జీవన్ రెడ్డి పార్టీ మార్పు వరమా? శాపమా? రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ
కాంగ్రెస్‌లో దశాబ్దాలపాటు ఉండి.. బీఆరెస్ తీర్థం పుచ్చుకుంటున్న జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది? స్వేచ్ఛాయుత కాంగ్రెస్‌లో ఇన్నాళ్లూ ఉన్న రేవంత్ రెడ్డి.. కుటుంబ ఆధిపత్యంలో నడిచే ప్రాంతీయ పార్టీ బీఆరెస్‌లో మనుగడ సాగించగలరా? ప్రత్యేకించి అనేక మంది వేరే పార్టీల నుంచి బీఆరెస్‌లో చేరి.. మనుగడ సాగించలేని పరిస్థితుల్లో మళ్లీ ఆ పార్టీ నుంచి బయపటడిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వాటికి భిన్నంగా జీవన్ రెడ్డి భవిష్యత్తు ఉంటుందా? లేక మళ్లీ సీన్ రిపీట్ అవుతుందా?
- గత్యంతరం లేక కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్ బై
- సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా తీవ్ర విమర్శలు
- అనుభవం, చతురతతో బీఆర్ఎస్ వైపు మొగ్గు
- ప్రస్తుతం జీవన్ రెడ్డి కోరుకున్నదే జరుగుతోందా?
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకోవడం రాష్ట్ర రాజకీయ చిత్రపటంపై ప్రత్యేక చర్చ సాగుతోంది. జీవన్ రెడ్డిపై నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే బాగానే ‘సానుభూతి’ వ్యక్తమైంది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంచెం స్వరం మారుతోంది. జీవన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు బీఆర్ఎస్‌ను వేదికగా ఎంచుకోడమే కాకుండా సీఎం రేవంత్‌పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టడంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. పీసీసీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా జీవన్ రెడ్డికి పొలిటికల్ కౌంటర్ ప్రారంభించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి అనేక ప్రశ్నలు వేస్తూ, అందులో కొంత వెటకారం, విమర్శలు జొప్పిస్తూ తన రక్షణ చర్యలు ప్రారంభించింది. రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటోందని అంచనా వేస్తున్నారు.
బీఆర్ఎస్‌లో తన చేరికకు జీవన్ రెడ్డి ఈ నెల 20వ తేదీ ముహుర్తంగా నిర్ణయించుకుని రాజకీయ హంగామా చేసేందుకు భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు. ఈ చేరికను అందివచ్చిన అవకాశంగా భావించి బీఆర్ఎస్ కూడా సర్వశక్తులొడ్డుతోంది. ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో జగిత్యాల కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. నిన్నటి వరకు అలకలు, బుజ్జగింపులు, ఆహ్వానాలతో సాగిన జగిత్యాల రాజకీయం రానున్న రోజుల్లో విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రంలో కొంత వేడిని, రాజకీయ నిప్పును రాజేసే అవకాశం ఉందంటున్నారు.
జగిత్యాల రాజకీయం జగడం
జీవన్ రెడ్డి పార్టీ మార్పు పై పాజిటివ్, నెగెటివ్‌లతో పాటు అనేక విషయాలు చర్చల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేరాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్‌కు రాష్ట్రంలో కొంత ఊతమిచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీకి ఒకింత నష్టాన్ని చేకూరుస్తుందనడంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల పాటు కొనసాగిన ఆయన రాజీనామా చేయడానికి ముందు వరకు ఆ పార్టీని పెద్దగా విమర్శించకుండా, తన సమస్యను ఎవరూ పరిష్కరించలేరని మాట్లాడుతూ వచ్చారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం ఒక ఎత్తైతే, రాజీనామా చేసిన మరుక్షణం సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం గమనార్హం. ఇంతకాలం కక్కలేక, మింగలేక కడుపులో దాచుకున్న ఆగ్రహం, ఆయన ఆశలు, అక్రోశం, ఆయన ఆశించిన అంశాలు ఒక్కసారిగా బయటికి వెళ్లగక్కుతున్నారని పరిశీలకులు అంటున్నారు.
జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం సీఎం రేవంత్ రెడ్డికి కొద్ది రోజులు కంటిలో నలుసుగా మారే అవకాశం ఉందనే వాదనలూ ఉన్నాయి. అయితే ఈ మూడేళ్ళలో రేవంత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. కనుక జీవన్ రెడ్డి విమర్శలు, ఆయన భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి ఉపయోగపడొచ్చేమోగానీ, కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ప్రకంపనాలు పుట్టించే అవకాశం లేదని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌లోని రేవంత్ వ్యతిరేకులకు ఒక చాన్స్ లభించినప్పటికీ.. పూర్తిగా జీవన్ రెడ్డికి వంతపాడే పరిస్థితులు కూడా ఇప్పుడు లేవని చెబుతున్నారు.
