Monalisa | మోనాలిసా వివాహంపై అనేక ప్ర‌చారాలు.. “ఇది లవ్ జిహాద్ కాదు” అంటూ క్లారిటీ

Monalisa | ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన యువతిమోనాలిసా భోంస్లే రీసెంట్‌గా వివాహం చేసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

Monalisa | ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన యువతిమోనాలిసా భోంస్లే రీసెంట్‌గా వివాహం చేసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించిన ఆమె, తన ప్రియుడు ఫ‌ర్మాన్ ఖాన్‌ను బుధవారం (మార్చి 11) సాయంత్రం కేరళలో వివాహం చేసుకుంది. కేరళలోని అరుమ‌నూర్ నాయ‌న‌ర్ ఆల‌యంలో ఈ జంట హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుంది. వివాహం అనంతరం గురువారం మీడియాతో మాట్లాడిన మోనాలిసా తమ పెళ్లిపై వస్తున్న వివాదాలపై స్పందించింది.

ఇది లవ్ జిహాద్ కాదు..

మతాలు వేరు కావడంతో సోషల్ మీడియాలో ‘లవ్ జిహాద్’ అంటూ వస్తున్న విమర్శలపై మోనాలిసా స్పష్టంగా స్పందించింది. నేను అన్ని మతాలను గౌరవిస్తాను. మా పెళ్లి లవ్ జిహాద్ కాదు. మేము పూర్తిగా హిందూ సంప్రదాయం ప్రకారమే వివాహం చేసుకున్నాం. నన్ను ఎప్పుడూ ఇస్లాం మతంలోకి మారమని ఫర్మాన్ అడగలేదు” అని ఆమె వెల్లడించింది.

అలాగే తన వయసు గురించి వస్తున్న అనుమానాలకు చెక్ పెడుతూ మీడియా సమావేశంలో తన బర్త్ సర్టిఫికేట్‌ను చూపించింది. అందులో 2008లో జన్మించినట్లు ఉండటంతో తాను మేజర్ అని, తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది.

ఎవరీ ఫర్మాన్ ఖాన్?

ఫర్మాన్ ఖాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భ‌గ్‌ప‌త్ జిల్లాకి కు చెందిన వ్యక్తి. అతను వృత్తిరీత్యా నటుడు, మోడల్‌గా పనిచేస్తున్నాడు. ఒక సినిమా షూటింగ్ సమయంలో మోనాలిసాతో పరిచయం ఏర్పడింది. మొదట సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడిన వీరిద్దరూ తర్వాత సినిమా సెట్లో కలుసుకుని స్నేహాన్ని కొనసాగించారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.

ఈ విషయంపై ఫర్మాన్ మాట్లాడుతూ, “మేము ఆరు నెలలుగా డేటింగ్‌లో ఉన్నాం. కానీ ఆ ఆరు నెలలు మాకు అరవై ఏళ్ల ప్రేమలా అనిపించింది. అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం” అని చెప్పాడు.ఈ ప్రేమకథలో ప్రత్యేకత ఏమిటంటే ముందుగా ప్రపోజ్ చేసింది మోనాలిసానే. “నేను ప్రపోజ్ చేసినప్పుడు ఫర్మాన్ మొదట అంగీకరించలేదు. కానీ నా ప్రేమతో అతడిని ఒప్పించాను” అని ఆమె నవ్వుతూ తెలిపింది.

కుటుంబ విభేదాలు.. పోలీసుల సహాయం

మోనాలిసా తన తండ్రి జైసింగ్ భోంస్లే తనను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. కుటుంబ సభ్యులు తన మేనత్త కుమారుడితో పెళ్లి చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆమె తెలిపింది. దీంతో ఆమె పోలీసుల సహాయం కోరింది.కేరళ పోలీసులు, ప్రభుత్వం సహకారం అందించడంతో ఈ జంట వివాహం ప్రశాంతంగా జరిగింది. ఈ వేడుకకు కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివ‌న్ కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గోవింద‌న్ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు.

కేరళలోనే స్థిరపడాలని ఆశ

కేరళ రాష్ట్రం కులమతాలకు అతీతంగా మనుషులను ఆదరిస్తుందని మోనాలిసా పేర్కొంది. భవిష్యత్తులో దక్షిణాది సినిమాల్లో నటిస్తూ కేరళలోనే స్థిరపడాలని ఉందని తన మనసులోని కోరికను వెల్లడించింది. మహాకుంభమేళాలో సాధారణ అమ్మాయిగా గుర్తింపు పొందిన మోనాలిసా, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంతో మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Latest News