టార్గెట్‌ రేవంత్‌రెడ్డి.. పొలిటికల్‌ గేమ్‌ చేంజర్‌గా జగిత్యాల బీఆరెస్‌ సభ?

మూడున్నరేళ్లుగా పార్టీని నైరాశ్యం ఆవహించింది. గులాబీ దళపతి ఫామ్‌హౌస్‌ను వీడి బయటకు రావడం లేదు. ఈ సమయంలో జీవన్‌ రెడ్డి బీఆరెస్‌లో చేరే సందర్భాన్ని తన పొలిటికల్‌ గేమ్‌ చేంజర్‌గా మార్చేందుకు బీఆరెస్‌ ప్రయత్నిస్తున్నదా? ఒక నాయకుడి చేరిక సందర్భానికి భారీ బహిరంగసభను ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశాలేంటి?

టార్గెట్‌ రేవంత్‌రెడ్డి.. పొలిటికల్‌ గేమ్‌ చేంజర్‌గా జగిత్యాల బీఆరెస్‌ సభ? జగిత్యాల సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి తదితరులు
  • జీవన్‌రెడ్డి చేరిక సందర్భంగా విస్తృత ఏర్పాట్లు
  • వ్యూహాత్మ నిర్ణయంతో బీఆర్ఎస్ నాయకత్వం
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా జనసమీకరణ
  • అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా ఇన్‌చార్జ్‌ల నియామకం

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, తమ పార్టీలో చేరుతున్న సందర్భాన్ని రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్‌గా మార్చేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తులొడ్డుతోంది. అధికార పార్టీపై దాడిని తీవ్రం చేసేందుకు జీవన్ రెడ్డి రూపంలో అందివచ్చిన అవకాశాన్ని వందకు రెండొందల శాతం వినియోగించుకోవాలని వ్యూహం రచించింది. దీని కోసం ఆ పార్టీ ప్రధాన నాయకులు తమకు తొలినుంచి కలిసివచ్చే భారీ బహిరంగ సభను మరోసారి నమ్ముకున్నారు. అందుకే జీవన్ రెడ్డి చేరిక వ్యవహారాన్ని జగిత్యాలకు, ఆయన అనుచరులకే పరిమితం కాకుండా దీన్ని టర్నింగ్ పాయింట్‌గా మర్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులను తరలించే ప్రణాళిక అమలు చేస్తున్నారు. కేసీఆర్ వ్యూహం, కేటీఆర్ ప్రణాళికతో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు తోడు రాష్ట్రంలోని తమకు నమ్మకమైన నాయకులను కేవలం ఈ సభ సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించి గ్రామ స్థాయి నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నాయకులు ఆయా గ్రామాల్లో ‘ఎన్నికల’ను తలపించే విధంగా ప్రచారాన్ని, సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సభను జగిత్యాల జైత్రయాత్రగా అభివర్ణిస్తున్నారు.

భారీగా నాయకత్వ మోహరింపు

సభ కోసం ముందుగా జగిత్యాల జిల్లా నుంచి జనాన్ని సమీకరించాలని భావించారు. తాజాగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జనాన్ని సమీకరిస్తామంటూ చెప్పడం గమనార్హం. జగిత్యాల సభ నిర్వహణ బాధ్యతలు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు. నియోజకవర్గాల వారీగా ముఖ్యనాయకులకు బాధ్యత అప్పగించారు. జగిత్యాలకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కోరుట్లకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ధర్మపురికి ఎమ్మెల్సీ తక్కెళ్ళపెల్లి రవీందర్ రావు, చొప్పదండికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వేములవాడకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.

