Love Tragedy | పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమమైన ప్రేమికులు.. ఇంతలో ఊహించని విషాదం!

ఇద్దరి మధ్య ఇన్‌స్టా‌గ్రామ్ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి వాళ్ల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ ఇంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. కుల సాంప్రదాయంలో భాగంగా స్నానం చేయడానికి గోదావరి నది వద్దకు యువతీయువకులు వెళ్లి స్నానం కోసం నదిలోకి దిగగా ప్రమాదవశాత్తు ఇద్దరు నీట మునగగా యువతి మృతి చెందింది.

విధాత :
ఇద్దరి మధ్య ఇన్‌స్టా‌గ్రామ్ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి వాళ్ల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ ఇంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. కుల సాంప్రదాయంలో భాగంగా స్నానం చేయడానికి గోదావరి నది వద్దకు యువతీయువకులు వెళ్లి స్నానం కోసం నదిలోకి దిగగా ప్రమాదవశాత్తు ఇద్దరు నీట మునగగా యువతి మృతి చెందింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..

సింగరేణిలోని బోరింగ్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న గోదావరిఖని విఠల్ నగర్‌కు చెందిన దానవేన రవితేజ.. పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామంలో పదో తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటివద్దే ఉంటున్న మౌనిక(17)కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రేండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారడంతో.. రవితేజను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో తన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మౌనిక నెల క్రితం గోదావరిఖనిలోని రవితేజ ఇంటికి వచ్చేసింది. అయితే మౌనిక మైనర్ కావడంతో 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేయాలని ఇద్దరి కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

ఇందుకోసం వచ్చేనెల ఒకటో తేదీన ముహూర్తం నిర్ణయించగా.. కుల సంప్రదాయం ప్రకారం.. మౌనిక, రవితేజ కుటుంబ సభ్యులు గోదావరి నది స్నానానికి వెళ్లారు. అయితే యువతీయువకులిద్దరూ ప్రమాదవశాత్తు నదిలో నీటమునిగారు. అక్కడే ఉన్న జాలర్లు, కుటుంబ సభ్యులు వెంటనే రవితేజను, మౌనికను బయటకు తీయగా, రవితేజకు ప్రాణాపాయం తప్పినప్పటికీ, అప్పటికే మౌనిక మృతి చెందింది. ఘటనపై మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.