కలిసిపనిచేయమని దేవుడే పంపిండు : తాటిపర్తి జీవన్ రెడ్డి
ఇటీవల కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లి వెళ్ళిన సందర్భంగా జీవన్ రెడ్డి తన అనుభవాన్ని, రాజకీయ చతురతను ప్రదర్శించారని పరిశీలకులు భావిస్తున్నారు. ‘‘తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయమని దేవుడే మీదగ్గరికి పంపించిండు.. అన్నా’ అంటూ జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలు.. ఆ పార్టీలో తన భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి, తన పరిపక్వతకు ప్రతీకగా అభివర్ణిస్తున్నారు.
గతంలోనే బీఆర్ఎస్ లోకి ఆహ్వానించాం: కేటీఆర్
కేసీఆర్‌తో జీవన్ రెడ్డికి మంచి అనుబంధం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం, రాష్ట్ర ప్రజల మోములో చిరునవ్వులు తిరిగి రావాలంటే కేసీఆర్ పాలన రావాలని జీవన్ రెడ్డి సైతం కోరుకుంటున్నారని వ్యాఖ్యానించడం తాజా రాజకీయ పరిస్థితుల్లో జీవన్ రెడ్డి చేరికకు ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పునర్నిర్మాణంలో జీవన్ రెడ్డి లాంటి రాజకీయ నేత ఉండాలని కేసీఆర్ గతంలోనే అభిలషించారని, మాజీ ఎంపీ వినోద్ ద్వారా బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించినట్లు చెప్పారు. కేసీఆర్ ఆహ్వానాన్ని అప్పట్లో సున్నితంగా తిరస్కరించారని వివరించారు.
జీవన్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
జీవన్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మున్సిపల్ ఎన్నికల నుంచి జగిత్యాల రాజకీయం రంజుగా మారింది. ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్‌కు జమీన్ అస్మాన్ ఫరక్ ఉందంటారు. ఇలాంటి సమస్యలు బీఆర్ఎస్‌లో నెలకొన్నప్పుడు ఇతర పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యే ఆ నేత ఊసేలేకుండా పోయిన పరిస్థితులున్నాయని గుర్తుచేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి భిన్నమైందని గుర్తు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన జీవన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ కొద్ది రోజులకే వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీగా పోటీచేసే అవకాశం కల్పించింది. అక్కడా ఆయన ఓడిపోయారు. ఈ లోపు ఎమ్మెల్సీ కాలపరిమితి ముగిసినప్పటికీ తిరిగి పోటీ చేయలేదు. ఈ దశలో తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ పంచన చేరడంతో ఒకరకంగా జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఒక్కసారిగా ప్రశ్నార్ధకంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ తన రాజకీయ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే ఆయనకున్న ఏకైక అవకాశం రాజ్యసభకు ఎంపిక కావడమొక్కటే. అంతర్గతంగా ఈ దిశగా ఆయన పావులు కదిపినప్పటికీ ఆయన అనేక ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు పొందడంతో పాటు, జీవన్ రెడ్డికి అవకాశం ఇస్తే తేనెతుట్టెను కదిపినట్లేనని భావించిన రేవంత్ నాయకత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదని సమాచారం. గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో స్వంత పార్టీలోనే ఆయనకు ఎమ్మెల్యే సంజయ్ బలమైన ప్రత్యర్థి మారడంతో జీర్ణించుకోలేక పోయారనేది కాంగ్రెస్ వర్గాల వాదన. ఈ స్థితిలో రాజ్యసభ అభ్యర్థిత్వం రేవంత్ నమ్మినబంటు వేం నరేందర్ రెడ్డికి దక్కడంతో జీవన్ రెడ్డి ఆశలు గల్లంతయ్యాయి. జీవన్ రెడ్డి, ఆయన కుటుంబం, అనుచరుల రాజకీయ భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది. తమ రాజకీయ ప్రయాణం కొనసాగాలంటే కాంగ్రెస్ ను వీడడమొక్కటే మార్గంగా ఎంచుకున్నట్లు భావిస్తున్నారు.
భవిష్యత్ కోసం కాంగ్రెస్ కు గుడ్ బై
కాంగ్రెస్ పార్టీలో ఇక ఇముడలేని పరిస్థితుల్లో ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిగా జీవన్ రెడ్డి మాట చెల్లుబాటయ్యే పరిస్థితిలేదని తేలిపోవడంతో కార్యకర్తలు, అనుచరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బహిరంగ ప్రకటనతో కూడిన రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి కారణమంటూ వేం నరేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డిని డైరెక్ట్‌గా టార్గెట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల నాటి నుంచి రాజీనామా చేసే వరకు నెల రోజుల పాటు జీవన్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం, పరామర్శలు, బుజ్జగింపులు, నేతల పర్యటనలంటూ అనేక ఎపిసోడ్లు నడిచాయి. మంత్రులు లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబు, చివరికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ప్రతినిధులు తమదైన పద్ధతిలో జీవన్ రెడ్డిని కాంగ్రెస్‌లోనే కొనసాగించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయన ససేమిరా అన్నారు.
