అమరావతి : ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ(PPP medical colleges) విధానంపై హిందుపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ( MLA Balakrishna) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సత్యసాయి జిల్లాలో పర్యటించిన బాలకృష్ణ తుమ్మలకుంటలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పీపీపీ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అని అర్థం అని, మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే మానిటరింగ్ చేస్తుండటంతో బాధ్యత..భయంతో కాలేజీల నిర్వహణ సాగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం మెడికల్ కళాశాలలకు ఖర్చు చేసింది కేవలం రూ.212 కోట్లు మాత్రమేనన్నారు. కాలేజీల పనులన్ని అసంపూర్తిగా చేశారన్నారు. ప్రభుత్వం అన్ని ఆలోచన చేసి..ఆ మెడికల్ కాలేజీలను సద్వినియోగం చేసుకునేందుకు పీపీపీ విధానంతో ముందుకెలుతుందన్నారు. వారు మెడికల్ కాలేజీల విషయంతో వాస్తవంగా చేసిందేమి లేకపోగా..మళ్లీ అధికారంలోకి రావాలని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బాలకృష్ణ విమర్శించారు. నిజానికి వైసీపీకి మెడికల్ కాలేజీల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు.
హిందూపురం హాస్పిటల్లో మరికొన్ని అధునాతన పరికరాలను ఏర్పాటు చేస్తానని హిందూపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త కొత్త పరిశ్రమలు కూడా తీసుకురాబోతున్నానంటూ అంతకుముందు బాలకృష్ణ తెలియజేశారు. ఏరో స్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్ సిటీ వంటి పరిశ్రమలు కూడా హిందూపురంకి తీసుకురావడానికి సీఎం చంద్రబాబు చాలా కృషి చేశారంటూ తెలియజేశారు. ఈ కొత్త పరిశ్రమలు రావడం వల్ల నిరుద్యోగ యువతి, యువకులకు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.