మూడేళ్ళుగా ప్రతికూల ఫలితాలు

రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి దాదాపు మూడేళ్ళు కావస్తోంది. ఈ మూడేళ్ళలో బీఆర్ఎస్‌కు అనుకూలించిన అంశాలు తక్కువేనని భావిస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో సున్నా ఫలితాలు రావడం ఆ పార్టీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ప్రజాక్షేత్రం కంటే ఫాం హౌజ్‌కే పరిమితమవుతున్నారనే విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తున్నది. పార్టీ కేడర్ లోనూ నిరాశ నెలకొంది. ఇదే పరిస్థితిలో కల్వకుంట్ల కుటుంబంలోని మరో నేత కవిత బీఆర్ఎస్‌ను వీడి, నిత్యం ఆ పార్టీని విమర్శించడం కూడా ఇబ్బందికరంగానే పరిణమించింది. ఈ నెల 25న ఆమె కొత్త పార్టీని ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు. పలువురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు గులాబీ నాయకత్వాన్ని కలవరపరిచేలా ఉన్నాయి. దీన్ని పక్కనపెడితే.. రాష్ట్రంలో వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా సానుకూల ఫలితాలు రాలేదు. హైదరాబాద్‌ను తమ అడ్డాగా చెప్పుకొనే బీఆర్ఎస్‌కు కంటోన్మెంట్‌లో ఓటమి కంట్లో నలుసుగా మారింది. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలొచ్చాయి. ఈ రెండు స్థానాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆకస్మికంగా మృతి చెందిన సానుభూతి కూడా కలిసిరాలేదు. ఇక గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ పలు జిల్లాలో జనం షాకిచ్చారు.

టార్గెట్ రేవంత్ రెడ్డి

ఈ మూడేళ్ళ కాలంలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు చేయని ప్రయత్నమంటూ లేదూ. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేతగాదంటూ, రాష్ట్రాన్ని తిరోగమన బాటపట్టించారంటూ రోజూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా వీటికి ప్రజల నుంచి ఆశించిన స్పందన కనిపించడంలేదు. ఈ దశలో జీవన్ రెడ్డి అధికార పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధం అయ్యారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని, రేవంత్ రెడ్డి టార్గెట్‌గా మరింత ‘మందుగుండు’ దట్టించి భారీ దాడి చేస్తే రానున్న రోజుల్లో తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయని భారీ స్కెచ్ వేశారని భావిస్తున్నారు.

హామీలపైనా నిలదీత

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు కావస్తున్నందున పెరిగిన ప్రజావ్యతిరేకతతో పాటు హామీలపై నిలదీసేందుకు కూడా ఇదే సరైన సమయంగా బీఆరెస్‌ నాయకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది మినహాయిస్తే ఆ తర్వాత ఎన్నికల సంవత్సరమే అయినందున ఇప్పటి నుంచి గేర్ మారిస్తే ఉపయోగమనే అంచనాతో పావులు కదుతుపున్నారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. భారీ జన సమీకరణ చేయడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదనే అంశాన్ని చాటేందుకు అవకాశం వస్తుందని అంటున్నారు. దానితోపాటు.. పార్టీ కేడర్, లీడర్లలో కొంత ఉత్సాహం నింపేందుకు సందర్భం కలిసి వచ్చినట్లు చర్చసాగుతోంది. ఫాం హౌజ్‌కే పరిమితమవుతున్న కేసీఆర్ కూడా ప్రజల్లోకి వచ్చేందుకు ఈ భారీ సభను వినియోగించుకోవాలని యోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కేడర్ విశ్వాసం కల్పించడమే కాకుండా కవితకు కూడా పరోక్షంగా చెక్ పెట్టొచ్చనే ఆలోచన ఉన్నట్లుగా చర్చసాగుతోంది. ఇక ఈ ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 27వ తేదీ అయినప్పటికీ దానికి ముందు జరిగే ఈ సభతో ఉత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నట్లుగా ఉంటుందని, పార్టీ నిర్మాణాత్మక, రాజకీయ నిర్ణయాలు తీసుకునేందుకు ప్లీనరీ లాంటి సమావేశం నిర్వహిస్తే సరిపోతోందని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Read Also |

బెదిరిన బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ !
హైదరాబాద్ నాలా పనుల్లో జాప్యం..కట్టెల వంతెన వీడియో వైరల్!
డీలిమిటేషన్‌పై ఫలించని ఎన్డీయే ఎత్తు.. లోక్‌సభలో వీగిపోయిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ సవరణ బిల్లు..