Nitish Kumar| వివాదాస్పదమైన బీహార్ సీఎం నితీష్ కుమార్ చర్య

బీహార్ సీఎం నితీష్ కుమార్ చర్యలు తరుచూ వివాదాస్పదమవుతుండటం ఎన్డీఏకు తలనొప్పిగా మారింది. తాజాగా ఓ ముస్లిం మహిళ ముఖంపై నుంచి హిజాబ్ ను లాగడంపై దుమారం రేగుతుంది.

Nitish Kumar| వివాదాస్పదమైన బీహార్ సీఎం నితీష్ కుమార్ చర్య

విధాత, హైదరాబాద్ : బీహార్ సీఎం( Bihar CM) నితీష్ కుమార్( Nitish Kumar) చర్యలు తరుచూ వివాదాస్పదమవుతుండటం ఎన్డీఏకు తలనొప్పిగా మారింది. తాజాగా ఓ ముస్లిం మహిళ ముఖంపై నుంచి హిజాబ్ ను లాగడం(Hijab Controversy)పై దుమారం రేగుతుంది. ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలు పంపిణీ చేస్తున్న క్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వేదిక పైన ఒక మహిళ ముసుగు(హిజాబ్ )ను లాగారు. వేదికపైనే ఉన్న ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి స్పందించి నితీష్ ను ఆపేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ప్రతిపక్షాలు, మైనార్టీ సంఘాలు నితీష్ కుమార్ చర్యను తప్పబడుతూ విమర్శలు సంధిస్తున్నాయి.

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో 74 ఏళ్ల సీఎం నితీష్ కుమార్ పదోసారి ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా పాట్నాలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో నితీష్ కుమార్ ఒక మహిళా వైద్యురాలికి ఆయూష్ నియామక సర్టిఫికెట్ ఇస్తూ, ఆమె హిజాబ్‌ను తీయమని సైగ చేశారు. ఆమె స్పందించేలోపే నితీష్ కుమార్ స్వయంగా చేయి చాచి ఆమె ముఖం నుంచి హిజాబ్‌ను కిందకు లాగి తీసివేశారు. వేదికపై ఉన్న కొంతమంది నితీష్ చర్యతో విస్మయం వ్యక్తం చేస్తునే నవ్వుతూ కనిపించారు. నితీష్ చర్య రాజకీయంగా తీవ్ర దుమారం రేపుంది. నితీష్ మానసిక వైఖరి సరిగా లేదని..అతను వృద్దాప్య సమస్యలతో తరుచూ మతి భ్రమణం చెందినట్లుగా వ్యవహరిస్తున్నాడని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

సీఎం నితీష్ కుమార్ చర్యను ప్రతిపక్ష ఆర్జేజీ, కాంగ్రెస్ లు తీవ్రంగా తప్పుబడుతూ విమర్శలు సంధిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ఇంత నీచమైన చర్యకు పాల్పడితే, రాష్ట్రంలో మహిళలకు ఎంత భద్రత ఉంటుంది?” అని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆర్జేడీ ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ స్పందిస్తూ..ముస్లిం మహిళ ముసుగును (హిజాబ్) బలవంతంగా తొలగించడం అనేది ఆమె సాంస్కృతిక, మతపరమైన హక్కులను ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. మహిళల పట్ల బీజేపీ-జేడీయూ కూటమి వైఖరికి ఈ చర్య నిదర్శనమని విమర్శించారు. నితీష్ చర్య ఓ వ్యక్తికి గల మత, సంస్కృతిపరమైన స్వేచ్ఛతో జీవించే హక్కును లాక్కోవడమేనని ఆరోపించారు. నితీశ్‌ కుమార్‌ మానసిక స్థితి బాగాలేదని అర్ధమవుతుందని ఆరోపించింది.