Konda Surekha : రైతు సంతోషంగా ఉంటే రాష్టం సుభిక్షం

రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. సీసీఐ పత్తి కొనుగోళ్లతో రైతులకు లాభం చేకూరుతోందన్నారు.

Konda Surekha

విధాత, వరంగల్ ప్రతినిధి: రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గత పది సంవత్సరాలలో రైతు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రేవంతన్న నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని చెప్పి ఇబ్బందులకు గురిచేస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత వరికి బోనస్ ఇచ్చామన్నారు. వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేశామన్నారు. అదే తరహాలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన కొనుగోలు చేస్తున్నామని, నాణ్యమైన పత్తి తీసుకొని వచ్చి మంచి ధరను పొందాలని సూచించారు. కిసాన్ యాప్ ద్వారా బుక్ చేసుకుని యాప్ నిర్ధారించిన సమయం తేదీకి పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని పోవాలని సూచించారు. టీటీడీ తరహాలో యాప్ ను రూపొందించారని, సీసీఐకి పత్తి అమ్మితే వారం రోజుల లోపు రైతు ఖాతాలో నగదు జమ అవుతుందన్నారు. 23 మిల్లుల ద్వారా పత్తి కొనుగోలు చేస్తున్నారని, 12 శాతం లోపు ఉన్న పత్తిని కొనుగోలు చేస్తారని, పట్టా పాస్ బుక్ తీసుకొని వస్తేనే కొనుగోలు చేస్తారని స్పష్టం చేశారు. ఎఈవో ద్వారా జరిగే ఈ పత్తి కొనుగోలు ఆన్ లైన్ ద్వారా మాత్రమే జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవిందర్ రెడ్డి, మార్కెట్ అధికారులు పాల్గొన్నారు.