Vem Narender Reddy | మిత్రుడికి రాజ్యసభ యోగం..రేవంత్ వ్యూహం

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. వారిలో తాజా మాజీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి రాష్ట్రం నుంచి అభ్యర్థిగా ఎంపిక చేశారు. రెండో స్థానానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రధాన సలహాదారుడిగా ఉన్న ఆయన మిత్రుడు, సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది.

విధాత : దేశంలో 10 రాష్ట్రాల్లోని 37 మంది రాజ్యసభ సభ్యుల స్థానాలకు మార్చి 16న జరుగనున్న ఎన్నికలకు సంబంధించి గురువారం నాటిలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియ్యనుంది. తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. వారిలో తాజా మాజీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి రాష్ట్రం నుంచి అభ్యర్థిగా ఎంపిక చేశారు. రెండో స్థానానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రధాన సలహాదారుడిగా ఉన్న ఆయన మిత్రుడు, సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. సింఘ్వీ, నరేందర్ రెడ్డిలు ఇద్దరు కూడా తమ నామినేషన్లు దాఖలు చేశారు.

టీడీపీ నుంచి మొదలైన రాజకీయ ప్రస్థానం

వేం నరేంద్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలు ఇద్దరు కూడా టీడీపీలో కొనసాగినప్పటి నుంచి మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. 1982లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన నరేందర్ రెడ్డి తెలుగు రైతు రాష్ట్ర సహాయక కార్యదర్శి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001లో నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు. 2004లో మహబూబాబాద్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత డీలిమిటేషన్ లో భాగంగా మహబూబాబాద్ నియోజకవర్గం 2009ఎన్నికల్లో ఎస్టీకి రిజర్వ్‌ కావడంతో ఆయన 2010లో పశ్చిమ వరంగల్ నియోజకవర్గం ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికతోనే ఓటుకు నోటు కేసు

వేం నరేందర్ రెడ్డి 2015లో టీడీపీ టికెట్‌తో తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలోనే ఓటుకు నోటు కేసు సంచలనం రేపింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నగదు ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి పై మే 30, 2015న కేసు నమోదైంది. ఇదే కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతంది. ఓటుకు నోటు కేసు తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి 2017 అక్టోబరు 29న న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరాడు .

కాంగ్రెస్ రధ సారధులుగా ఇద్దరు మిత్రులు

కాంగ్రెస్ పార్టీలో చేరాక వేం నరేందర్ రెడ్డి 26 జూన్ 2021న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. రేవంత్ రెడ్డి ఏకంగా జూలై 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియామితులవ్వడం విశేషం. 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ కన్వీనర్‌గా కాంగ్రెస్ పార్టీ నియమించింది. నరేందర్ రెడ్డిని నియమించారు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు, కాంగ్రెస్ గెలుపుకు నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. జనవరి 20, 2024న కేబినెట్ హోదాతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి (ప్రజా వ్యవహారాలు) సలహాదారుగా నియమించింది. తదుపరి 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు నియోజవర్గం పార్టీ ఇన్ చార్జీగా పనిచేశారు.

రేవంత్ ఆత్మగా పేరు

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చొరవతో వేం నరేందర్ రెడ్డి  రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. నాడు టీడీపీలో తన మిత్రుడు నరేందర్ రెడ్డిని  ఎమ్మెల్సీగా చేసే ప్రయత్నంలో భంగపడిన రేవంత్ రెడ్డి …నేడు అదే మిత్రుడిని సీఎం హోదాలో ఉండి..  రాజ్యసభకు పంపిస్తున్న వైనం కాల మహిమగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  గతంలో వైఎస్సార్ కు కేవీపీ మాదిరిగా ప్రస్తుత రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి నరేందర్ రెడ్డి అలాంటి ఆత్మ వంటివారని ప్రచారంలో ఉంది.  వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు కీలకం కానుంది. బీఆర్ఎస్ అభ్యర్థిని పోటీలోకి దించితే మాత్రం ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారనుంది.

Latest News