విధాత, హైదరాబాద్ : మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమాపై ఆయన సోదరుడు మంచు మనోజ్ ప్రశంసల వర్షం కురిపించాడు. మంచు మనోజ్ కొన్ని నెలలుగా ఆస్తి వివాదాలతో తన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణుతో గొడవలు పడి పోలీసు కేసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. తన భైరవం సినిమా ప్రమోషన్ సందర్భంగా మంచు మనోజ్ అన్న విష్ణుపై కోపంతో కన్నప్ప సినిమాలోని డైలాగ్ శివయ్యపై సెటైర్లు సైతం వేశాడు. కన్నప్ప మూవీ గ్రాపిక్ వర్క్స్ కు సంబంధించిన సీడీ మిస్ అయినప్పుడు కూడా మనోజ్ తన అన్నపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. కన్నప్ప సినిమా విడుదల వేళ మనోజ్..అన్న విష్ణు పేరేత్తకుండా శుభాకాంక్షలు తెలిపాడు. అయితే శుక్రవారం విడుదలైన కన్నప్ప సినిమాను ప్రసాద్ ఐమాక్స్ లో చూసిన మంచు మనోజ్ అనూహ్యంగా కన్నప్ప సినిమాపై ప్రశంసలు కురిపించాడు. సినిమా చాల బాగుందని.. ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్తుందన్నారు. క్లైమాక్స్ లో అన్న కూడా ఇంత గొప్ప చేస్తారని అస్సలు కలలో కూడా అనుకోలేదన్నారు.
సినిమాలో అందరూ చాలా బాగా చేశారని…నేను అనుకున్న దాని కంటే సినిమా వెయ్యి రెట్లు బాగుందంటూ మంచు మనోజ్ తన అన్న విష్ణు సినిమాపై పొగడ్తలు కురిపించాడు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని ప్రార్థిస్తున్నా. మీ శ్రమకు తగిన ఫలితం దక్కాలని, పెట్టిన డబ్బు రెట్టింపుగా తిరిగి రావాలని కోరుకుంటున్నా’’ అని మనోజ్ తెలిపారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తనను భావోద్వేగానికి గురిచేశాయన్నారు. తన తండ్రి మోహన్‌బాబు యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇది చూసిన మంచు అభిమానులు మంచు అన్నదమ్ముల మధ్య భేషజాలను శివయ్య సినిమా తొలగించిందంటూ కామెంట్లు పెడుతున్నారు.