Heavy Rains In Mumbai: నైరుతి రుతుపవనాలు అనుకున్నదానికంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. వాటి ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో వాటి తీవ్రత ఎక్కువగానే ఉన్నది. సోమవారం నాడు ముంబై నగరం భారీ వర్షంతో అతలాకుతలమైంది. వర్షాల సీజన్ తొలి రోజైన సోమవారం 107 సంవత్సరాల నాటి రికార్డును ముంబై వానలు బ్రేక్ చేశాయి. సాధారణం కంటే 16 రోజులు ముందుగానే రుతుపవనాలు ముంబైని తాకినట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. 2001 నుంచి చూస్తే రుతుపవనాలు ముందుగానే రావడం ఇదే మొదటిసారి అని తెలిపింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 11 గంటల వరకూ దక్షిణ ముంబైలోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొన్నది. ముంబైలోని కొలాబా అబ్జర్వేటరీ వద్ద 295 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. ఇక్కడ 1918లో 279.4 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకూ రికార్డుగా ఉన్నది. దానిని తాజా వర్షాలు ముంచేశాయి.
ముంబై వర్షాలు మరో రికార్డును కూడా బ్రేక్ చేశాయి. 75 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగా ముంబైలోకి ప్రవేశించాయి. 2024 జూన్ 6న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకగా.. ముంబైలోకి జూన్ 11న ప్రవేశించాయి. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రానున్నాయన్న అంచనాల నేపథ్యంలో వాతావరణ విభాగం ఈ ప్రాంతానికి 16 రోజుల ముందే రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం నాడు ముంబై, ఠాణె, రాయిగడ్, రత్నగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ నుంచి రెడ్ అలర్ట్‌కు మార్చింది. కర్ణాటక, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ముంబై సహా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లోకి, బెంగళూరు సహా కర్ణాటకలోని పలు ప్రాంతాలకు, తమిళనాడులోని మిగిలిన అన్ని ప్రాంతాలకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు, బంగాళాఖాతంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలకు, మిజోరం, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, అరునాచల్ ప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు, అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాలకు సోమవారం (మే 26) ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది.