విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండటంతో .. దీని ప్రభావం చమురు ధరలతో పాటు బంగారం, వెండి ధరలపై కూడా పడుతోంది. బంగారం వరుస తగ్గుదలను నమోదు చేస్తుండగా, వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. బులియన్ మార్కెట్ లో సోమవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 820 తగ్గి రూ. 1,56,220 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 750 తగ్గి రూ. 1,43,200 వద్ద నిలిచింది. కిలో వెండి ధర మాత్రం వరుసగా నాల్గవ రోజు కూడా రూ.2,90,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
అంతర్జాతీయంగా పెరుగుతున్న పసిడి ధరలు
దేశీయంగా దిగుమతి సుంకాల పెంపు, ఆంక్షల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతూ వస్తూ కొనుగోలు సైతం పడిపోయింది. అయితే అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల పరుగు సరికొత్త రికార్డుల వైపు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న స్పాట్ గోల్డ్ ధర, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ కదలికలను అనుసరించి ఔన్సుకు $4,500 నుండి $4,600 మార్కును స్థిరంగా దాటి ముందుకు వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు బలంగా విశ్వసిస్తున్నారు. రాబోయే 12 నుండి 18 నెలల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఏకంగా ఔన్సుకు $5,000 నుండి $5,500 మైలురాయిని కూడా దాటిపోవచ్చని , గ్లోబల్ బ్యాంకులు (UBS, గోల్డ్‌మన్ సాక్స్ వంటివి) జోస్యం చెప్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల కోసం నిరంతరాయంగా చేస్తున్న భారీ కొనుగోళ్ల మద్దతు కారణంగా బంగారం ధరలు గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ గనుక ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్ల కోతను ప్రారంభించిన పక్షంలో బంగారం ధరలు మరింత పైకి వెలుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత మార్కెట్లో సైతం దీర్ఘకాలంలో 24 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు రూ. 1,65,000 ల్యాండ్‌మార్క్ స్థాయిని దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొందరు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.