leopard | Sri Lanka | Pm Modi
విధాత: ఓ చిరుత పులి కోసం శ్రీలంక వాసులు తెగ వెతికేస్తున్నారు. ఒంటికన్నుతో ఉన్న ఓ ఆడ చిరుతపులి జాడ కోసం ఇంతగా వెతకడం ఇప్పుడు శ్రీలంకలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోదీకి ఆ దేశ ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస ఓ ఫోటోను జ్ఞాపికగా బహూకరించారు. ఫోటోలో వెళుతూ వెళుతూ ఆగి వెనకకు చూస్తున్న ఓ ఆడ చిరుత పులి ఫోటోను ప్రేమదాస ప్రధాని మోదీకి అందజేశారు. అయితే ఫోటోలో ఉన్న ఆడ చిరుతకు కుడి కన్ను నీలం రంగులో ఉంది. అంటే, ఆ కన్ను చూపు కోల్పోయినట్లు సూచిస్తోంది.
ఎందుకు ఆ ఫోటో ఇచ్చారూ..?
మోదీకి ప్రేమదాస ఒంటికన్నుతో కూడిన చిరుత ఫోటోను బహుకరించడం వెనుక మతలబు ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రేమదాస వివరణ ఇచ్చారు. ఒక కంటికి చూపు లేకపోయినా అడవిలో ఎదురయ్యే సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొని మనుగడ సాగిస్తున్న ఈ చిరుతపులి ‘శ్రీలంక సహజ వారసత్వానికి, సహజ అందాలకు చిహ్నం’ అని సజిత్ ప్రేమదాస వివరించారు. గ్లకోమా (కంటి నరాలు దెబ్బతినడం), కంటిశుక్లాల కారణంగా చిరుతపులి చూపు కోల్పోయి ఉండొచ్చని, సవాళ్లను అధిగమిస్తూ మనుగడ కొనసాగించడానికి ఇది సంకేతమని సజిత్ ప్రేమదాస తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆ చిరుత జాడ ఎక్కడా..?
మోదీకి అందించిన జ్ఞాపికతో చర్చనీయాంశమైన ఒంటికన్ను ఆడ చిరుత విల్పట్టు జాతీయ అభయారణ్యం పరిధిలో ఉన్నట్లుగా అభయారణ్యం అధికారి పుబుదు సురంగ రత్నాయకే వెల్లడించారు. అయితే ఏడాది నుంచి ఈ ఒంటి కన్ను చిరుతపులి గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు అని తెలిపారు. చిరుత పులుల గణనతో పాటు ఒంటికన్నుచిరుత ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ‘వన్ ఐ’ (ఒంటి కన్ను) అని పిలిచే ఈ చిరుతపులి కోసం వెతుకుతున్నామన్నారు. సహజంగా ఆడ చిరుతపులికి ఎక్కువ దూరం నడిచే సామర్థ్యం ఉంటుందని చెప్పారు.
మనుషుల మాదిరిగానే జంతువులు కూడా కంటి లోపంతో జన్మించవచ్చని.. అయితే చిరుతలకు రెండుకళ్లు ఉండటం వేటలో దానికి ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. విల్పట్టు నేషనల్ పార్కులో దాదాపు 350 చిరుత పులులు ఉన్నట్లు సర్వేలో వెల్లడైందని.. శ్రీలంకలో ఈ చిరుతపులి జాతిని ‘శ్రీలంకన్ లెపార్డ్’ లేదా పాంథెరా పార్డస్ కోటియా అని పిలుస్తారని తెలిపారు. ఈ జాతి చిరుతపులిని శ్రీలంకలో 1956లో మొదటిసారి గుర్తించారు. ఈ చిరుత పులులను ప్రస్తుతం శ్రీలంకలో అంతరించిపోతున్న జాతిగా గుర్తించి, రక్షిత జాతుల జాబితాలో చేర్చినట్లు సమాచారం.