Medaram Jatara Begins | మేడారం సంరంభం.. 28 నుంచి వనదేవతల జనజాతర

ఓ నాలుగు రోజులు అడవి తన్మయత్వంతో ఊగిపోనుంది. వనదేవతలైన మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 31వ తేదీన తల్లుల వన ప్రవేశంతో ముగియనున్నది. ఈ జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా.

Sammakka Saralamma Jatara

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Medaram Jatara Begins | దట్టమైన అడవిలోని ఓ కుగ్రామమైన మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర సంరంభం కోసం సర్వసన్నద్ధమైంది. వనదేవతలు కొలువై ఉండే మేడారం ఇప్పటికే జనజాతరగా మారింది. నేటి నుంచి (28వ తేదీ) 31వ తేదీ వరకు కోట్లాది మంది రాకతో జనారణ్యంగా రూపుదిద్దుకుని వెలుగొందనున్నది. ప్రపంచంలోనే ఈ మేడారం సమ్మక్క, సారలమ్మ ఆదివాసీ మహాజాతర ప్రఖ్యాతిగాంచింది. రేపటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కాబోతోంది. ఈ జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి గిరిజనులు, గిరిజనేతరులు తరలిరానున్నారు. ఇప్పటికే గత నెలరోజులుగా మేడారం జాతర జనంతో కిటకిటలాడుతుండగా వనదేవతలు మేడారంలోని గద్దెలపై కొలువుదీరనున్న ఆ నాలుగు రోజులు జనం పులకించిపోతారు.

ఇప్పటికే మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. ఈ మహా జాతరకు 2 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా మూడు కోట్ల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. నెలరోజుల ముందు నుంచే నిత్యం గద్దెల వద్ద మొక్కులు చెల్లిస్తున్నారు. ఇప్పటికే 30 లక్షల మందికి పైగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్లు సమాచారం. 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహాజాతరకు అన్ని అంశాలకు ప్రాధాన్యమిచ్చి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భద్రత, రవాణా, వసతి సౌకర్యాలు, వైద్యం తదితర వాటితో ప్రాథమిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ములుగు జిల్లా యంత్రాంగమే మేడారంలో తిష్టవేసి సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు, ప్రభుత్వ,ఆర్టీసీ బస్సుల్లో నిత్యంలక్షలాది మంది తరలివెళుతున్నారు. దారులన్నీ మేడారం వైపుగా సాగిపోతున్నాయి.

28న సారలమ్మ, 29న సమ్మక్క రాక

ఈ నెల 28న సారలమ్మ, 29న సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటారు. జనవరి 30న భక్తులు మొక్కులు చెల్లించగా.. జనవరి 31న దేవతలు వనప్రవేశంతో జాతర ముగియనున్నది. జాతరకు ముందే భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో మేడారం వెళ్లే దారులన్నీ రద్దీగా మారాయి. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి నుంచి గోవిందరాజులను, కన్నెపల్లి నుంచి సారలమ్మను, చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొస్తారు. మేడారం వెళ్లే భక్తులు ములుగు పట్టణ ప్రారంభంలో ఉన్న గట్టమ్మ తల్లిని దర్శించుకుని మేడారానికి వెళ్ళడం ఆచారంగా వస్తోంది.

ప్రాంగణ పునరుద్ధరణతో జాతరకు హైప్

మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 251 కోట్ల వ్యయంతో చేపట్టిన మేడారం పునరుద్ధరణ పనులు, రాష్ట్ర కేబినెట్ సమావేశం తదితర వాటితో ఈ సారి జాతరకు జనం పెరుగుతారని అంచనా వేస్తున్నారు. మూడు కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. గద్దెల ప్రాంగణంలో చేపట్టిన రాతి కట్టడాలు, గద్దెల పునరుద్ధరణ, రోడ్ల వెడల్పుతో మేడారం కొత్త శోభను సంతరించుకున్నది. ప్రాంగణంలో ఆదివాసీ సంస్కృతికి ప్రతీకగా చుట్టూ రాతి ప్రాకారం, ఎత్తైన తోరణాలు, రాతి స్థంబాలు, వాటిపై కోయల సంస్కృతీ, సంప్రదాయాలు, వారసత్వం, జీవనవిధానాం, చరిత్రకు సంబంధించిన మూలాలు, అంశాలకు సంబంధించి చిత్రాలను చిత్రీకరించారు. ఆదివాసీ సాంస్కృతిక పునర్జీవనంగా ఈ పునరుద్ధరణను అభివర్ణిస్తున్నారు. ఈ సారి జాతరకు ఇవన్నీ ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి. మేడారంలోని ముఖ్యమైన సెంటర్లలో ఆదివాసీ జీవనానికి సంబంధించిన భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడంతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ సారి సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి సీతక్కల నేతృత్వంలో మేడారంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టడంతో జాతరకు వచ్చే భక్తులకు వసతి మరింత పెరిగింది. అయితే మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్రాథమికమైన నీరు, మంచినీరు, మరుగుదొడ్ల వసతి తప్ప మిగిలిన వాటిని పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఈ జాతర సందర్భంగా కోట్లాది రూపాయల టర్నోవర్ జరుగుతోందని, దాదాపు వెయ్యి కోట్ల టర్నోవర్ ఉంటోందని అంచనా వేస్తున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్సీ రామనాథ్ కేకేన్ల ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది నిరంతరం అక్కడే ఉండి పనిచేస్తున్నారు.

