బ్రిటన్‌ ప్రధానుల ఫోన్లు హ్యాక్‌ అయ్యాయా? సంచలనం రేపుతున్న టెలిగ్రాఫ్‌ కథనం

ప్రభుత్వం కొంతమంది వ్యక్తులు, సంస్థలపై నిఘా పెడుతుంటుంది. అందుకోసం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటుంది. ఆ ప్రత్యేక వ్యవస్థలే హ్యాక్‌ అయితే? ఇప్పడు వస్తున్న వార్తలను బట్టి.. బ్రిటన్‌ రాజకీయ వ్యవస్థపై అతిపెద్ద సైబర్‌ ఎటాక్‌ జరిగింది. కీలక అధికారుల ఫోన్లలో సమస్త సమాచారాన్ని చైనా హ్యాకర్లు దొంగిలించారన్న వార్త.. సంచలనం రేపుతున్నది.

ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అని ఒక నానుడి! ఇప్పుడు బ్రిటన్‌ విషయంలో సరిగ్గి సరిపోయినట్టుంది. తాను నిఘా పెట్టేందుకు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థనే హ్యాక్‌ చేసిన ఆగంతకులు.. ఏకంగా బ్రిటన్‌ కీలక రాజకీయ వ్యవస్థలోకే చొరబడినట్టు ఒక సంచలన కథనాన్ని ది టెలిగ్రాఫ్‌ ప్రచురించింది. బ్రిటన్‌కు చెందిన కీలక అధికారుల మొబైల్ ఫోన్లను చైనా హ్యాక్‌ చేసిందన్నది ఆ వార్త సారాంశం. బ్రిటన్ ప్రధాన మంత్రి, కీలక అధికారులు ఉండే డౌనింగ్‌ స్ట్రీట్‌ గుండెల్లోకే చైనా హ్యాకింగ్‌ అస్త్రం దిగబడిందన్న వార్త బ్రిటన్‌ రాజకీయ వ్యవస్థను కుదిపివేసే భారీ భద్రతా వైఫల్యాన్ని బయటపెట్టింది. బోరిస్‌ జాన్సన్‌ మొదలుకుని, లిజ్‌ ట్రస్‌, తదుపరి రిషి సునాక్‌ ప్రభుత్వాల్లో పనిచేసిన కీలక వ్యక్తులు ఈ హ్యాకింగ్‌కు గురైనట్టు తెలుస్తున్నది. 2021 నుంచి 2024 మధ్యకాలంలో ఈ దాడులు జరిగినట్టు ది టెలిగ్రాఫ్‌ వెల్లడించింది. ప్రధానుల ఫోన్లు హ్యాక్‌ అయ్యాయా? లేదా అన్నది కచ్చితంగా తెలియకున్నా.. సీనియర్‌ అధికారులు మాత్రం ‘ఈ చొరబాటు నేరుగా డౌనింగ్‌ స్ట్రీట్‌ గుండెల్లోకి చొచ్చుకుపోయింది’ అని వ్యాఖ్యానిస్తున్నారు. హ్యాక్‌ చేసిన ఫోన్లలో సాగిన సంభాషణలు, ఫోన్‌కు వచ్చిన సందేశాలు, ఫోన్‌ నుంచి వెళ్లిన ఎస్‌ఎంఎస్‌లు మొదలుకుని.. ఫోన్‌ మెటాడాటా.. అంటే ఎవరు ఎవరితో మాట్లాడారు? ఎంత సేపు మాట్లాడారు? అనే వివరాలు కూడా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఇది కేవలం డాటా చౌర్యం కాదని, రాజకీయ నిర్ణయాలపై గూఢచర్య చేసేస్థాయి దాడి అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత చోటుచేసుకున్న అతిపెద్ద గూఢచర్య విపత్తుగా చెబుతున్నారు.

మరో విస్మయం కలిగించే విషయం ఏమిటంటే.. ఈ దాడికి ఉపయోగపడిన దొడ్డిదారులన్నీ పశ్చిమదేశాలు నిర్మించినవేనట. అంటే.. చైనా హ్యాకర్లు చొరబడేందుకు వాడుకున్న మార్గాలు వారు తయారు చేసుకున్నవి లేదా వారు సృష్టించినవి కావు. లాఫుల్‌ ఇంటర్‌సెప్ట్‌ సిస్టమ్స్‌ (Lawful Intercept Systems) అని ఉంటాయి. అంటే.. నేరస్తులను పట్టుకోవడానికి ఫోన్‌లను ట్యాప్‌ చేసే నెపంతో టెలికం కంపెనీలు వాటి నెట్‌వర్క్‌లలో ప్రభుత్వాల కోసం ప్రత్యేక బ్యాక్‌డోర్లు ఏర్పాటు చేస్తుంటాయి. ఇప్పుడు అవే బ్యాక్‌డోర్ల గుండా చైనా హ్యాకర్లు ప్రవేశించినట్టు తెలుస్తున్నది. అంటే.. నిఘా వ్యవస్థే నిఘాకు గురైందన్నమాట.

డౌనింగ్‌ స్ట్రీట్‌లోని కీలక అధికారుల ఫోన్ల నుంచి ఏ సమాచారం వెళ్లిందనేది ఇప్పటి వరకూ కచ్చితంగా తెలియదు. అయితే.. ఇది గూఢచర్య చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆపరేషన్లలో ఒకటిగా అమెరికా జాతీయ భద్రత ఉప సలహాదారు ఆన్‌ న్యూబర్గర్‌ ది టెలిగ్రాఫ్‌కు చెప్పారు. హ్యాకర్లు అవసరం అనుకుంటే కాల్స్‌ రికార్డ్‌ చేసే స్థాయిలో ఉన్నారని ఆయన అన్నారు.

ఈ హ్యాకింగ్‌ విషయంలో Salt Typhoon అనే చైనా హ్యాకింగ్‌ గ్రూప్‌ పేరు వినిపిస్తున్నది. ఇది యూరప్‌తోపాటు మధ్య ఆసియా, ఆఫ్రికా ఖండాల వరకూ విస్తరించింది. 2022– 2024 మధ్యకాలంలో అంటే.. రిషి సునాక్‌ ప్రధానిగా ఉన్న సమయంలో డౌనింగ్‌ స్ట్రీట్‌లోని కీలక అధికారులు, వ్యక్తుల ఫోన్లు అనేకమార్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని టెలిగ్రాఫ్‌ తన కథనంలో పేర్కొన్నది. ఈ ఘటనపై నాటి టెక్నాలజీ మంత్రి పీటర్‌ కైల్‌ స్పందిస్తూ.. దేశానికి ఇంత తీవ్రమైన సైబర్‌ భద్రత సమస్య ఉందని మంత్రి అయ్యాకే తనకు అర్థమైందని అన్నారు.

అయితే చైనా మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపారేసింది. ఇవన్నీ ఆధార రహితాలని పేర్కొంది. సైబర్‌ సెక్యూరిటీ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆక్షేపించింది. ‘సైబర్‌ దాడులకు మేం వ్యతిరేకం. నిజానికి మేమే పెద్ద బాధితులం. ఎలాంటి హ్యాకింగ్‌ను చైనా ప్రోత్సహించదు.. అని చైనా ఎంబసీ ప్రతినిధి చెప్పారు. బ్రిటన్‌ ప్రభుత్వం ఈ అంశంపై అధికారికంగా స్పందించేందుకు నిరాకరించింది.

Latest News