Sri lanka government | శ్రీలంకలోని వామపక్ష ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై మాజీ అధ్యక్షుడు, వారి వితంతు భార్యలకు ఇప్పటి వరకూ కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాలు, అలవెన్సులు, ఇతర సౌకర్యాలను నిలిపిస్తూ చట్టం తీసుకొచ్చింది. ప్రెసిడెన్షియల్ ఎన్‌టైటిల్‌మెంట్స్ యాక్ట్ 1986కు అధికార నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) తీసుకొచ్చిన సవరణ బిల్లు 151 ఓట్ల మెజార్టీతో ఆమోదం పొందింది. ఇప్పటి వరకూ ఈ చట్టం కింద మాజీ దేశాధ్యక్షులు లేదా వారి వితంతు భార్యలకు నివాసం లేదా నెలవారీ రెసిడెన్షియల్ అలవెన్స్, సెక్రటేరియల్ అలవెన్స్, అధికారిక రవాణా సదుపాయం కల్పించేవారు. దీనితోపాటు మాజీ అధ్యక్షుడి వితంతు భార్యకు ప్రత్యేకంగా నెలవారీ పెన్షన్‌కూడా చెల్లించేవారు.
దేశంలో అవినీతిని అంతమొందిస్తామని, ఖజానాపై చెల్లింపుల భారాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ఎన్‌పీపీ.. తన హామీలను నెరవేర్చే క్రమంలో తాజా చర్య తీసుకున్నది. ‘పన్ను చెల్లింపుదారుల సొమ్మను కాపాడే క్రమంలో 1986 చట్టాన్ని మేం రద్దు చేస్తున్నాం’ అని న్యాయశాఖ మంత్రి హర్షణ నాయక్కర పార్లమెంటుకు తెలిపారు.
కొత్త చట్టం తక్షణం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం చంద్రికా కుమార తుంగ, మహింద రాజపక్స, మైత్రిపాల సిరిసేన, గొటబయ రాజపక్స, రణిల్ విక్రమెసింఘె, రణసింఘె ప్రేమదాస భార్య హేమా ప్రేమదాసకు ప్రత్యేక సదుపాయాలు, అలవెన్సులు నిలిపివేస్తారు. మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కొలంబోలోని విజేరామ మేవాతలోని తన అధికారిక నివాసాన్ని త్వరలో ఖాళీ చేయనున్నారని అధికారవర్గాలు తెలిపాయి.
అంతకు ముందు పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా దేశాధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే మాట్లాడుతూ.. మాజీ అధ్యక్షుల అధికారిక నివాసాలు, ఇతర ఖర్చులకు ప్రభుత్వం పెద్దమొత్తంలో కేటాయించాల్సి వస్తున్నదని తెలిపారు. ఒక్క మహింద రాజపక్స నివాసం అద్దె విలువ నెలకు శ్రీలంక రూపాయల్లో 46 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. మాజీ అధ్యక్షులు మైత్రిపాల సిరిసేన, చంద్రికా కుమారతుంగ, చంద్రికా బండారు నాయకే కుమారతుంగ కూడా త్వరలోనే వారికి కేటాయించిన అధికారిక బంగళాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. గొటబయ కూడా మిరిహనలోని తన వ్యక్తిగత నివాసంలో ఉండటం లేదు. రణిల్ విక్రమెసింఘె మాత్రం తన వ్యక్తిగత నివాసంలో ఉంటున్నారు. అయితే.. కొత్త బిల్లులో మాత్రం పెన్షన్ చెల్లింపులను మాత్రం కొనసాగించారు. ఇప్పటి వరకూ మాజీ అధ్యక్షులు, వారి భార్యలు నివసించిన అధికారిక బంగళాలను ఇతరులకు కేటాయించనున్నారు.