Sikh woman rape UK | యూకేలోని వెస్ట్ మిడ్‌లాండ్స్, ఓల్డ్‌బరీలో ఓ సిక్కు యువతిపై జరిగిన లైంగిక దాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు శ్వేతజాతీయులు ఆమెపై దారుణంగా లైంగిక దాడి చేయడమే కాకుండా, “మీ దేశానికి వెళ్లిపో, నువ్వు ఇక్కడిదానివి కాదు” అంటూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన సెప్టెంబర్ 9 ఉదయం 8.30 గంటలకు టేమ్ రోడ్ వద్ద ఉన్న పార్క్ ప్రాంతంలో జరిగింది. బాధితురాలు ఇరవైల్లో ఉందని పోలీసులు ధృవీకరించారు. Birmingham Live నివేదిక ప్రకారం, ఒక నిందితుడు గుండుతో, భారీ శరీరంతో, డార్క్ స్వెట్‌షర్ట్, గ్లోవ్స్ ధరించి ఉండగా, మరొకరు గ్రే టాప్, సిల్వర్ జిప్‌తో ఉన్నారని బాధితురాలు వివరించింది. West Midlands పోలీసులు ఈ కేసును తీవ్ర జాతివివక్షాపూరిత లైంగిక దాడిగా నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
ఈ ఘటన స్థానిక సిక్కు కమ్యూనిటీలో ఆగ్రహం, భయాందోళనకు దారితీసింది. స్మెత్‌విక్‌లోని గురునానక్ గురుద్వారాలో ఈ ఘటనపై ప్రత్యేక సమావేశం జరిగింది. Sikh Youth UK బాధితురాలి కుటుంబానికి మద్దతు ప్రకటించింది. సమాజ ప్రతినిధులు, “ఇది isolated attack అనడాన్ని మేము నమ్మలేం. ఇలాంటివి వేలల్లో కొన్ని కావచ్చనే భయం ఉంది. భద్రతా చర్యలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు వెస్ట్ బ్రామ్‌విచ్‌లోని కెన్‌రిక్ పార్క్‌లో మరో లైంగిక దాడి జరిగినట్టు సమాచారం రావడంతో స్థానికుల్లో భయం మరింత పెరిగింది.
వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు. Sandwell పోలీస్ విభాగానికి చెందిన చీఫ్ సూపరింటెండెంట్ కిమ్ మాడిల్ మాట్లాడుతూ, “బాధితురాలు మాకు ఇచ్చిన సమాచారం చాలా స్పష్టంగా ఉంది. నిందితులను పట్టుకునేందుకు CCTV, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించాం. ఈ సంఘటనపై మా దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ప్రజల భయం అర్థం చేసుకున్నాం. భద్రత కోసం అదనపు పహారా కాస్తున్నాం. ఇటువంటి ఘటనలు చాలా అరుదు అయినప్పటికీ మేము వాటిని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం” అని తెలిపారు. అలాగే నేరస్థులను పట్టుకునేందుకు తమకు సహకరించాల్సిందిగా స్థానికులకు విజ్ఞప్తి చేసారు.
ఈ ఘటనపై బర్మింగ్హామ్ ఎడ్జ్‌బాస్టన్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ స్పందిస్తూ, “ఇది లైంగిక దాడి మాత్రమే కాదు, జాతి విద్వేషం, స్త్రీ ద్వేషం కలిసిన ఘోరమైన నేరం. సిక్కు సమాజం కూడా ఈ దేశంలో భాగమే. వారికి నిర్భయంగా జీవించే హక్కు ఉంది. జాతివివక్ష, , స్త్రీ ద్వేషం ఈ దేశంలో ఉండకూడదు” అని అన్నారు. ఇల్ఫోర్డ్ సౌత్ ఎంపీ జాస్ అత్వాల్ కూడా ఈ ఘటనను “vile, racist, misogynist attack”గా అభివర్ణిస్తూ, “దేశంలో పెరుగుతున్న జాతివివక్ష ఆందోళనకు కి ఇది ఒక సంకేతం. ఒక యువతి జీవితాంతం మానసికంగా కుమిలిపోనుంది” అన్నారు.
ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం కమ్యూనిటీ భయాన్ని మరింత పెంచుతోంది. గత నెల వుల్వర్‌హాంప్టన్‌లో ఇద్దరు వృద్ధ సిక్కులపై ముగ్గురు టీనేజర్లు దాడి చేసిన ఘటన కూడా వారిలో భయాందోళనలను పెంచుతోంది. వారిని నేలకేసి కొట్టి తన్నిపడేసి, పగోడాలను లాగేసారు. ఈ రెండు సంఘటనలు వరుసగా జరగడం యూకేలో మైనారిటీ వర్గాలపై పెరుగుతున్న జాతి విద్వేషం, హింసలకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.