విధాత, హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ గురువారం కీలక పురోగతి సాధించింది. ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు 14రోజుల కస్టడీ ఆఖరి రోజైన గురువారం విచారణ ప్రక్రియ ముమ్మరంగా సాగింది. ప్రభాకర్ రావు తో కేసులోని ఇతర నిందితులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, శ్రవణ్ రావులను కలిపి సిట్ అధికారులు విచారించారు. అలాగే ప్రభాకర్ రావు పెద్ద కుమారుడు నిశాంత్ రావు ను కూడా విచారించడం విశేషం. 4గంటల పాటు నిశాంత్ రావును విచారించిన సిట్ అధికారులు అతని ఆర్థిక లావాదేవిల వివరాలపై ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డు చేశారు.
ప్రభాకర్ రావు రెండు వారాల కస్టడీ ముగిసిపోగా..విచారణలో ఆయన వద్ద ఉన్న కీలక పెన్ డ్రైవ్ ను సిట్ స్వాధీనం చేసుకుంది. దాదాపు 6వేలకు పైగా ఫోన్ నెంబర్లు అందులో ఉండటం గుర్తించిన సిట్ అధికారులు వాటిపై ప్రభాకర్ రావు ను ప్రశ్నించగా సమాధానం లభించలేదు. హరీష్ రావు తో సంభాషణ కేవలం మావోయిస్టులకు సంబధించిందేనని ప్రభాకర్ రావు చెప్పినట్లుగా సమాచారం. కొన్ని ఫోన్ నెంబర్ల ట్యాపింగ్ కు అనుమతి తీసుకుని వేలాది మంది ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారని సిట్ గుర్తించింది. ఉద్యోగ విరమణ చేశాక మళ్లీ ఎస్ ఐబీ చీఫ్ గా మాజీ సీఎం కేసీఆర్ ఎలా..ఎందుకు నియమించారన్నదానిపై ప్రభాకర్ రావు నుంచి మౌనం పాటించారని తెలుస్తుంది.
ప్రభాకర్ రావు కస్టడీ విచారణలో వెల్లడించిన అంశాలు..కేసులో ఇప్పటి వరకు లభించిన ఆధారాల మేరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లకు నోటీసులు జారీ చేసి వారిని కూడా విచారించేందుకు సిట్ సిద్దమవుతున్నట్లుగా సమాచారం.
ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న మాజీ జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘనందన్, మాజీ సీఎస్‌లు సోమేష్‌కుమార్, శాంతికుమారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ లు నవీన్ చందా, అనిల్ కుమార్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి ను సాక్షులుగా విచారించి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.
ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాను ట్యాపింగ్‌కు ఆదేశాలిచ్చానని ప్రభాకర్ రావు చెప్పిన కథనాలను వారు సిట్ విచారణలో తోసిపుచ్చారు. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఇప్పటికే వారంతా సిట్‌కు వాంగ్మూలాలు ఇచ్చారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ)లో ట్యాప్ చేసిన ఫోన్ నంబర్లు సరైనవేనా కావా అని పరిశీలించిన రివ్యూ కమిటీ సభ్యులూ ఈ విషయంతో పూర్తి బాధ్యత ప్రభాకర్‌రావుదేనని చెప్పినట్లుగా సమాచారం. తాము రివ్యూ కమిటీ మీటింగ్ పెట్టిన ప్రతిసారి దాదాపు 4-5 వేల ఫోన్ నంబర్ల జాబితాను ప్రభాకర్‌రావు తీసుకొచ్చేవారని.. అవి మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచేందుకు సంబంధించిన వారివేనా అని తనిఖీ చేసే యంత్రాంగం తమకు అందుబాటులో లేదని వారంతా వాంగ్మూలమిచ్చారు.
ఎస్‌ఐబీ విధుల నేపథ్యంలో ప్రభాకర్‌రావు చెప్పిన విషయాలనే తాము నమ్మినట్లు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టుల ముసుగులో న్యాయమూర్తులు, జర్నలిస్టులు, రాజకీయ నేతల ఫోన్ నంబర్లను ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలకు ప్రభాకర్‌రావు నుంచి సరైన సమాధానాలు రాకపోవడాన్ని సిట్ తప్పు పడుతోంది. కేవలం బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చేందుకే వేలాది ఫోన్ల ట్యాపింగ్ చేశారని సిట్ గుర్తించింది.
ఇవి కూడా చదవండి :
Bangladesh Elections 2026 : బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ పై నిషేధం
Eesha Movie Review | ‘ఈషా’ భయపెడుతుందన్నారు.. మరి భయపెట్టిందా.?
