T20 World Cup Semis: India On The Brink After Heavy Loss; West Indies Win Complicates Qualification
సూపర్–8 గ్రూప్-1 పరిస్థితి సంక్షిప్తంగా
దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఒక్కో మ్యాచ్ గెలిచి 2 పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. భారత్, జింబాబ్వే ఖాతా తెరవలేకపోయాయి. భారత్ నెట్ రన్‌రేట్ –3.800 వద్ద ఉండడంతో ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లు భారీ తేడాతో గెలవడం తప్పనిసరి.
సెమీస్ దారి : రెండు విజయాలు + మెరుగైన నెట్ రన్‌రేట్.
విధాత క్రీడా విభాగం | 24 ఫిబ్రవరి 2026 | హైదరాబాద్:
ICC Men’s T20 World Cup: సూపర్–8 దశలో భారత్ పరిస్థితి మరీ దీనంగా మారిపోయింది. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ ఓటమి భారత్‌ను కుదేలు చేసింది. –3.8 రన్‌రేట్‌తో మూలుగుతున్న ఇండియా మీద వెస్టీండీస్ పెద్ద తాటిపండు పడేసింది. దీంతో భారత్ సెమీస్ అవకాశాలు దారుణంగా సన్నగిల్లాయి. ఒక్క ఓటమి.. ఒకే ఒక్క ఓటమి ఇండియాను కప్పు కలను దాదాపు దూరం చేసింది. ఇక ఇండియాకు కావాల్సింది.. తన భారీ విజయాలు, ఇతరుల పరాజయాలు.
సూపర్–8లో మొదటి రెండు స్థానాలు మాత్రమే సెమీఫైనల్‌కు అర్హత పొందుతాయి. పాయింట్లు సమానంగా ఉంటే నెట్ రన్‌రేట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ రెండు పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. భారత్, జింబాబ్వే సున్నా పాయింట్లు కావల్సినంత నెగటివ్ రన్‌రేట్‌తో ఉన్నాయి.
భారత్‌కు ఒకటే మార్గం – రెండు భారీ విజయాలు
ఇప్పుడున్న పరిస్థితిలో భారత్‌కు ఉన్న మార్గం ఒక్కటే. మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవాలి. జింబాబ్వే, వెస్టిండీస్‌లపై విజయం సాధిస్తే భారత్ నాలుగు పాయింట్లకు చేరుతుంది. అయితే మామూలు గెలవడం మాత్రమే సరిపోదు. భారీ తేడాతో గెలవాలి. ఎంతంటే –3.8 నెట్ రన్‌రేట్‌ను +కు మార్చగలిగేంత.
భారత్ రెండు మ్యాచ్‌లు గెలిస్తే సెమీఫైనల్ అవకాశాలు బలంగా ఉంటాయి. దక్షిణాఫ్రికా కూడా మిగిలిన రెండు గెలవాలని కోరుకోవాలి. గెలిస్తే వారు గ్రూప్ టాపర్‌గా, భారత్ రెండో స్థానంలో ఉంటారు. కానీ మూడు జట్లు నాలుగు పాయింట్లతో సమానంగా ఉంటే నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది. అందుకే ప్రతి పరుగూ ఇప్పుడు విలువైనదే.
ఒకవేళ భారత్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే, పరిస్థితి చాలా క్లిష్టం అవుతుంది. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. –3.8 నెట్ రన్‌రేట్‌తో సెమీఫైనల్ చేరడం దాదాపు అసాధ్యం.
ఎందుకు ఈ పరిస్థితి? ఇప్పుడేం చేయాలి?
ఈ టోర్నీలో భారత్ ఓపెనింగ్ భాగస్వామ్యాలు బాగా నిరాశపరిచాయి. USAపై 8 పరుగులు, నమీబియాపై 25, పాకిస్థాన్‌పై 1, నెదర్లాండ్స్‌పై 0, దక్షిణాఫ్రికాపై 0.. ఇలాంటి దారుణమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్లు మిడిలార్డర్‌పై ఒత్తిడి పెంచాయి. దానికి తగ్గట్లు ప్రత్యర్థి జట్లు కూడా వ్యూహాలు మార్చి ఆఫ్‌స్పిన్నర్లతో దాడి చేయడం కూడా ప్రభావం చూపింది.
టి20 ప్రపంచకప్ సూపర్ 8లో ఔటైన తర్వాత నిరాశగా నడుస్తున్న వాషింగ్టన్ సుందర్
జట్టు ఎంపికపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేయడం సరైన నిర్ణయమేనా? అన్న చర్చ నడుస్తోంది. ఫీల్డింగ్ కూడా పేలవంగా ఉంది. ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లే పెద్ద ప్రభావం చూపాయి. ఇప్పటి నుంచైనా భారత్ ప్రతి మ్యాచ్‌ను నాకౌట్‌గా భావించాలి. భారీ తేడాతో గెలవాలి. ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పటిష్టపరచాలి. ఫీల్డింగ్‌ను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా నెట్ రన్‌రేట్‌పై దృష్టి పెట్టాలి.
అయితే ఇక్కడ ఒక చిన్న ప్రయోజనం మాత్రం ఉంది. వెస్టిండీస్‌తో జరిగే చివరి మ్యాచ్‌కు ముందే దక్షిణాఫ్రికా–జింబాబ్వే మ్యాచ్ పూర్తవుతుంది. అందువల్ల అవసరమైన సమీకరణాలు స్పష్టంగా తెలుస్తాయి.
ప్రస్తుత పాయింట్ల పట్టిక:
| జట్టు | మ్యాచ్‌లు | విజయాలు | ఓటములు | పాయింట్లు | నెట్ రన్‌రేట్ |
|---|---|---|---|---|---|
| దక్షిణాఫ్రికా | 1 | 1 | 0 | 2 | +3.800 |
| వెస్టిండీస్ | 1 | 1 | 0 | 2 | +5.350 |
| భారత్ | 1 | 0 | 1 | 0 | –3.800 |
| జింబాబ్వే | 1 | 0 | 1 | 0 | –5.350 |
సారాంశం ఒక్కటే — భారత్ గోడ మీద ఉంది. ఇటా? అటా? అనేది ఇక తన చేతుల్లోనే. రెండు విజయాలు సాధిస్తే కనీసం సెమీస్‌కు ఒక తలుపైనా తెరుచుకుంటుంది. మరో తలుపు దక్షిణాఫ్రికా తెరవాల్సివుంది. ఇకనుండి ఒక్క పొరపాటుకైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.
