Digital Media Policy | ఒకటి రెండు నెలల్లో తెలంగాణ డిజిటల్ మీడియా పాలసీని తీసుకురానున్నట్లు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. డిజిటల్ మీడియా విధివిధానాలకు తుది రూపం ఇచ్చామని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులకు రక్షణ కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేయదని ఆయన అన్నారు.
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై శాసన మండలిలో మంగళవారం నాడు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అక్రెడిటేషన్ కార్డుల జారీ విషయములో కొంత మంది లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికి అక్రెడిటేషన్ కార్డులు జారీచేస్తామని అన్నారు. తాము ఎలాంటి బేషజాలాలకు పోకుండా మొదట విడుదల చేసిన జీఓ పై జర్నలిస్టుల సంఘాల అభిప్రాయాలను, సూచనలను తీసుకొని మార్పులు చేశామన్నారు.
డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డు జర్నలిస్టులనే తేడా మా ప్రభుత్వానికి లేదన్నారు. మళ్లీ ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా మరో సర్క్యూలర్ ఇస్తామన్నారు. ఇండ్ల స్థలాల విషయములో కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
