విధాత, హైదరాబాద్:
Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి తో ఉన్న తాటిపర్తి జీవన్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా? అంటే… అవుననే విధంగా పరిస్థితులు కన్పిస్తున్నాయి. ముక్కుసూటితనం, ప్రజలతో నిత్యం కలుపుగోలుతనంతో ఉండే ఆయన జాతీయ పార్టీలో చేరాలని ఆలోచనలో ఉన్నట్లు ఆయన సహచరులు చెబుతున్నారు. ఆయన కోసం బీఆర్ఎస్ నాయకత్వం కూడా చర్చలు జరుపుతున్నదని సమాచారం. శ్రీరామ నవమి లోపు ఆయన తన నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
కొద్దిరోజులుగా జీవన్‌రెడ్డి గుస్సా
నాలుగు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసి, కార్యకర్తలకు సేవ చేసిన తనకే కనీస గౌరవం లేదని జీవన్ రెడ్డి కొద్ది రోజులుగా ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. తను పార్టీ మారడం వెనకాల జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కారణమని ఆయన పలుమార్లు మీడియా ముందు స్పష్టం చేశారు. గౌరవాన్ని చంపుకొని రాజకీయాలు చేయలేనని, ప్రజా జీవితంలో గౌరవం ముఖ్యమని చెబుతూ వచ్చారు. గౌరవమే లేనప్పుడు పార్టీలో కొనసాగగలమా? అని ఎదురు ప్రశ్నలు కూడా వేశారు.
అదేమీ లేదంటున్న దుద్దిళ్ల
జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశంపై మంత్రి డీ శ్రీధర్‌బాబు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో స్పందించారు. పార్టీలో జీవన్‌రెడ్డిక ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చని, కానీ.. ఆయన వేరే పార్టీలోకి వెళ్తారని అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. పదవులు కావాలని ఆయన ఎన్నడూ కోరలేదనని, నియోజకవర్గంలోనే సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ చర్చ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే వార్తలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఉగాది తర్వాత నిర్ణయం.. నవమి లోపు ఆచరణ!
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది తరువాత తన నిర్ణయాన్ని ప్రకటించనున్న జీవన్‌రెడ్డి.. శ్రీరామ నవమిలోపు తాను చేరాలనుకుంటున్న పార్టీ గూటికి చేరుతారని తెలుస్తున్నది. భారీ బహిరంగ సభ నిర్వహించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష వైఖరిని తూర్పారబట్టి పార్టీని వీడనున్నట్లు జీవన్‌రెడ్డి అనుచరులు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించినట్లు గాంధీ భవన్ వర్గాల కథనం. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ జీవన్‌రెడ్డిని బుజ్జగించినట్లు వార్తలొస్తున్నాయి. ఏది ఏమైనా ఆయన పార్టీ మారడం ఖాయంగా ఉందనే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి.
అటు బీజేపీ, ఇటు బీఆరెస్ యత్నాలు
మరోవైపు జీవన్‌రెడ్డిని బీజేపీలోకి రప్పించేందుకు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు కమలం వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఆయన బీజేపీలో చేరితే అది.. కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బతీసినట్లు అవుతుందని, బీఆర్ఎస్ పార్టీకి కూడా ఊహించని విధంగా షాక్ ఇచ్చినట్లు అవుతుందని వివరించినట్లు సమాచారం. ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో జీవన్ రెడ్డి టచ్ లోకి వెళ్లారనే వార్త కూడా రాజకీయ వర్గాల చర్చల్లో నలుగుతున్నది. ఏది ఏమైనా రానున్న ఐదారురోజుల్లో జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది.
