Kakatiya Vishnu Idol| వెయ్యేళ్ల శిల్పం కిరీటం…కాకతీయ కళా వైభవానికి కొత్త దర్పణం!

ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి కాటారం మండలం చింతకాని గ్రామం చివరి అడవి ప్రాంతంలో వాగులో తాజాగా బయటపడిన పురాతన విష్ణు విగ్రహం శిల్పం కాకతీయుల నాటి శిల్ప కళా వైభవంపై మరోసారి ఆసక్తికర చర్చను తెరపైకి తెచ్చింది. విగ్రహంలోని విష్ణు కిరీటం కాకతీయ రాణి రుద్రమ కిరీటాన్ని పోలి ఉండటంతో కాకతీయుల అధికారిక కిరీటం డిజైన్ ప్రత్యేకంగా రూపొందించబడిందని.. అదే శైలి బ్రిటీష్ రాణి కిరీటానికి స్పూర్తి అన్న చర్చను రేకెత్తించింది.

విధాత : ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి కాటారం మండలం చింతకాని గ్రామం చివరి అడవి ప్రాంతంలో వాగులో తాజాగా బయటపడిన పురాతన విష్ణు విగ్రహం శిల్పం కాకతీయుల నాటి శిల్ప కళా వైభవంపై మరోసారి ఆసక్తికర చర్చను తెరపైకి తెచ్చింది. 12-13వ శతాబ్ధానికి చెందిన ఈ విగ్రహంలో విష్ణువు రూపాన్ని.. ఆభరణాలు, ఆయుధాలు, అలంకరణలను, దశవతారాలను అద్బుతంగా చెక్కారు. అన్నింటికి మించి విష్ణువు కిరీటం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు వేదికైంది.

వాగులో దొరికిన విష్ణువు విగ్రహంలోని కిరీటం..కాకతీయ మహారాణి రుద్రమదేవి ధరించిన కిరీటాన్ని పోలి ఉండటం చర్చనీయాంశమైంది. సినీ దర్శకుడు గుణశేఖర్ సినిమాలో రుద్రమదేవి పాత్రధారి అనుష్క ధరించిన కిరీటం..వాగులో లభ్యమైన పురాతన విష్ణువు విగ్రహంలోని కిరీటం ఒకే రకంగా ఉండటంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు కాకతీయ రాణి రుద్రమ కిరీటం రూపకల్పనను ఎక్కువ బంగారం, రత్నాలు, వజ్రాలు పొదిగే రీతిలో తయారు చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.  12-13వ శతాబ్ధంలోని కాకతీయ రాణి రుద్రమ కిరీటం తయారీ, వజ్రాల అమరిక చూస్తే కాకతీయులు తమ రాజులు, రాణుల అధికారిక కిరీటాలను ప్రత్యేక డిజైన్ తో రూపొందించారని, ఇది ఆనాటి ఆభరణాల నైపుణ్యాలకు నిదర్శనమని చెబుతున్నారు. 18వ శతాబ్ధంలోని క్వీన్ ఎలిజబెత్ కిరీటం కూడా.. రాణి రుద్రమ కిరీటం నిర్మాణ శైలిని అనుసరించి రూపొందించారని,  ఎలిజబెత్ కిరీటంలోని కోహీనూర్ వజ్రం కూడా కాకతీయుల నుంచి పొందిన వజ్రం అనే గుర్తు చేస్తూ నెటిజన్లు చేస్తున్న పోస్టులు సరికొత్త చర్చను రేపుతూ  వైరల్ గా మారాయి. కోహినూర్ అనేది పర్షియన్‌ పదం.. భాషా పరంగా కోహ్‌–ఇ–నూర్‌ అని రాయబడింది. దాని అర్థం కాంతి పర్వతం.

గోల్కొండ ప్రాంతం వజ్రాలకు ప్రసిద్ధి.  కోహినూర్ వజ్రం మొదట కాకతీయుల ఖజానాలో ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు దానిని స్వాధీనం చేసుకున్నారని చెబుతారు. రుద్రమదేవి వారసుడైన కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీస్తుశకం 1310లో ఢిల్లీ సుల్తాన్‌ పంపిన మాలిక్‌కాపుర్‌తో సంధి చేసుకుని అపారమైన సంపదతోపాటు కోహినూరు వజ్రాన్ని సమర్పించారు.

ఈ సమయంలో కోహినూర్ వజ్రం దిల్లీ సుల్తానుల ఖజానాలో చేరినట్లు భావిస్తారు. ఆ తర్వాత మొఘలు రాజుల చేతిలోకి, తర్వాత నాదీర్ షా, అక్కడి నుంచి అఫ్ఘాన్ రాజుల ఆధీనంలోకి, అటు నుంచి సిక్కు రాజవంశీయుడు రంజీత్ సింగ్ వద్దకు, అక్కడి నుంచి బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి, తదుపరి బ్రిటీష్ రాజవంశీయుల వద్దకు చేరింది. కోహినూర్ 1937లో రూపొందించిన క్వీన్ ఎలిజబెత్ కిరీటంలో అమర్చబడి ఉంది. అంతకుముందు ఇది క్వీన్ విక్టోరియా కిరీటంలో కూడా అమర్చబడింది. 1849లో పంజాబ్ ప్రాంతం బ్రిటిష్ పాలనలో కలిసిన తరువాత ఈ వజ్రం బ్రిటిష్ వారికి వెళ్లిందని చరిత్ర తెలియచేస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు, ప్రస్తుతం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు గనులలో దొరికిన కోహినూర్ వజ్రం గ్రామ పెద్ద ద్వారా గణపతిదేవ చక్రవర్తికి బహుమతిగా అందింది. అతడు కాకతీయుల ఆరాధ్య దైవమైన శ్రీభద్రకాళి, తర్వాత కాకతీదేవి విగ్రహానికి నుదుటన అలంకరించి ఆరాధన చేశారని చరిత్ర చెబుతోంది. కోహినూర్ వజ్రాన్ని తండ్రి గణపతి దేవి నుంచి రుద్రమదేవి, ఆ తర్వాత ప్రతాపరుద్రుడికి దక్కి..తదుపరి సుల్తాన్ ల వశమై చివరకు అనేక రాజవంశీయుల చేతులు మారి బ్రిటీష్ రాణి కిరీటంలోకి చేరడం గమనార్హం.

 

Latest News