళనల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు పరీక్షా కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ (KEA) ప్రశ్నాపత్రం, OMR షీట్‌లపై సీరియల్ నంబర్లు ఒకేలా ఉండాలనే నిబంధన ఏదీ లేదని స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రంలోని సిరీస్, వెర్షన్ కోడ్‌లను మాత్రమే OMR షీట్‌లో సరిగ్గా నమోదు చేస్తే సరిపోతుందని వెల్లడించింది. అలాగే, టికోటా పరీక్షా కేంద్రంలో జరిగిన ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను KEA ఆదేశించింది.