జాతర సందర్భంగా భారీ ఏర్పాట్లు

మేడారం జాతర విజయవంతంలో పోలీసుల పాత్ర గణనీయమైంది. వీరితో పాటు వివిధ విభాగాలకు చెందిన 40వేల మంది ఉద్యోగులు, సిబ్బంది జాతర విధుల్లో నిమగ్నమై ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో 13 వేల మంది సిబ్బంది పని చేయనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి రవాణా, వనదేవతలు కొలువైన గద్దెల ప్రాంగణం,క్యూ లైన్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ముఖ్యమైన ప్రాంతాల్లో భక్తుల రద్దీ నియంత్రణ కత్తిమీద సాములాంటింది. ఎప్పటికప్పుడు అప్రమత్తత, సమన్వయంతో ఈ పని నిర్వహించాల్సి ఉంటోంది. ఈ సారి జాతరలో ఆధునిక, సాంకేతికతను వినియోగిస్తున్నారు. రద్దీ, ట్రాఫిక్ సమస్యలను గుర్తించేలా అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీని కోసం 20 డ్రోన్ కెమెరాలు, 450 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంతో అనుసంధానించి 24 గంటలు నిఘా కొనసాగిస్తున్నారు. గతంతో పోల్చితే ఈ సారి ఒకేసారి పదివేల మంది దర్శించుకునే విధంగా క్యూ లైన్ల నిర్మాణం చేపట్టారు. సమ్మక్క-, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు అన్నీ ఒకే వరుసలోకి పునర్నిర్మాణం చేయడం దర్శనానికి సులభంగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు వాహనాలకు ఊరట్టం గ్రామం వద్ద 33 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. గద్దెలకు సమీపంలోనే ఆర్టీసీ బస్టాండ్, వీఐపీ వావానాలకు పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. జాతర తేదీల్లో 3 లక్షల వాహనాలొచ్చినా నిలిపేందుకు సుమారుగా 2 వేల ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. 4వేల ఆర్టీసీ బస్సులను జాతర కోసం వినియోగిస్తున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగనున్నది. . మొబైల్ సిగ్నల్ కోసం బీఎస్ఎన్ఎల్ 33 తాత్కాలిక టవర్లను ఏర్పాటు చేసింది. జాతరకు వచ్చే రోడ్లను వెడల్పు చేసి సౌకర్యవంతంగా మార్చారు. ప్రధానంగా తాడ్వాయి, పస్రా, బయ్యక్కపేట మార్గాల్లో ఇరుకు రోడ్లను విస్తరించారు. మేడారంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించారు. జంపన్న వాగు వద్ద ఏర్పాట్లను ఆధునికీకరించారు. మేడారంలోని రెండు 33/11 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్ సామర్ధాన్ని పెంచారు. నార్లాపూర్‌ వద్ద మరో 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మించారు. విద్యుత్త్ కోసం 259 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. జంపన్నవాగుపై నుంచి వెళ్లే లైన్ల కోసం ఎత్తయిన టవర్లను కూడా నిర్మించారు. వైద్యం కోసం పలు చోట్ల తాత్కాలిక హాస్పిటల్లు ఏర్పాటు చేశారు. మేడారం జాతర కోసం మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వీరికి తోడు 2 వేల మంది ఆదివాసీ వలంటీర్లు విధుల్లో ఉంటారు. 1418 ఎకరాల్లో 42 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు.10,441 మంది ఆర్టీసీ సిబ్బంది విధుల్లో ఉంటారు. 5,482 తాగు నీటి పాయింట్లు ఉంటాయి.
జంపన్న వాగు వద్ద 119 డ్రెసింగ్ రూమ్స్ ఏర్పాటు 5,700 టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. 5,000 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉంటారు. 196 ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయగా కొత్తగా 911 స్తంబాలు ఏర్పాటు చేశారు. 5,192 మెడికల్ సిబ్బంది విధుల్లో ఉంటారు. సకల సౌకర్యాలతో మేడారంలో అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు.

జిల్లాల నుంచి వచ్చేవారికి రూట్ మ్యాప్

– ఖమ్మం, నల్లొండ, హైదరాబాద్, మెదక్, వరంగల్ ప్రాంతాల వారంతా ములుగు, పస్రా మీదుగా రావాలి.
– ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల వాసులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, తాడ్వాయి మండలం కాల్వపల్లి మీదుగా మేడారం సమీప ఊరట్టం స్థూపం వద్దకు చేరుకోవాలి.
– మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ సహా భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చే వారు ఏటూరునాగారం వైపు నుంచి కొండాయి మీదుగా వెళ్లాలి.
– తిరుగు ప్రయాణంలో వరంగల్ వైపు వెళ్లే వాహనాలు ములుగు మీదుగా కాకుండా బయ్యక్కపేట మీదుగా భూపాలపల్లి వైపు నుంచి మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
– ట్రాఫిక్ రద్దీని బట్టి ఒన్ వే ను సైతం అమలు చేయనున్నారు.

భక్తకోటికి మంత్రి సీతక్క శుభాకాంక్షలు

మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తరలివచ్చే కోట్లాది భక్తులందరికీ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ మహాజాతర ప్రతి భక్తుడి హృదయంలో భక్తి భావాన్ని నింపాలని, జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి శాంతి, సౌభాగ్యం, సంతోషం కలగాలని ఆమె ఆకాంక్షించారు. సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనంతో ప్రజలందరికీ ఆయురారోగ్యం, సుఖసంతోషాలు, సమృద్ధిగా ప్రసాదించాలని ప్రార్థించారు. భక్తుల సౌకర్యం, భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తెలిపారు. రవాణా, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతులు సమకూర్చామని పేర్కొన్నారు. భక్తులందరూ సురక్షితంగా దర్శనం చేసుకుని ప్రశాంతంగా తిరిగి వెళ్లాలని ఆమె కోరారు. సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరికీ శుభం కలగాలని మంత్రి సీతక్క తన ప్రకటనలో పేర్కొన్నారు.

Latest News