విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ రేవంత్ రెడ్డి ఆరు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.
రేవంత్ రెడ్డి ఈ నెల 31 వ తేదీ ఉదయం 7గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ లో , రాత్రి 8గంటలకు సోమాజిగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. నవంబర్ 1వ తేదీ ఉదయం ఏడు గంటలకు వెంగళరావునగర్ సోమాజిగూడలలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు నవంబర్ 1న ఉదయం బోరబండలో, రాత్రి 8 గంటలకు ఎర్రగడ్డలో, 4వ తేదీన ఉదయం షేక్ పేట 1డివిజన్ లో, రాత్రి రహమత్ నగర్ లో ప్రచారం చేస్తారు. 5వ తేదీన ఉదయం షేక్ పేట 2లో, సాయంత్రం యూసఫ్ గూడలో, 8వ తేదీన ఆరు డివిజన్లలో మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొంటారు. 9వ తేదీన షేక్ పేటలో ఉదయం 10గంటలకు మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి సైతం ఆ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు సహా ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులంతా వార్డుల వారిగా మకాం వేసి పార్టీ అభ్యర్థి మాటంటి సునీత గెలుపు కోసం పనిచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి లెంకల దీపక్ రెడ్డి విజయం కోసం కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు సహా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రచారం సాగిస్తున్నారు. మూడు పార్టీల పోటాపోటీ ప్రచారం..నాయకులు పరస్పర విమర్శలు, ఆరోపణల పర్వంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది.
