Anjan Kumar Yadav | జూబ్లీహిల్స్ బరిలో రెబల్ గా అంజన్ కుమార్ యాదవ్?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. బుజ్జగించేందుకు సీఎం సహా నేతలు ప్రయత్నిస్తున్నారు.

Anjan Kumar Yadav

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ రెబల్ గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ను ఏఐసీసీ నవీన్ యాదవ్ కు కేటాయించింది. పార్టీ హైకమాండ్ నిర్ణయంతో టికెట్ దక్కని అంజన్ కుమార్ యాదవ్ అలక బూనారు. మొదటి నుంచి టికెట్ నాదే అని చెప్పుకొచ్చిన అంజన్ కుమార్ అధిష్టానం నిర్ణయంతో ఖంగుతిన్నారు. ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ గురువారం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కార్యక్తర్తల ఒత్తిడి మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. అయితే సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రభృతులు అంజన్ కుమార్ యాదవ్ ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించి అంజన్ కుమార్ మెత్తబడుతారా..లేక ఎన్నికల్లో రెబల్ గా పోటీకి దిగుతారా చూడాల్సి ఉంది.