భారత్‌తో పెట్టుకుంటే అలా ఉంటుంది మరి..! ఎన్నికల్లో ముయిజ్జూ పార్టీ ఘోర పరాజయం..!

భారత్, మాల్దీవుల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ పరువును సొంత దేశ ప్రజలు తీసిపడేశారు

  • Publish Date - January 14, 2024 / 03:46 AM IST

Maldives | భారత్, మాల్దీవుల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ పరువును సొంత దేశ ప్రజలు తీసిపడేశారు. రాజధాని మాలేలో జరిగిన మేయర్‌ ఎన్నికల్లో ముయిజు పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ముయిజ్జు తన ముగ్గురు మంత్రులను తొలగించిన విషయం తెలిసిందే. మాలే మేయర్‌ ఎన్నికల్లో మాల్దీవియన్‌ డెమోక్రటిక్ పార్టీ (MDP) విజయం సాధించింది. మాలే కొత్త మేయర్‌గా MDP అభ్యర్థి ఆడమ్ అజీమ్ ఎన్నికయ్యారు. విశేషమేమిటంటే అజీమ్ కంటే ముందు ముయిజ్జు మాలే మేయర్‌గా పని చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముయిజు గత ఏడాది తన పదవికి రాజీనామా చేశారు. ఎండీపీ పార్టీకి భారత అనుకూల వ్యక్తిగా భావించే మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ సోలిహ్ నాయకత్వం వహిస్తున్నారు.


ఈ క్రమంలో మాల్దీవుల ప్రజలు ఎండీపీకే పట్టం కట్టారు. మేయర్‌గా అజీమ్ భారీ మెజార్టీతో గెలిచారు. మేయర్ ఎన్నికల్లో విజయం ఎండీపీ విజయం సాధించడంతో రాజకీయంగా అదృష్టమేనని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లోనూ ఎండీపీకి స్వల్పంగా మెజారిటీ ఉన్నది. ఇటీవల, మాల్దీవుల పార్టీ డెమోక్రాట్స్ సభ్యుడైన అలీ అజీమ్, అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జును అధికారం నుంచి తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహ్మద్ ముయిజుపై అవిశ్వాస తీర్మానం తీసుకురావాలని మాల్దీవుల అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఎండీపీని అలీ అజీమ్ డిమాండ్ చేశారు. మరో నాయకుడు కూడా మాల్దీవుల విదేశాంగ మంత్రికి సమన్లు పంపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై వ్యాఖ్యలు విషయం ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఈ క్రమంలో పార్లమెంట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. భారత్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా భారత పర్యాటకులు మాల్దీవులను బహిష్కరిస్తే.. అది మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని మరో ప్రతిపక్ష నేత అహ్మద్ మహలూఫ్ మాల్దీవుల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, దీని నుంచి కోలుకోవడం కష్టమేనన్నారు. ప్రధాని మోదీపై మాల్దీవుల నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్నది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ చాలా మంది భారతీయులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్, మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Latest News