విధాత : బీహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో బిహార్‌లో బీజేపీ పార్టీ తరపున సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి సీఎంగా, బీహార్ 21వ సీఎంగా సామ్రాట్ చౌదరి రికార్డు సాధించారు. ఆయనతో పాటు బిజేంద్ర ప్రసాద్ యాదవ్, విజయ్‌కుమార్ చౌధరీలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ఈసందర్భంగా సామ్రాట్‌కు మాజీ బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త ప్రభుత్వానికి తన నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. 243 మంది సభ్యులున్న బిహార్ అసెంబ్లీలో 89 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. గత ఏడాది నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జేడీ(యూ) అధినేత నీతీశ్‌కుమార్ నేతృత్వంలోని ఎన్‌డీఏ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్ కుమార్ నిన్న సీఎం పదవికి రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. పాట్నాలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు.
సామ్రాట్ చౌదరి రాజకీయ, పాలనా నేపథ్యం
సామ్రాట్ చౌదరి1968 నవంబర్ 16న ముంగేర్ జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి శకుని చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తల్లి పార్వతీ దేవి 1998లో అదే స్థానంలో అప్పటి సమతా పార్టీ తరఫున గెలిచారు. గత 12 ఎన్నికల్లో 9 సార్లు తండ్రి, తల్లి, కుమారుడు కలిసి ఆ స్థానంలో గెలిచారు. 57 ఏళ్లు సామ్రాట్ చౌదరి1990లో రాజకీయ ప్రవేశం చేశారు. ఆయన కుశ్వాహా సామాజిక వర్గానికి చెందినవారు. ఇది రాష్ట్ర జనాభాలో సుమారు 4.3 శాతం. బిహార్‌లో యాదవుల తర్వాత అతిపెద్ద ఓబీసీ వర్గం ఇదే. తన కుటుంబానికి కంచుకోట వంటి తారాపూర్ నియోజకవర్గం నుంచే బీజేపీ అభ్యర్థిగా సామ్రాట్ చౌధరీ 2025 ఎన్నికల్లో గెలుపొంందారు. తొలుత లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ప్రభుత్వంలో బీజేపీ నుంచి వ్యవసాయ మంత్రి పదవి చేపట్టారు. 2000, 2010 ఎన్నికల్లో పర్బట్టా అసెంబ్లీ స్థానంలో గెలిచారు. 2010లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చీఫ్ విప్‌గా ఉన్నారు. ఆ తర్వాత 2014లో కొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆర్జేడీని వీడి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)లో చేరి మంత్రి పదవి చేపట్టారు.
2017 చివరిలో మళ్లీ బీజేపీలో చేరారు. నీతీశ్‌కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు. 2023 మార్చి నుంచి 2024 జూలై వరకు బీజేపీ బిహార్ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంతో బీజేపీతో కలిసి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన నీతీశ్‌కుమార్.. తర్వాత ఆర్జేడీ నేతృత్వంలోని కూటమిలోకి వెళ్లిన నేపథ్యంలో సామ్రాట్ చౌధరీ ఆగ్రహించారు. నీతీశ్‌ను ఓడించాలని ప్రతిన బూని తలపాగా ధరించారు. అయితే నీతీశ్ కుమార్ మళ్లీ బీజేపీ నేతృత్వంలోని కూటమిలోకి రావడంతో అయోధ్య వెళ్లి తన తలపాగను సమర్పించి తన ప్రతిజ్ఞ విరమించారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణలో భాగంగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చిన నీతీశ్ కుమార్ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. రాష్ట్రంలో క్రీడలు, ఆర్థిక, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి-గృహ నిర్మాణ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. సుదీర్ఘ రాజకీయ, పాలన అనుభవం ఉన్న సామ్రాట్ చౌదరీ సీఎంగా బీహార్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ను విజయవంతంగా నడిపిస్తారని బీజేపీ విశ్వసిస్తుంది.
