Rishi Sunak | బ్రిటన్‌లో ముందస్తు ఎన్నికలు.. ప్రకటించిన ప్రధాని రిషి సునాక్‌

ఈ ఏడాది జూలై 4న దేశ పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నట్టు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ బుధవారం ప్రకటించారు.

  • Publish Date - May 23, 2024 / 08:23 PM IST

జూలై 4న పోలింగ్‌ నిర్వహణ
సాహసమేనంటున్న విశ్లేషకులు

లండన్‌: ఈ ఏడాది జూలై 4న దేశ పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నట్టు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ బుధవారం ప్రకటించారు. అయితే.. ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి అనుకూలత ఉన్నట్టు ఓపీనియన్‌ పోల్స్‌లో వెల్లడైన నేపథ్యంలో రిషి నిర్ణయం సాహసోపేతమైనదేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బుధవారం తన డౌనింగ్‌ స్ట్రీట్‌ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడిన రిషి సునాక్‌.. ఆ అనూహ్య ప్రకటన చేస్తూ.. ఇప్పుడు బ్రిటన్‌ తన భవిష్యత్తును నిర్ణయించుకునే సమయం వచ్చిందని చెప్పారు.

ఇప్పటి వరకూ సాధించిన ప్రగతిపై దేశాన్ని నిర్మించుకోవాలా? లేక మళ్లీ అనిశ్చిత ప్రమాదంలోకి వెళ్లిపోవాలా అనేది బ్రిటన్‌ తేల్చుకోవాలన్నారు. ‘రాబోయే కొన్ని వారాలపాటు నేను ప్రతి ఓటు కోసం పోరాడుతాను. మీ విశ్వాసాన్ని పొందుతాను. మీరు కష్టపడి సంపాదించుకున్న ఆర్థిక సుస్థిరతను ప్రమాదంలో పడకుండా నా నాయకత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీ మాత్రమే కాపాడుతుందని నేను రుజువు చేస్తాను. లేబర్‌ పార్టీ నాయకుడు కెయిర్‌ స్టార్మర్‌పై విమర్శలు గుప్పించిన రిషి.. ఆయన ప్రతిసారీ సులభమైన మార్గాలు సూచిస్తారని, వాటికి ఎలాంటి ప్రణాళిక ఉండదాని అన్నారు. ఫలితంగా వారితో భవిష్యత్తు అస్థిరత్వంతో ఉంటుందని చెప్పారు.

అయితే.. కన్జర్వేటివ్‌ పార్టీ ప్రస్తతం కష్టకాలంలో ఉందని, ఒపీనియన్‌ పోల్స్‌లో లేబర్‌ పార్టీకంటే 20 పాయింట్లు వెనుకబడి ఉన్నదని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లటం సాహసమేనని వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికలు అక్టోబర్‌ లేదా నవంబర్‌ నెలల్లో జరుగాల్సి ఉన్నది. అయితే.. రిషి ప్రకటన చేసేంత వరకూ ఆ విషయం ఆయన మంత్రివర్గానికి కూడా తెలియదని చెబుతున్నారు.

Latest News