అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరో 3 సంవత్సరాల్లో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, జువ్వలదిన్నె మాత్రమే కాదు మొత్తం పది ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొంతం అని, ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు.. హార్బర్లను మత్స్యకారుల నుంచి చంద్రబాబు తాత కూడా తీయలేడు అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని హార్బర్లన్నీ మత్స్యకారులవే.. వాటిని చంద్రబాబు తాత కూడా లాక్కోలేడు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి షిప్ట్ చేస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని జగన్ ఆరోపించారు. బుధవారం ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించి.. స్థానిక మత్య్సకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమం గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచన చేయలేదు అని, మత్స్యకారులకు మేలు చేయకపోగా.. పొట్టపై తంతున్నారని జగన్ విమర్శించారు. జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమేందుకు కుట్రలు జరుగుతున్నాయని, స్థానిక మత్స్యకారులు తమిళనాడు బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మార్చి 12న మంత్రి నారా లోకేష్ జువ్వలదిన్నెను సందర్శిస్తే.. 16న సీజ్ చేసిన బోట్లు ఎత్తుకెళ్లిపోయారు. బోట్లు ఎత్తుకెళ్లిన కేసులో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా?. అధికారంలో ఉన్న పెద్దలే దొంగతనం చేసి తీసుకెళ్లారు, అందుకే ఎవరినీ అరెస్ట్ చేయలేదు అన్నారు. సీజ్ చేసిన బోట్లను బీదా సోదరులు అక్రమంగా అప్పగించారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు.. మత్స్యకారుల కడుపు కొట్టేందుకు ఇంత మంది ఏకమవుతున్నారు. బోట్లు ఎత్తుకెళ్లిన వారికి సీఎం కొడుకు ఆశీస్సులు ఉన్నాయని ఆరోపించారు.
మా ప్రభుత్వ హయాంలో రూ.26 వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టుకు శ్రీకారం చుట్టాం అని, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి కృషి చేశాం అన్నారు. అన్ని రకాల అనుమతులతో పోర్టులను ప్రారంభించాం. మారిటైం బోర్డు తీసుకొచ్చి పనులు వేగవంతం చేశాం అని గుర్తు చేశారు.
2024 మార్చి 12న జువ్వలదిన్నెను వర్చువల్‌గా ప్రారంభించాం. 1,250 మెకనైజ్డ్ బోట్లు అందించాలనుకున్నాం. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ బోట్లు మత్స్యకారులకు అందేవేనని, మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు కూడా 35 శాతం పూర్తి చేశాం అన్నారు. కాకినాడ పోర్టు పనులు కూడా వేగవంతం చేశాం. రామాయపట్నం పోర్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఏపీ ఎకనామిక్ గ్రోత్‌కు ఊతం ఇచ్చేలా ప్రణాళికలు చేశాం అన్నారు. మరి మిగిలిన పనులను కూటమి సర్కార్ ఎందుకు పూర్తి చేయడం లేదు?. జువ్వలదిన్నెలో 41 వేల టన్నుల మత్స్య సంపద దొరుకుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తై రెండేళ్లు గడుస్తోంది. దీనిని ప్రధాని జాతికి అంకితం చేసి ఏడాదిన్నరకు పైనే అవుతోంది. అయినా మత్స్యకారులకు ఎందుకు అప్పగించలేదు? అని చంద్రబాబు సర్కార్‌ను వైఎస్ జగన్ నిలదీశారు.
