Ayyappa Devotees protest| డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్ప స్వాములు..ఉద్రిక్తత

హైదరాబాద్ లోని లక్డీకపూల్ లో ఉన్న తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని తెలంగాణ అయ్యప్ప స్వాములు ముట్టడించడం..ఉద్రిక్తతకు దారితీసింది.

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లోని లక్డీకపూల్ లో ఉన్న తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని(Telangana Police DGP Office) తెలంగాణ అయ్యప్ప స్వాములు(Ayyappa Devotees Protest) ముట్టడించడం..ఉద్రిక్తతకు దారితీసింది. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ అయ్యప్ప సేవా సమితి, బీజేవైఎం(BJYM) రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్రం నలమూలల నుంచి వచ్చిన అయ్యప్ప స్వాములు భారీ ర్యాలీతో ముట్టడికి తరలిరావడంతో వారిని పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా అయ్యప్పలు నినాదాలు చేస్తూ..ముందుకు దూసుకెళ్లారు. ఈ సందర్భంగా తోపులాట..వాగ్వివాదం చోటుచేసుకుంది.

పోలీసులు పలువురు అయ్యప్పలను అరెస్టు చేశారు. అయ్యప్ప దీక్ష మాలలు ధరించిన పోలీసులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడాన్ని అయ్యప్ప స్వాములు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల అయ్యప్ప మాలలు వేసుకున్న పోలీస్ ఉద్యోగులు యూనిఫామ్ డ్రెస్ కోడ్ లేకుండా డ్యూటీకి రావద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. దీనిని నిరసిస్తూ అయ్యప్పలు ఆందోళన చేపట్టారు. అయ్యప్ప మాల ధారులకు దీక్షా సమయంలో పోలీస్ డ్రెస్ కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

అయ్యప్ప మాల కోసం యూనిఫాం నిబంధనల్లో వెసులుబాటు ఇవ్వలేమంటూ హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం 2025 నవంబర్ 20వ తేదీతో ఓ ఉత్తర్వు జారీ చేశారు. అయితే అయ్యప్ప మాల వేసుకునేందుకు వీలుగా యూనిఫాం నిబంధనల్లో వెసులుబాటు కల్పించాలని కంచన్‌బాగ్ స్టేషన్‌కి చెందిన ఎస్సై ఎస్. కృష్ణకాంత్ కోరారు. సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ కె శ్రీకాంత్ దీనిపై స్పందిస్తూ..అప్పటికే తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ఉన్న ఉత్తర్వుల ప్రకారం అలాంటి డ్రెస్ కోడ్ వెసులుబాటు కల్పించడం కుదరదు అంటూ సమాధానం ఇచ్చారు. ఇదే సమాధానాన్ని కృష్ణకాంత్‌తో పాటు ఆ జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లకూ పంపారు. ఈ ఉత్తర్వులపై అయ్యప్ప స్వాములు మండిపడుతున్నారు.

Latest News