Site icon vidhaatha

NYC Mayor mamdani | న్యూయార్క్‌ కాబోయే మేయర్‌ మామ్దానీపై ఇండియాలో భిన్నం స్పందనలెందుకని?

NYC Mayor mamdani | 2020లో తిరువనంతపురం మేయర్‌గా 21 ఏళ్ల ఆర్య రాజేంద్రన్‌ అనే యువతి ఎన్నికైన విషయాన్ని ప్రకటిస్తూ సీపీఎం చేసిన ట్వీట్‌ను జొహ్రాన్‌ మామ్దానీ రీట్వీట్‌ చేస్తూ.. న్యూయార్క్‌కు సైతం ఆమె వంటి మేయర్‌ కావాలని పేర్కొన్నారు. ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు అనేక మంది ఇండియన్‌ నెటిజన్లు.. న్యూయార్క్‌ మేయర్‌గా గెలుపు తీరాల్లో ఉన్న డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జొహ్రాన్‌ మామ్దానీ (33) వంటి నాయకులు భారతదేశానికి కావాలని ఆశిస్తున్నారు. ‘న్యూయార్క్‌లో ఏం జరుగుతున్నదో ఇప్పుడు భారతదేశంలోనూ జరగాలని నేను కోరుకుంటున్నాను. అదెలా అవుతుందో నాకు తెలియదు. కానీ.. మా దేశానికి జొహ్రాన్‌ మామ్దానీ వంటి వ్యక్తి కావాలి’ అని ఒక మహిళా యూజర్‌ రాశారు. ఆమె పోస్ట్‌ను ప్రముఖ ఇండియన్‌ ఎక్స్‌ హ్యాడిల్‌ @DearthOfSid కోట్‌ చేస్తూ.. ఇండియాకు మామ్దానీ వంటివారు కావాలంటే భారతదేశంలో ఆయన మద్దతు పలికే పార్టీకి ఓటు వేయండి.. అని పేర్కొంది. భారతదేశ ప్రధాని నరేంద్రమోదీని గుజరాత్‌ మత ఘర్షణకు కారణమైన యుద్ధ నేరగాడు అని మామ్దానీ అభివర్ణించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూ న్యూయార్క్‌ వస్తే అరెస్టు చేస్తానని కూడా హెచ్చరించారు. తనను గెలిపిస్తే ఇంటి అద్దెలు తగ్గిస్తానని, వేతనాలు పెంచుతానని, ధనవంతులపై అధిక పన్నులు విధిస్తానని ఎన్నికల ప్రచారంలో మామ్దానీ చెబుతూ వచ్చారు. ఇతడు వందశాతం కమ్యూనిస్టు పిచ్చోడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.

‘భారతదేశపు మామ్దానీ ఎక్కడ? ప్రగతిశీల వ్యక్తి. బహుజన అనుకూలుడు. రిజర్వేషన్లను సమర్థించేవాడు. కుల గణన కోరుకునేవాడు. పాలస్తీనాకు సంఘీభావం తెలిపేవాడు. గొంతెత్తేవాడు. అందరినీ కలుపుకొనిపోయేవాడు. డెమోక్రటిక్‌ సోషలిస్ట్‌. మనందరిలోనే ఉన్నాడు. కానీ.. అతడిని మనం గుర్తించకుండా మితవాద శక్తులు మన మెదళ్లను కలుషితం చేసేశాయి. ఈ అన్ని అంశాలపై రాహుల్‌ గాంధీ అనేక సంవత్సరాలుగా దృఢ నిశ్చయంతో, సాహసంతో చాలా గట్టిగా, స్పష్టంగా మాట్లాడుతున్నారు’ అని రచయిత్రి, ఇన్‌ఫ్లూయెన్సర్‌ గుర్మెహర్‌ కౌర్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. విచిత్రం ఏమిటంటే.. ఇదే మామ్దానీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వి ట్వీట్‌ చేశారు. ఆయన నోరు తెరిస్తే పాకిస్తాన్‌ పీఆర్‌ టీమ్‌ ఆ రోజుకు సెలవు తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు.

అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థలంలో రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా 2020లో టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద జరిపిన ప్రదర్శనలో మామ్దానీ పాల్గొన్న వీడియోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు. ఆ వీడియోలో వెనుక భాగాన ‘ఆజాద్‌ జమ్ము కశ్మీర్‌’ అని పతాకాలు కనిపిస్తాయి. బీజేపీ ఎంపీ, సినీ నటి కంగన రనౌత్‌.. ‘అతని తల్లి ప్రఖ్యాత దర్శకురాలు మీరా నాయర్‌, తండ్రి గుజరాతీ మూలాలు ఉన్న ప్రముఖ రచయిత మెహమూద్‌ మామ్దానీ. కొడుకుపేరు జొహ్రాన్‌ అని స్పష్టంగానే ఉన్నది. ఆయన భారతీయుడిగా కంటే పాకిస్తానీగా ఎక్కువ మాట్లాడుతున్నాడు. అతని హిందూ గుర్తింపు, రక్త సంబంధానికి ఏమి జరిగినా.. ఇప్పుడు మాత్రం అతను హిందూయిజాన్ని తుడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. వావ్‌’ అని స్పందించారు.

మే 15న నిర్వహించిన ఒక కార్యక్రమంలో మామ్దానీ, ఇతర మేయరల్‌ అభ్యర్థులను ‘మోదీ న్యూయార్క్‌ నగరానికి వస్తే ఆయనతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొంటారా?’ అని ప్రశ్నించగా.. అందరూ తిరస్కరించడం విశేషం. ‘నా తండ్రి, ఆయన కుటుంబం గుజరాత్‌కు చెందినవారు. ఆయనది ముస్లిం కుటుంబం. నేను ముస్లిం. గుజరాత్‌లో ముస్లింల ఊచకోతకు ఆయన సహకరించాడు. మనం నమ్మలేం కానీ.. ఆ ఊచకోత ఏ స్థాయిలో ఉందంటే.. గుజరాత్‌లో ఇక ముస్లిం లేరా? అనిపించేంతలా. ఈ విషయాన్ని కొందమందికి నేను చెబితే.. వారు దిగ్భ్రాంతికి గురయ్యారు’ అని మామ్దానీ చెప్పారు. ఆ సమయంలోనే మోదీని యుద్ధ నేరస్థుడిగా అభివర్ణించారు. 2020 నుంచి ఎలాంటి విచారణ లేకుండా జైల్లో మగ్గిన సామాజిక కార్యకర్త ఉమర్‌ ఖలీద్‌కు మద్దతుగా 2023లో ఒక వేదిక పై నుంచి బహిరంగ లేఖను చదివారు. తన చర్యలకు మామ్దానీ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దాడులను ఎదుర్కొన్నారు. అతడు జిహాదీ అంటూ ప్రత్యర్థులు విరుచుకుపడ్డారు. రాబోయే 9/11 (అమెరికాపై జరిగిన భయానక సెప్టెంబర్‌ 11 దాడులు) దాడులకు ఆయనే కారణమవుతాడని దుమ్మెత్తారు. విచిత్రం ఏమిటంటే.. మామ్దానీపై ఇలాంటి ఆరోపణలు, దాడులు చేసిన అన్ని సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ భాగం భారతీయుల పేర్లతో ఉన్నవే. ఆప్‌ కార్యకర్త అక్షయ్‌ మరాఠీ.. ‘జొహ్రాన్‌ మామ్దానీ భారతీయ సంతతికి చెందినవాడు. అయినప్పటికీ.. తీవ్ర ఇస్లాం వ్యతిరేకతతో న్యూయార్క్‌లోని హిందూ గ్రూపులు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఇప్పుడు ఆయన మేయర్ కాబోతున్నారు. ఈ గ్రూపులు సిటీ హాల్‌ (న్యూయార్క్‌ మేయర్‌ ఆఫీస్‌)లో తమ స్నేహితుడిని కలిగి ఉండే అవకాశాన్ని కోల్పోయాయి. భారతదేశంలో విదేశాలలో హిందువుల మతతత్వం వారి పతనానికి దారితీయబోతోంది.” అని పేర్కొన్నారు.

Exit mobile version