ఆధార్ లో మొబైల్ నెంబర్, అడ్రస్ మార్పు వంటివి ఇక ఆన్‌లైన్ లో నేరుగా చేసుకోవచ్చు. ఆధార్ లో ఈ మార్పుల కోసం ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఆధార్ ను అప్ డేట్ చేయడం కోసం ఫీజును 2025 అక్టోబర్ 1 నుంచి పెంచారు. 2025 నవంబర్ నుంచి మరిన్ని మార్పులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదా?
ఈ ఏడాది (2025) నవంబర్ 1వ తేదీ నుంచి పేరు, చిరునామా, పుట్టినతేది, మొబైల్ నెంబర్ వంటి వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి ఆధార్ సెంటర్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. వేలిముద్రలు లేదా ఐరిష్ స్కాన్ వంటి బయో మెట్రిక్ అప్ డేట్స్ కోసమే ఇక నుంచి ఆధార్ సెంటర్లకు వెళ్లాలి. పాన్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఎంఎన్ఆర్‌ఈజీఏ, బర్త్ సర్టిఫికెట్, స్కూల్ రికార్డుల వంటి ఇతర ప్రభుత్వ డేటా బేస్ లతో ఆధార్ ను లింక్ చేస్తారు. అంటే ఇకపై మాన్యువల్ గా పత్రాలను అప్ లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో పాటు ఆధార్ అప్ డేట్ వేగంగా పూర్తికానుంది.
ప్రతి పనికి ఆధార్‌తోనే లింక్..
ప్రతి వ్యక్తి గుర్తింపునకు ఆధార్ కీలకంగా మారింది. బ్యాంక్ ఖాతా ప్రారంభించడంతో పాటు ప్రభుత్వ పథకాలకు కూడా ఆధార్ కీలకంగా మారింది. పెట్టుబడులు, ఆస్తి కొనుగోలు, రిజిస్ట్రేషన్లు, విద్యా సంస్థల్లో ఆడ్మిషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోటా ఆధార్ కార్డు ప్రతి భారతీయుడికి అవసరమైన ప్రాథమిక గుర్తింపుకార్డుగా మారింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఆధార్ అప్ డేట్ ఫీజులు పెరిగాయి. పేరు, అడ్రస్, పుట్టినతేది, మొబైల్ నెంబర్ మార్పు వంటి వాటిని అప్ డేట్ చేయడం కోసం గతంలో రూ.50 ఫీజు వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని రూ. 75కు పెంచారు. బయోమెట్రిక్ కోసం ఫీజును గతంలో రూ. 100 వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని రూ. 125కు పెంచారు. పెరిగిన ఫీజులు 2028 వరకు అమల్లో ఉంటాయని యూఐడీఏఐ తెలిపింది. ఏడు నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు వేలిముద్ర, ఐరిష్ స్కాన్ వంటి బయోమెట్రిక్ అప్ డేట్ ఉచితంగా చేస్తారు. గతంలో దీనికి ఫీజు వసూలు చేసేవారు. ఐదేళ్లలోపు పిల్లలకు బాల ఆధార్ జారీ చేస్తారు. ఐదేళ్ల తర్వాత ఆధార్‌ను పిల్లలు అప్ డేట్ చేసుకోవాలి.
ఒక్కరికి ఒకే ఆధార్
ఒక్క వ్యక్తి ఒకే ఆధార్ నంబర్ మాత్రమే ఉంటుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఒకే వ్యక్తి పేరును వేర్వేరు నెంబర్లతో ఆధార్ ఉంటే చర్యలు తీసుకుంటామని వివరించింది. ఈ ఏడాది జూన్ 14 వరకు ఆధార్ లో అప్ డేట్లను ఉచితంగా యూఐడీఏఐ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అప్ డేట్ చేసుకుంటున్నవారు ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. మై ఆధార్ పోర్టల్ లేదా యూఐడీఏఐ మొబైల్ యాప్ ద్వారా లాగిన్ అవ్వడం ద్వారా ఓటీపీ ధృవీకరణతో ఆధార్ లో అప్ డేట్లు సులభంగా చేసుకోవచ్చు. బయోమెట్రిక్ అప్ డేట్స్ కోసం ఆధార్ సెంటర్ కు వెళ్లాలి.
ఆధార్-పాన్ కార్డుతో లింక్
ఇక మరో ప్రధాన అంశం పాన్-ఆధార్ లింకింగ్. పాన్ కార్డును ఆధార్ లింక్ చేయకపోతే అది పనిచేయదని ప్రభుత్వం తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్ లలో పెట్టుబడులుపెట్టే సమయంలో డీ మ్యాట్ ఖాతా ఓపెన్ చేసే సమయంలోనో ట్యాక్స్ బెనిఫిట్ కోసం పెట్టుబడి సమయంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. . యూఐడీఏఐ, ఎన్‌పీసీఐ ఆఫ్ లైన్ ఆధార్ కెవైసీ, ఆధార్ ఈ కెవైసీ సేతు వంటి కొత్త ఫీచర్లను ప్రారంభించాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు పూర్తి ఆధార్ నెంబర్ ను యాక్సెస్ చేయకుండానే కస్టమర్లను గుర్తిస్తాయి. ఇది డేటా గోప్యతను మెరుగుపరుస్తుంది. అంతేకాదు పనులు కూడా వేగంగా పూర్తవుతాయి.
నిబంధనలు కఠినం
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఏఈపీఎస్ నియమాలను కఠినతరం చేస్తున్నారు. జనవరి 1, 2026 నుండి అమలులోకి వచ్చేలా బ్యాంకులు, ఇతర ఆర్దిక సంస్థలకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కేవైసీ ధృవీకరణ కోసం కొత్త రూల్స్. ఫ్రాడ్ నివారణకు ఈ రూల్స్ రూపొందించారు. దీని అర్థం గ్రామీణ ప్రాంతాలలో లేదా చిన్న పట్టణాలలో ఆధార్ ఆధారిత నగదు ఉపసంహరణ లేదా డిపాజిట్ సేవలు మరింత ఖర్చుతో కూడినవి కావచ్చు లేదా పరిమితం కావచ్చు. దీని ద్వారా మోసాలు తగ్గుతాయనే అభిప్రాయాలున్నాయి.