గులాబీ పార్టీ ఎంపికలో చాణక్యం
జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆయనను నిలుపుకొనేందుకు పార్టీ ప్రయత్నిస్తుండగానే తమ తమ పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ తెరవెనుక పోటీపడినట్టు తెలుస్తున్నది. ప్రజల్లో ఉండే నేతగా, ఎలాంటి అవినీతి మరకలు లేని నాయకునిగా, కార్యకర్తల కష్టసుఖాల్లో కలిసి ఉండే వ్యక్తిగా జీవన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నికల పోరులో గెలుపోటములు సహజమన్నట్లు ఆయన కొన్ని సందర్భాల్లో ఓడిపోయినప్పటికీ ప్రత్యర్థి పార్టీలు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేసిన సందర్భాలు లేవు. ఈ స్థితిలో ఆయన గులాబీ గూటికి చేరుతారా? కమలం పార్టీ వైపు అడుగులేస్తారా? అనే చర్చ కూడా కొద్ది రోజులు సాగింది. జీవన్ రెడ్డి తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి బీఆర్ఎస్‌వైపే మొగ్గు చూపారు. జీవన్ రెడ్డి ఎంత పెద్ద నేత అయినప్పటికీ, ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో అనుబంధం ఉన్నప్పటికీ ఆయన కార్యక్షేత్రం జగిత్యాల కావడం గమనార్హం. ఈ స్థితిలో ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పంచన చేరడంతో అక్కడ బీఆర్ఎస్‌కు నాయకత్వ ఖాళీ ఏర్పడింది. మరోవైపు ఇక్కడ బీజేపీకి బలం లేదు. వీటన్నింటినీ బేరీజు వేసుకొనే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌వైపు అడుగులు వేశారన్న చర్చ సాగుతున్నది.
బీఆర్ఎస్ కు రాజకీయ ఊతం
అనివార్య పరిస్థితుల్లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతున్నారని కాంగ్రెస్ ఎంత వాదిస్తున్నప్పటికీ ఈ పరిణామం ప్రస్తుతానికి బీఆర్ఎస్‌కు ఎంతోకొంత రాజకీయ ఊతాన్నిస్తుందనండంలో సందేహం లేదంటున్నారు. ఈ చేరిక బీఆర్ఎస్‌కు రాజకీయ ఉత్తేజానికి దోహదం చేస్తే, జీవన్ రెడ్డికి, ఆయన కుటుంబానికి రాజకీయ భవిష్యత్తునిస్తుందని చెప్పుకొంటున్నారు. ఇరువర్గాల ప్రయోజనం ఇందులో ఇమిడి ఉన్నట్లు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో జీవన్ రెడ్డికి లేదా ఆయన కుటుంబం నుంచి ఒకరికి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే చాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. బీఆర్ఎస్‌కు ఇప్పటికిప్పుడు అక్కడ ఆ స్థాయి నేత లేరు. ఈ సమయంలో కాంగ్రెస్‌పై రాజకీయ దాడిని తీవ్రం చేసేందుకు అందివచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు ఆ పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది.
కుటుంబ ఆధిపత్యంలోని బీఆరెస్‌లో నెట్టుకురాగలరా?
అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలకు పైగా స్వేచ్ఛాయుత రాజకీయాలు సాగించిన జీవన్ రెడ్డి… కల్వకుంట్ల కుటుంబ ఆధిపత్యంలోని ప్రాంతీయ పార్టీలో ఎంతమేరకు మనుగడ సాగిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. జీవన్ రెడ్డి తన జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం సాధించే క్రమంలో బీఆర్ఎస్ మాత్రమే తన ఆప్షన్‌గా భావిస్తున్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు ఆధిపత్యంలో కొనసాగే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం నేతి బీరకాయ నెయ్యి చందమేనన్నది బహిరంగ రహస్యమే. గతంలో ఆలె నరేంద్ర, విజయశాంతి, కపిలవాయి దిలీప్ కుమార్, కోదండరాం, జిట్టా బాలకృష్ణారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పేర్వారం రాములు, మాజీ మంత్రి చంద్రశేఖర్, విజయరామారావు, మందాడి సత్యనారాయణరెడ్డి, రాములు నాయక్, పట్నం మహేందర్ రెడ్డి, ఇతర పార్టీలో ఉన్నత స్థానాల్లో ఉండి బీఆర్ఎస్ లో చేరిన మోత్కుపల్లి నరసింహులు, డీ శ్రీనివాస్, కే కేశవరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి బడా నేతలు కేసీఆర్‌తో విభేదించి, ఆ పార్టీ నుంచి నిష్క్రమించారు. ఇక పీసీసీ మాజీ చీఫ్ , మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రస్తుతం సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. ఇలా బీఆర్ఎస్‌లో చేరి నిష్క్రమించిన వారి జాబితా చూస్తే.. జీవన్ రెడ్డి వంటి వారు బీఆర్ఎస్‌లో మనుగడ సాగించడం అంత సులభతరం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram