Adluri Laxman : మేము దండుపాళ్యం బ్యాచ్ అయితే వాళ్లు స్టూవర్ట్ పురం దొంగలా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్

మేము దండుపాళ్యం బ్యాచ్ అయితే వాళ్లు స్టూవర్ట్ పురం దొంగలా? అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. హరీష్ రావు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Adluri Laxman

విధాత, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గాన్ని దొంగల ముఠా దండుపాళ్యం బ్యాచ్ అంటూ మాట్లాడిన మాజీ మంత్రి టి.హరీష్ రావు వెంటనే మంత్రులకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మేము దండుపాళ్యం బ్యాచ్ అయితే వాళ్లు(బీఆర్ఎస్) స్టూవర్ట్ పురం దొంగలా? అంటూ మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ మీటింగ్ లో మంత్రులు కమీషన్ల పంపకాల గూర్చి మాట్లాడుకున్నారని, సీఎం రేవంత్ రెడ్డిపి ప్రభుత్వం మీద, పాలన మీద పట్టులేదంటూ హరీష్ రావు అబద్దపు ఆరోపణలు చేశారన్నారు.

గతంలో మంత్రిగా, ఉద్యమ నాయకుడిగా పనిచేసిన హరీష్ రావు రాజకీయాల కోసం కేబినెట్ లో మాట్లాడని అంశాలను మాట్లాడినట్లుగా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని లక్ష్మణ్ మండిపడ్డారు. హరీష్ రావు నోటికి ఎంతొస్తే అంత పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. బలహీన వర్గాల మంత్రులు ఉన్న కేబినెట్ ని దండుపాళ్యం బ్యాచ్ అని ఎలా అంటాడు? అని ప్రశ్నించారు. తక్షణమే మంత్రులకు హరీష్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.